తెలంగాణలో ఆదివాసీలపై, ప్రత్యేకించి భూమి హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్న మహిళల పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆదివాసీల హక్కులను అణిచివేయడం శోచనీయమన్నారు. ఈ మేరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీటర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. రాష్ట్రంలోని కోట్లాది ప్రజల ఉమ్మ్మడి ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ ఏర్పడిందన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆదివాసీ హక్కుల పరిరక్షణ ఒక ముఖ్యమైన భాగమని గుర్తు చేశారు. ఆదివాసీ గొంతును అణిచివేసేందుకు ఈ రోజు పోలీసు బలగాలతో అణచివేయడం తెలంగాణ ఆకాంక్షలకు అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూమి పట్టాలను అర్హులైన ఆదివాసీలకు బదలాయిస్తామని ముందుగా ప్రకటించి, ఆ తర్వాత వెంటనే వెనక్కి తగ్గిన కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసి ప్రజలకు ద్రోహం చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘జల్-జంగిల్-జమీన్’ రక్షణ కోసం అడవి బిడ్డల పోరాటంలో ఆదివాసీ సోదర సోదరీమణులకు అండగా ఉంటామని రాహుల్ గాంధీ ప్రకటించారు.