Environment Lovers: అక్కినేని అమల బ్లూ క్రాస్ వార్తలతో ఇరవై ఏళ్ల కిందట ప్రేక్షకులకు, పాఠకులకు మీడియా అంతులేని జంతు ప్రేమను అలవాటు చేసింది. ఆమె కోరుకున్న జంతు ప్రేమ అందరిలో వచ్చేసిందో? లేక ఆమెకే జంతు ప్రేమ తగ్గిందో? తెలియదు కానీ…బ్లూ క్రాస్ జంతు వార్తలు ఒక్కసారిగా మాయమైపోయాయి.
మళ్లీ ఇన్నాళ్లకు ఆ లోటును పూడుస్తూ అంతర్జాతీయ క్యాసినో విహార వినోద జూద పర్యటనల నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ జంతు ప్రేమ వార్తలతో మనుషుల మనసుల్లో పాశవిక ప్రేమ పురులు విప్పుతోంది.
మన అభిరుచులు, అలవాట్లే “మనం” అంటుంది మానసికశాస్త్రం. చికోటి చిన్నప్పుడు ఇంటి ముందు ఎలుగుబంటి వస్తే…అది కావాలని పట్టుబట్టాడట. దాంతో రెండ్రోజులు ఎలుగుబంటిని వాళ్ల ఇంటి ముందే కట్టేయించుకున్నారట డబ్బిచ్చి. ఎంత సున్నిత మనస్కుడో! పువ్వు పుట్టగానే పరిమళించినట్లు…చికోటి చిన్నప్పుడే ఎలుగుబంట్ల సహవాసం కోరుకున్నాడు. కాలసర్పాలకు నడక నేర్పాడు. చిలుకలకు చిలుక పలుకులు నేర్పాడు. ఉడుముకు పట్టు నేర్పాడు. బల్లికి పట్టు తెలిపాడు.
చికోటి ఎదిగేకొద్దీ ఈ జంతు ప్రేమ కూడా బుసలు కొడుతూ ఎదిగింది. దాంతో హైదరాబాద్ శివార్లలో పన్నెండెకరాల్లో ఫార్మ్ హౌస్లో అనేక జంతువులతో ఒక జూను ఏర్పాటు చేసుకున్నాడు. వివిధ దేశాల నుండి ఆయా జంతువులను అటవీ వన్యప్రాణి రక్షణ చట్టాలకు లోబడే తెచ్చాడా? చట్టాలను ధిక్కరించి తెచ్చాడా? అన్నది మీడియాకే చర్చనీయాంశం. చికోటి సర్వప్రాణులను సమాదరించే హృదయ వైశాల్యానికి అది ప్రతిబింబమే తప్ప ప్రతిబంధకం కాబోదు.
బుసలు కొడుతూ విషం చిమ్మే పైథాన్ పాము చికోటి ఫార్మ్ హౌస్లో మన్ను తిన్న పామై సన్యాసం తీసుకుని మూడు పూటలా పచ్చి గడ్డి తింటూ ఉండవచ్చు. చికోటి భుజం మీద ఊసరవెల్లి రంగులు మార్చలేక వివర్ణమై తన పేరు తనే మరచిపోయి బల్లినేమో అని అనుకుంటూ ఉండవచ్చు. ఉష్ట్రపక్షి అక్కుపక్షిలా దిక్కులు చూస్తూ ఉండవచ్చు. నిప్పుకోడి తనకు తాను నిప్పుల్లో దూకి వచ్చినవారి ఫలహారం ప్లేట్లో ఒదిగి ఉండవచ్చు. జంతువులు సహజమైన నిప్పు-ఉప్పు వైరభావం మరచి పాలు- నీళ్లలా కలిసి ఉండడానికి చికోటి ఎంత ప్రయాడపడి ఉంటాడో అటవీశాఖ వారు చూసి నేర్చుకోవాలి. పాము పడగ కింద టీ తాగే నిర్భయానక వాతావరణం సృష్టించిన చికోటి ప్రవీణ్ ప్రావీణ్యాన్ని ప్రభుత్వ జూ క్యూరేటర్లు కూడా సాధనతో నేర్చుకోవాలి.
కొంచెం లోతుగా వెళితే చికోటి జంతు ప్రేమలో ఇతరేతర అంశాలు కూడా బయటపడతాయి. చూడబోతే అతడు భయపడాల్సినవాటికి భయపడే గుణం కోల్పోయినట్లున్నాడు. జంతువుల్లో మనుషులను, మనుషుల్లో జంతువులను ఏకకాలంలో చూడగలగడం అందరికీ సాధ్యం కాదు.
చట్టం; న్యాయం, ధర్మం వేరు వేరు అంశాలు. చట్టాలు దేశ కాలాలను బట్టి మారుతూ ఉంటాయి. న్యాయం వాదనలోనే ఉంటుంది తప్ప న్యాయంగా న్యాయంలో ఉండదు. ఎవరి ధర్మం వారిది. ఎవరికి తోచిన ధర్మం వారిదే. ధర్మదేవతకు మామూలుగా నాలుగు కాళ్లు. కలిలో ధర్మదేవత ఒంటికాలి మీద నడుస్తూ ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. అందువల్ల నాలుగు కాళ్ల మీద నడిచే జంతువులతో పశు ధర్మాన్ని ఫార్మ్ హౌస్లో నాలుగు కాళ్లమీద నడుపుతూ కాలసర్పాన్ని ప్రతీకగా కాపలా పెట్టుకున్నట్లున్నాడు. చెట్టు పుట్టా, చీమ దోమలో దైవాన్ని దర్శించేవారికి ఇందులో పెద్దగా అభ్యంతరపెట్టాల్సింది ఏమీ ఉండకపోవచ్చు అని చికోటి అనుకుని ఉండవచ్చు.
అన్నట్లు-
పాకిస్తాన్ జూల్లో సింహాలకు తిండి పెట్టలేక వేలంలో అమ్మేస్తున్నారట. కొంచెం ముందు అయి ఉంటే చార్టర్డ్ విమానంలో వెళ్లి సింహాలను కొనుక్కుని…మెడకు తాడు కట్టి…పెంపుడు కుక్కల్లా చికోటి వెంట తెచ్చుకుని ఉండేవాడు. ఈ డి తొందరపడింది!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :