Headings: ప్రపంచ అథ్లెటిక్ పోటీల్లో మన నీరజ్ చోప్రా ఈటె గురి తప్పలేదు. ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ మీద ఇప్పుడు కోటి ఆశలు ఉండడం సహజం. జన్మకో శివరాత్రిలా ఒకసారి పతకం సాధించి తరువాత కనుమరుగయితే ఆ గెలుపు గాలివాటు అయి స్మృతి పథంలో చెదిరిపోతుంది. అలాంటిది ఒలింపిక్స్ లో మెరిసిన తరువాతి ఏడే ఈటెకు ఎదురుగాలి వీస్తున్నా నీరజ్ చేతి విసురు తగ్గలేదు. పతకం చేజారలేదు. కాకపొతే బంగారం గురి తప్పినా…రెండో స్థానంలో వెండి దక్కింది. ఈ వెండి బంగారంతో సమానం. ఈ సందర్భానికి మీడియాలో హెడ్డింగులు కూడా బంగారంగా ఉన్నాయి.
నీరజతమే బంగారం -ఈనాడు
నీ’రజత’ ధీర! -సాక్షి
రజత నీరాజనం -ఆంధ్ర జ్యోతి
వెండి కొండ -నమస్తే తెలంగాణ
Golden Silver -Times of India
తెలుగు, ఇంగ్లీషులో దాదాపు అన్ని శీర్షికలు బాగున్నాయి. వచ్చింది రజత పతకం. అతడి పేరు నీరజ్. దాంతో నీరజతం, నీరజతధీర, రజత నీరాజనం మాటలను పుట్టించారు. మాటల విరుపు, చమత్కారాల్లో నీరజ్ త్రో లా మెరుపు ఉంది.
గతంలో పి వి సింధుకు ఒలింపిక్స్ లో రజతం వచ్చినప్పుడు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా-
“సిల్వర్ మెడల్, విత్ గోల్డెన్ స్టాండర్డ్”
అని అద్భుతమయిన బ్యానర్ హెడ్డింగ్ పెట్టింది.
చరిత్రలో నిలిచిపోయే క్షణాలకు చరిత్రలో నిలిచిపోయే హెడ్డింగులు పెట్టాలి.
దేవెగౌడ ప్రధానిగా తన పరివారంతో ప్రభుత్వ ఖర్చుతో విదేశం వెళితే ఇండియా టుడే వారపత్రిక కవర్ స్టోరీ హెడ్డింగ్- “A Gowda’s day out”
వాజపేయి ప్రభుత్వం పోఖ్రాన్ అణు పరీక్ష జరిపినప్పుడు అదే ఇండియా టుడే హెడ్డింగ్-
“Jai Sree Bomb”
కొన్ని హెడ్డింగులు చదివాక ఇక లోపలి వార్త చదవాల్సిన పని ఉండదు. అంతగా సమాచారాన్ని ప్రతిబింబించేలా గొప్ప హెడ్డింగులు పెట్టడం ఒక కళ. విద్య. భాష మీద పట్టు; శబ్ద సంపద; నానార్థాల, పర్యాయపదాల జ్ఞానం; సామెతలు, నుడికారాలు, కొటేషన్లు, పాటలు, పద్యాలు, వాడుక మాటల మీద అవగాహన ఉండి మాటలను వాడుకోవాలి. ఇలాంటివారు మీడియాలో ఇంకా మిగిలి ఉన్నందుకు మనం అదృష్టవంతులం. లేకపోతే మీడియా మేఘాలు వర్షించే రుధిర ధారల్లో దారం తెగిన గాలిపటాలమై దారులు తెలియని చీకట్లలో ఉండిపోయేవాళ్లం.
నీరజ్ చోప్రా రజతానికి బంగారు పోతపోసి…అజ్ఞాతంగా మిగిలిపోయిన సబ్ ఎడిటర్లందరికీ పేరు పేరునా అభినందనలు.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :