Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅమూల్యమననా! ఆణిముత్యమననా

అమూల్యమననా! ఆణిముత్యమననా

In Memory Of Great Poet Samala Sadasiva :

నా దగ్గరున్న పుస్తకాలలో ఓ భారీ పుస్తకాన్ని మళ్ళా తిరగేస్తున్నాను. అక్షరాల 1232 పేజీల పుస్తకం. 125 మందితో కూడిన సంపాదక మండలికి సారథ్యం వహించిన కె. రామచంద్రమూర్తి గారి నేతృత్వంలో వెలువడిన ఈ పుస్తకం శీర్షిక “పరిశోధన”.

సామల సదాశివ గారి స్మృత్యర్థం
సొసైటీ ఫర్ సోషల్ ఛేంజ్ (కావలి) వారు ప్రచురించిన ఈ పుస్తకంలో మొత్తం 244 వ్యాసాలున్నాయి. వీటి గురించి చెప్పడానికి ముందు నేను ప్రస్తావించవలసిన ప్రధాన అంశం ఒకటుంది.

పరిశోధన సంపుటిలో తప్పులు దొర్లకుండా సకల జాగ్రత్తలు తీసుకున్న కె.వి. కోటిలింగం, ప్రమీల గార్లను మనసారా అభినందిస్తున్నాం అన్న సొసైటీ ఫర్ సోషల్ ఛేంజ్ చైర్మన్ రమణయ్య, డైరెక్టర్ తాతిరెడ్డిగార్లకు కృతజ్ఞతలు. ఒక్క అచ్చుతప్పూ లేకుండా ఇంతటి మహత్తర గ్రంథాన్ని ప్రచురించడం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ పుస్తకం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులే. ఒకటీ అరా అక్షరదోషాలు నా కళ్ళకు కనిపించాయి.

వాకాటి పాండురంగారావు, ముళ్ళపూడి వెంకటరమణ, రాయప్రోలు సుబ్బారావు, ఎస్. సదాశివ, శ్రీరంగం నారాయణబాబు, శ్రీశ్రీ, మల్లాది రామకృష్ణశాస్త్రి, కొండనల్లి శేషగిరిరావు, శ్రీపాద పినాకపాణి, పోరంకి దక్షిణామూర్తి ఇలా మహామహుల రచనలతో కూడిన ఈ గ్రంథాన్ని అమూల్యమననా లేక ఆణిముత్యమననా? లేక రెండూ అనొచ్చేమో. లేక ఇంకేమన్నా చెప్పినా తక్కువే అవుతుంది.

స్త్రీ వ్యక్తిత్వాన్ని మేలుకొలిపిన వైతాళికుడంటూ చలంగారి గురించి రచయిత పి. గోపాలకృష్ణగారి వ్యాసం చిన్నదే అయినా బాగుంది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారిని తెలుగు వేళ్ళున్న ప్రపంచస్థాయి రచయితగా వాకాటి పాండురంగారావు గారు అభివర్ణించిన తీరు ప్రశంసార్హం.

అలాగే మల్లాది రామకృష్ణశాస్త్రిగారి గురించి రాస్తూ మహనీయమూర్తులు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు మనకిక లేరు అన్నంత అమంగళకరమైనదీ అమిత బాధాకరమైనదీ మరొకటి లేదు మనస్సుకి అన్న మద్దిపట్ల సూరిగారి రచన ఎన్ని సార్లు చదివానో చెప్పలేను. అటువంటి గొప్పవారైన మల్లాది వారిని నా బాల్యంలో ప్రత్యక్షంగా చూసి మాట్లాడిన క్షణాలు చిరస్మరణీయం.

ప్రముఖల గురించి ప్రముఖులు పరిచయం చేసిన వ్యాసాలు చదువుతుంటే ఓహో ఇందుకా ఎందుకు ప్రముఖులయ్యా రనిపించింది. వేటూరి వారి గురించి సూరపురాజు రాధాకృష్ణమూర్తిగారి “వేణువు నొదిలే వేళ వెదురల్లే నిదురపోయి” వ్యాసం చదువుతుంటే ఎన్నెన్ని విషయాలు తెలిసాయో చెప్పలేను. “వేటూరి సుందరరామమూర్తకి నాకూ అరవై ఏళ్ళ అనుబంధం. మా అనుబంధాన్ని గురించి నేనుగాని, సుందరరామమూర్తిగాని ఎప్పుడూ ఎక్కడా ఎవరితోనూ ప్రకటించుకోలేదంటూ…” మొదలుపెట్టి కొనసాగించిన ఈ వ్యాసం అవశ్యపఠనీయమే.

ఈ వ్యాసం పక్కనే ఉన్న అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసుగారి “కాళిదాసు – షేక్ స్పియర్” వ్యాసం గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు.

ఈ తరం వారందరూ చదివి తెలుసుకోవలసిన తెలుగు ప్రసిద్ధుల కథనాలు అనేకమున్నాయి. ఈ పుస్తకం చదివితే తెలుగు సాహిత్యం గురించి రవ్వంతైనా తెలుసుకున్న వారమవుతామని నా అభిప్రాయం.

శారద, భారతి, అభ్యుదయ వంటి పాత పత్రికల నుంచీ, ఇప్పుడు అందుబాటులో లేని గ్రంథాల నుంచీ రచనలు సేకరించి వాటితో ఈ విజ్ఞాన ఖనిని పాఠకలోకానికి అందించడం అమోఘం.

ఈ సంపుటి సాక్షాత్కారానికి రామడుగు రాధాకృష్ణమూర్తిగారందించిన సాయం అంతా ఇంతా కాదు. ఆయన పుణ్యమానే నాకీ పుస్తకం దక్కింది. ఆయన నాకిచ్చిన కొన్ని పుస్తకాలలో ఇదొకటి కావడం నా భాగ్యమే. అందుకాయనకు ధన్యవాదాలు.

– యామిజాల జగదీశ్

Must Read : పి వి చెప్పే పాఠం

RELATED ARTICLES

Most Popular

న్యూస్