Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపుస్తకం- హస్త భూషణం

పుస్తకం- హస్త భూషణం

Reading Remedy: “తల్లీ! నిన్ను దలంచి పుస్తకంబు చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లన్ బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహినీ !
ఫుల్లబ్జాక్షీ ! సరస్వతీ ! భగవతీ ! పూర్ణేందు బింబాననా !”

అర్ధ శతాబ్దం కిందటి వరకు రోజూ ఉదయం స్కూల్ అసెంబ్లీ ప్రార్థనలో ఈ పద్యం పాడేవారు. నెమ్మదిగా సెక్యులర్ ప్రభుత్వాలకు ఇందులో అపచారమేదో కనిపించి…తల్లిని తలచి పుస్తకం తెరవద్దన్నారు. గుండె లోతుల్లో నుండి తీయటి, అర్థవంతమయిన మాటల పొంగు తన్నుకురావాల్సిన అవసరం అర్థం లేనిదయ్యింది. తెరచిన పుస్తకంలో అక్షరాలు, పదాలు, వాక్యాలు, భావాలు మన మెదడులోకి ప్రవహించి, సంలీనమై…వేన వేల భావాలుగా మళ్లీ మళ్లీ ప్రభవించడంలో పవిత్రతను, దైవత్వాన్ని దర్శించిన ఈ పద్యం పోతనదిగా కొందరు అనుకున్నారు. పోతన కావ్యాల ప్రారంభ ప్రార్థనా పద్యాల్లో ఎక్కడా ఇది లేదు. ఎవరో అజ్ఞాత కవిది. పోతన స్థాయిలోనే ఉంది కాబట్టి…క్రెడిట్ ఆయన అకౌంట్లోనే వేసింది లోకం. ఎవరిదో తెలియనప్పుడు పోతనదే అని అనుకోవడంవల్ల ఈ పద్యానికి ఇంకా ఇంకా విలువ పెరిగింది.

Reading

అ – క్షయం కలిపితే అక్షరం. నాశనం లేనిది. మనం పలికేదంతా అక్షరం కాదు. పలికితే శబ్దమే. అది గాలిలో కలిసి ఉనికి కోల్పోతుంది. రాస్తే అక్షయంగా నాశనం లేకుండా నిలబడి ఉంటుంది. అలాంటి అక్షయమయిన అక్షర లక్షలను పొదివి పట్టుకున్నది పుస్తకం.

రోజూ కొంత సేపు పుస్తకం తదేకంగా చదివితే ఎన్నెన్నో ప్రయోజనాలున్నాయని మానసిక శాస్త్రవేత్తలు, న్యూరో ఫిజిషియన్లు, సర్జన్లు చెబుతున్నారు.

1. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
2. మానసిక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
3. ఒత్తిడి నుండి బయటపడేస్తుంది.
4. ఒక విడతలో కనీసం 6 నిముషాలపాటు చదివితే గుండెపై అరవై శాతం ఒత్తిడి తగ్గుతుంది.


5. ఏకాగ్రత పెరుగుతుంది.
6. సృజనాత్మక, ఊహాశక్తి పెరుగుతుంది.
7. జీవితానికి మార్గదర్శనం దొరుకుతుంది.
8. స్ఫూర్తి పాఠాలు దొరుకుతాయి.
9. మనల్ను మనం తీర్చిదిద్దుకోవడానికి ఆదర్శాలు, అభ్యుదయాలు దారి దీపాలవుతాయి.

నాటకాన్ని సినిమా తినేసింది. సినిమాను ఇప్పుడు ఓ టీ టీ మింగేస్తోంది. టీ వీ లు అన్నిటినీ మింగేశాయి. సకల ప్రపంచాన్ని డిజిటల్ మీడియా మింగేసింది. తల్లి కడుపులో నుండి పుట్టేప్పుడే బొడ్డు పేగుతోపాటు సెల్ ఫోన్ తో పుట్టే ఇప్పటి తరానికి ఏదయినా సెల్ ఫోన్లోనే. వర్చువల్ క్లాసులు, ఆన్ లైన్ బోధనలు మొదలయ్యాక పుస్తకాలు తమకు తాముగా తెరమరుగవుతున్నాయి. తెర మీద చూసి, విని నేర్చుకోవడమే ఇప్పుడు ఫ్యాషన్. డిజిటల్ డిజి గజిబిజి గురించి ఇక్కడ అనవసరం.

పుస్తకాలు అద్దెకు తెచ్చుకుని, కొనుక్కుని చదివే రోజులు పోయాయి. పాత పుస్తకాలు అమ్మే అబిడ్స్ రోడ్లు నడిరోడ్డు మీద ఎటు పోవాలో తెలియక దిక్కులు చూస్తున్నాయి.

కొత్త పుస్తకం చేతికి అందగానే వచ్చే పేజీల వాసన, పుస్తకాలకు అట్టలు వేసుకుని, స్టిక్కర్లు అతికించుకుని, పేర్లు రాసుకుని, పేర్చుకున్న మురిపెం…అన్నీ చరిత్ర పేజీల్లో జ్ఞాపకంగా కలిసిపోతున్నాయి. ట్యాబుల్లో కిండెల్ పి డి ఎఫ్ డిజితాక్షరాలనే స్టయిలస్ పెన్ తో స్టయిలిష్ గా దిద్దే రోజుల్లో పలక హృదయం ముక్కలవుతోంది. బలపం బలహీనమై బడి బయట నిలుచుంది.

పాట, పద్యం, గద్యం, కథ, నవల, నాటకం, పురాణం, మంత్రం, తంత్రం, యంత్రం…బడి చదువులు, బతుకు చదువులు…ఎన్నింటిని మోసింది పుస్తకం? ఎన్ని విద్యలను నేర్పింది పుస్తకం? పుస్తకం జగతికి చేసిన సేవ రాయాలంటే ప్రపంచం కలపను పెన్నుగా, సముద్రాలను ఇంకుగా చేసుకున్నా చాలదు. పుస్తకం చరిత తెరిచిన పుస్తకం. అందుకే పుస్తకం హస్త భూషణం.

బతుకు పుస్తకంలో మీకో పేజీ మిగలాలంటే…అసలు పుస్తకంలో కొన్ని పేజీలయినా చదవాలి.
మనం బతకాలంటే పుస్తకం బతకాలి. ఆ పుస్తకమే మన బతుకు కావాలి.

పుస్తకాలు చదివితే పోయేదేమీ లేదు- అజ్ఞానం తప్ప.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఎక్కే గుమ్మం దిగే గుమ్మం

RELATED ARTICLES

Most Popular

న్యూస్