20 Years of Career: డార్లింగ్ గా తెలుగు ప్రేక్షకుల చే పిలిపించుకునే ప్రభాస్ కేవలం ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఎవరు అనుకోలేదు.. కానీ ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా నేటితో 20 ఏళ్ళు పూర్తయింది. 2002 జులై 28 న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ ను పరిచయం చేస్తూ ఈశ్వర్ అనే సినిమా మొదలైంది. ప్రభాస్ పై ఆయన పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణం రాజు క్లాప్ కొట్టి సూపర్ స్టార్ గా ఎదగమని దీవించారు.. కానీ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని అప్పుడు కృష్ణంరాజు కూడా ఊహించలేదు.
సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి హీరోగా పరిచయం కావడమనేది మొదటి సినిమా వరకే ఉపయోగపడుతుంది, కానీ ఆ తరువాత సత్తా చాటి పోటీకి తట్టుకుని ఎదగడం అన్నది వారి వారి టాలెంట్ పై ఉంటుంది. అలా భిన్నమైన సినిమాలతో మాస్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్ ఒక్కో సినిమాతో ఎదుగుతూ ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక అయన నటిస్తున్న ‘ఆదిపురుష్’తో గ్లోబల్ స్టార్ గా కూడా మారబోతున్నాడు. ఎందుకంటే.. ఆదిపురుష్ సినిమాను అటు హాలీవుడ్ లోకూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
ప్రభాస్ కెరీర్ నేటికి 20 ఏళ్ళు పూర్తవడంతో అయన అభిమానులు ఈ ఆనందాన్ని సంబరంగా జరుపుకున్నారు. ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జె.ఎస్.ఆర్. శాస్త్రి ఆధ్వర్యంలో హైద్రాబాద్ లో కృష్ణం రాజు ఇంట్లో ఈ వేడుకలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొందరు అభిమానులతో పాటు ఈశ్వర్ సినిమాను తెరకెక్కించి, ప్రభాస్ ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ లతో పాటు రెబెల్ స్టార్ కృష్ణం రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
“ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అన్న సందేహం కలుగుతుంది. నిజంగా ఆ రోజు ప్రభాస్ ని హీరోగా పరిచయం చేద్దామని ముందు మేమే అనుకున్నాం. మా గోపి కృష్ణ బ్యానర్ లో ప్రభాస్ ని పరిచయం చేయాలనుకున్న తరువాత ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు. ఈశ్వర్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ, తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్ కు ఓకే చెప్పాం.”
జయంత్, అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. పైగా ఆ సినిమాలో అశోక్ కుమార్ చెడ్డ తండ్రి పాత్రలో నటించడం గొప్ప విషయం . ఒక నిర్మాత అయి ఉండి ఆ సినిమాలో విలన్ గా నటించాడంటే ఆయన గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ప్రభాస్ మొదటి సినిమా చూశాక తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదలే కారణం. ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉన్నాయి. ప్రభాస్ ని చుస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగానే కాకుండా సాటివారి పట్ల సహాయం చేసే గొప్ప గుణం ఉంది. ప్రభాస్ ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను” అని కృష్ణంరాజు ఆనందం వ్యక్తం చేశారు.