Saturday, November 23, 2024
HomeTrending Newsమంచి చేశాం కాబట్టే ధైర్యం: రోజా

మంచి చేశాం కాబట్టే ధైర్యం: రోజా

Be Ready: పేదల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని, 12 ఏళ్ల క్రితం వైఎస్ ఆశయాల మీద నాటిన పునాది ఈ పార్టీ జెండా అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి & కృష్ణాజిల్లా ఇంఛార్జి మంత్రి ఆర్కే రోజా రోజా అభివర్ణించారు. ఈ 12 ఏళ్లలో జగన్ ఎన్నో ప్రజా పోరాటాలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం ప్రజలకోసం పని చేస్తున్నారని ప్రశంసించారు. మచిలీపట్నంలోని సుమ కన్వెన్షన్ హాల్ లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ కృష్ణా జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయం దగ్గర పడుతోందని, పార్టీని మరోసారి గెలిపించుకుని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలు, నేతలకు పిలుపు ఇచ్చారు.

వెబ్ సైట్ నుంచి మ్యానిఫెస్టో తీసేసిన వ్యక్తి చంద్రబాబు అయితే మ్యానిఫెస్టోను భగవద్గీతలా భావించిన వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. నాయకుడంటే ఎలా ఉండకూడదో అనేదానికి చంద్రబాబు ఉదాహరణ అయితే, నాయకుడంటే ఎలా ఉండాలో జగన్ ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. గెలిచిన తర్వాత కార్యకర్తలను గాలికి వదిలేసిన వ్యక్తి చంద్రబాబు అయితే, కార్యకర్తలకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం ఇచ్చిన గౌరవించిన వ్యక్తి జగన్ అని ఇద్దరు నేతలను పోల్చి చెప్పారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసేస్తామని అచ్చెన్నాయుడు చెబుతున్నారని గుర్తు చేశారు.

దమ్ముంటే రండి…ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అంటూ బాబు, పవన్ లకు రోజా సవాల్ విసిరారు. ఒకరు రెండు చోట్లా ఓడిపోయారని, అయన ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని ఓడిస్తానంటున్నారని, మరొకరేమో సొంత కొడుకునే గెలిపించుకోలేని అసమర్ధుడని, అయన కాబోయే ముఖ్యమంత్రిని తానే అని చెప్పుకుంటున్నారని విమర్శించారు.

ఢిల్లీలో చక్రం తిప్పానని చంద్రబాబు కబుర్లు చెబుతారని, కానీ ఇప్పడు గల్లీలో కూడా గౌరవం దక్కక ఏడుస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పేదలకు మంచి చేస్తుంది కాబట్టే కాలర్ ఎగరేసి మరీ ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామని, చంద్రబాబులా ఎవరినీ జగన్ వెన్నుపోటు పొడవలేదన్నారు. చంద్రబాబు అనే చీడ పురుగును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, 2024లో మళ్లీ జగన్ ను సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని రోజా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక, ఫైబర్ నెట్ చైర్మన్ పొన్నూరు గౌతమ్ రెడ్డి, శాసనసభ్యులు కె. పార్థసారథి, సింహాద్రి రమేష్ , రీజినల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్