శ్రీలంక మహిళా జట్టుతో జరుగుతోన్నవన్డే సిరీస్ ను కూడా ఇండియా మహిళలు కైవసం చేసుకున్నారు. నేడు జరిగిన రెండో వన్డేలో భారత మహిళా జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 10వికెట్లతో ఏకపక్ష విజయం సాధించింది. శ్రీలంక విసిరిన 174 పరుగుల విజయ లక్ష్యాన్ని 25.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా సాధించింది. ఓపెనర్లు స్మృతి మందానా -94 (83 బంతుల్లో 11ఫోర్లు, 1సిక్సర్); షఫాలీ వర్మ- 71 (71 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్) పరుగులతో సత్తా చాటారు.
మూడు టి20లు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు భారత మహిళా క్రికెట్ టీమ్ శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి విదితమే. 2-1తో
టి-20 సిరీస్ గెల్చుకున్న ఇండియా…. రెండు వరుస మ్యాచ్ లు గెలుపొంది వన్డే సిరీస్ కూడా తమ ఖాతాలోనే వేసుకుంది.
పల్లెకలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పరుగుల ఖాతా తెరవక ముందే శ్రీలంక ఓపెనర్ హాసిని పెరీరా వికెట్, 3 పరుగుల వద్ద మరో ఓపెనర్ విష్మి గుణరత్నె వికెట్లను కోల్పోయింది. ఆ కాసేపటికే మాధవి కూడా డకౌట్ అయ్యింది. జట్టులో అమ కాంచన-47; నీలాక్షి డిసిల్వా-32; కెప్టెన్ ఆటపట్టు-27; అనుష్క సంజీవని-25 పరుగులతో ఫర్వాలేదనిపించారు. నిర్ణీత 50 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఇండియా బౌలర్లలో రేణుకా సింగ్-4; మేఘనా సింగ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
నాలుగు కీలక వికెట్లు తీసిన రేణుకా సింగ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.