ఉక్రెయిన్ లో వైద్య విద్య పూర్తి చేసుకున్న భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2022 జూన్ 30 వ తేది లోపు ఉక్రెయిన్ విశ్వవిద్యాలయాల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న వారిని ఎఫ్.ఎం.జి పరీక్షకు అనుమతిస్తామని ఈ రోజు నేషనల్ మెడికల్ కమిషన్ స్పష్టం చేసింది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎక్సామినేషన్ రాసి ఉత్తీర్ణులు అవుతేనే భారత దేశంలో వైద్యులుగా సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది.
ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో వేల మంది విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. దీంతో వారందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి నుంచి తమకు భారత్ లో అనుమతి ఇవ్వాలని అనేకమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో వైద్య విద్య పూర్తి చేసుకున్న వారికి ఉరట లభించినట్టయింది. కోర్సు మధ్యలో ఉన్నవారు ఆ దేశంలోనే విద్యబ్యాసం పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి.