కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. పెద్దఎత్తున వరద వస్తుండటంతో అధికారులు 30 గేట్లు రెండున్నర అడుగులు ఎత్తి 1,14,823 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,18,183 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో తుంగభద్ర నదీ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినట్లు టీబీ బోర్డ్ ఎస్ఈ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
తూర్పున బంగాళాఖాతం నుంచి పడమర అరేబియా సముద్రం మధ్య విస్తరించిన షీర్ జోన్ వల్లే వారం రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. షీర్ జోన్ వారం రోజులుగా 19 నుంచి 20 డిగ్రీల అక్షాంశాల మధ్యే (ఉత్తర కోస్తా నుంచి ఒడిసాలో భువనేశ్వర్ మధ్య) ఉండిపోయింది. అదే సమయంలో రుతుపవనాల ద్రోణి తూర్పు భాగం ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిసాల మీదుగా కొనసాగుతోంది. ఒడిసా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ, విదర్భ, మధ్య మహారాష్ట్రలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవన ద్రోణి ఉత్తరాదికి వెళ్లేందుకు మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని, అప్పటిదాకా మధ్య, దక్షిణ, పశ్చిమ భారతాల్లో వర్షాలు కురుస్తాయని నిపుణులు వెల్లడించారు..