“గాంధి పుట్టిన దేశమా ఇది?
నెహ్రు కోరిన సంఘమా ఇది?
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా?
ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు
సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవంత చోటు
పేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లకే భోజ్యం”
ఆరుద్రకు అప్పుడే తెలుసు సిఫారసు లేకపోతే చివరకు శ్మశానంలో కూడా చోటు దొరకదని. ఈ పాటలో ఘంటసాల బాధపడి యాభై ఏళ్లు కావస్తోంది. పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. సిఫారసు లేకపోతే ఎక్కడా చోటు దొరకడం లేదు.
కరోనా సెకెండ్ వేవ్ ఈడ్చి కొట్టినతరువాత అన్నిటికీ, అన్ని చోట్లా సిఫారసే ప్రధానం. లాక్ డౌన్లు, కర్ఫ్యూల్లో తిరగడానికి సిఫారసు. ఊళ్లు దాటడానికి సిఫారసు. రాష్ట్రాలు, దేశాల సరిహద్దులు దాటడానికి సిఫారసు. పెళ్లికి, పేరంటానికి సిఫారసు. వ్యాక్సిన్ కు సిఫారసు. రెమ్ డిసివర్ మందులకు సిఫారసు.
సిఫారసే ఇప్పుడు ఆక్సిజన్. కోవిడ్ పరీక్షకు సిఫారసు. పరీక్ష ఫలితం వెంటనే రావడానికి సిఫారసు. పాజిటివ్ వస్తే ఆసుపత్రిలో మంచానికి సిఫారసు. మంచి వైద్యానికి సిఫారసు. వెంటిలేటర్ కు సిఫారసు. ఆక్సిజన్ సిలిండర్ కు సిఫారసు. ఆసుపత్రి ఫీజు తగ్గింపుకోసం సిఫారసు. చివరకు పోతే- శవాన్ని త్వరగా దహనం చేయడానికి సిఫారసు. అంత్యక్రియల్లో పి పి ఈ కిట్లు వేసుకుని కడసారి కన్నీళ్లు కార్చడానికి సిఫారసు.
బతకడానికి సిఫారసు. ఊపిరి తీసుకోవడానికి సిఫారసు. ఊపిరి ఆగిపోయినా సిఫారసు.
“సిఫారసు లేనిదె శ్మశానమందు దొరకదు రవంత చోటు!
ఉన్నది మనకు ఓటు!
బతుకుదెరువుకే లోటు!”