శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స మాల్దీవుల నుంచి సింగపూర్ పయనమయ్యారు. మాల్దీవులకు రాజపక్స చేరుకున్నాడని తెలియగానే వేల మంది నిరసనకారులు రాజధాని మాలే లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాజపక్సకు ఆశ్రయం ఇవ్వొద్దని నినాదాలు చేశారు. ఓ ప్రైవేటు రిసార్ట్ లో విడిది చేసిన గోటబాయ రాజపక్స ఆయన భార్య లోమా రాజపక్స ఈ రోజు మధ్యాహ్నం మాల్దీవుల నుంచి సింగపూర్ పయనమయ్యారు. సౌది అరేబియా ఎయిర్ లైన్స్ ద్వారా వెళ్తున్న రాజపక్స కుటుంబం మరికాసేపట్లో సింగపూర్ చేరుకుంటారు.
శ్రీలంకను నాశనం చేసి తమ దేశానికి వచ్చిన రాజపక్సకు మాల్దీవుల జనాల నుండి కూడా నిరసనలు తప్పలేదు. శ్రీలంక అధ్యక్షుడిని కుటుంబంతో పాటు రానిచ్చినందుకు దేశవ్యాప్తంగా స్ధానికులు నిరసనలతో హోరెత్తించారు. శ్రీలంక అధ్యక్షుడి హోదాలో రాజపక్స రావటం వల్ల దేశంలోకి అనుమతించక తప్పలేదని ప్రభుత్వం ఎంత చెప్పినా ఆందోళనకారులు వినిపించుకోవటం లేదు.
నిజానికి రాజపక్స మాల్దీవుల్లోకి అడుగుపెట్టినంత మాత్రాన వాళ్ళకి వచ్చిన నష్టమేమీలేదు. కానీ ఒకదేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసి కోట్లాదిమంది ప్రజలను నానా వెతలకు గురిచేసిన రాజపక్స కుటుంబంపై అన్నీ దేశాల ప్రజల్లోను వ్యతిరేకత ఉంది. ఇందులో భాగంగానే అద్యక్షుడి కుటుంబం తమ దేశంలోకి రావటాన్ని జనాలు వ్యతిరేకిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం రాజపక్సకు సకల లాంఛనాలతో స్వాగతం పలకటం, విశిష్ట అతిధిగా మర్యాదలు చేయటాన్ని లోకల్ జనాలు తట్టుకోలేకపోతున్నారు.
మొదట దుబాయ్ వెళ్లేందుకు ప్రణాలికలు సిద్దం చేసుకున్నా… గల్ఫ్ దేశాల్లో శ్రీలంక వాసులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గోటబాయ రాజపక్స చేరుకున్నాడని తెలియగానే మాల్దీవుల కన్నా పెద్దమొత్తంలో నిరసనలు, ఆందోళనలు తలెత్తే ప్రమాదం ఉందని గల్ఫ్ దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. దీంతో రాజపక్స సింగపూర్ కు సిద్దమయ్యారు. సింగపూర్ లో లంకవాసులు ఉన్నా.. ఆ దేశ కటిన నిభంధనల దృష్ట్యా ఇబ్బందులు తక్కువని అంచనా వేశారు. ముందైతే సింగపూర్ కు వెళ్ళిపోయి అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలనేది నిర్ణయించుకుంటారని అంటున్నారు. రాజపక్స ఆలోచనల ప్రకారం చూస్తే ఇప్పుడిప్పుడే అధ్యక్షుడిగా రాజీనామా చేసేట్లు లేరు. ఎందుకంటే అధ్యక్షుడి హోదాలోనే ఏ దేశంలో అయినా రాజపక్స ల్యాండ్ అవ్వగలరు. అధ్యక్షుడిగా రాజీనామా చేసేస్తే మాజీ అధ్యక్షుడి హోదాలో శరణార్ధి అయిపోతారు. చివరకు ఏమవుతుందో చూడాలి.