శివసేనకు చెందిన 46 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండేను తమ నేతగా ఎన్నుకున్నట్టుగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారీకి లేఖ పంపారు. ఈ రోజు (బుధవారం) ఉదయం గౌహతికి చేరుకున్న శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏక్‌నాథ్ షిండేను నాయకుడిగా ఎన్నుకున్నట్టుగా అసమ్మతి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను మహారాష్ట్ర గవర్నర్ కు పంపారు.
మరో వైపు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు శివసేన సమావేశానికి రావాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. పార్టీ అధ్యక్షుడు ఉద్దావ్ థాకరే వర్గం జారీ చేసిన విప్ చెల్లదని ఏక్ నాథ్ షిండే తేల్చి చెప్పారు. శివసేన చీఫ్ విప్ గా భరత్ గోగవాలేను నియమించినట్టుగా ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. ఠాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభు జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవవని ఏక్‌నాథ్ షిండే తేల్చి చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మరో వైపు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి కూడా మద్దతును ఉపసంహరిస్తున్నామని కూడా ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.
అయితే ఎమ్మెల్యేల మద్దతు తెలిపేందుకు ఏక్‌నాథ్ సిండే గవర్నర్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోరినట్టుగా సమాచారం. తనకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని షిండే వర్గం చెబుతుంది. శివసేనకు చెందిన రెబెల్ ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టుగా షిండే వర్గం చెబుతుంది. సూరత్ నుండి మూడు ప్రత్యేక బస్సుల్లో పోలీస్ బందోబస్తుతో వచ్చి ప్రత్యేక విమానం ద్వారా శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు గౌహతికి చేరుకున్నారు. శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ చుట్టూ భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.
ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు శివసేన సమావేశానికి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో వర్గం దూరంగా ఉంటే శివసేన నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరో వైపు ఏక్‌నాథ్ షిండే వర్గం పంపిన లేఖపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడకుండా ఉండాలంటే ఏక్ నాథ్ షిండే కు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది.
మరో వైపు అసమ్మతి ఎమ్మెల్యేల శిబిరం నుండి నితిన్ దేశ్ ముఖ్ అనే ఎమ్మెల్యే తిరిగి వచ్చారు. తనను కిడ్నాప్ చేసి గౌహాతికి తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. సీఎం ఉద్దవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నట్టుగా తనకు సమాచారం లేదని ఆయన చెప్పారు. అసమ్మతి వర్గం ఎమ్మెల్యేల నుండి తాను తప్పించుకు వచ్చినట్టుగా నితిన్ దేశ్ ముఖ్ చెప్పారు. అయితే గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే లకు కరోనా సోకటంతో ఎవరితో ఎదురు బోదురుగా మాట్లాడే అవకాశం లేకుండా పోయింది.
Also Read : శివసేనలో ముసలం