Costly Comments: కొన్ని సందర్భాలు వాటికవిగా గొప్పవి కాకపోవచ్చు. వాటిని గొప్పగా మలచుకునే ఒడుపును బట్టి అవి చాలా ప్రధానమవుతాయి.
గుజరాత్ గడ్డమీద అప్పటి ముఖ్యమంత్రి మోడీని యు పి ఏ చైర్ పర్సన్ హోదాలో సోనియా గాంధీ అన్న “మౌత్ కా సౌదాగర్- (మృత్యు బేహారి)” మాట మోడీకి ఎంత మేలు చేసిందో? సోనియాకు ఎంత కీడు చేసిందో? లెక్కకట్టడం అసాధ్యం.
తెలంగాణాలో రెండోసారి ఎన్నికల వేళ కాంగ్రెస్ తో కలిసి రెండు కళ్ల చంద్రబాబు దర్శనమివ్వడంతో కే సి ఆర్ కు ఎంత మేలు జరిగిందో? ద్వి దృష్టి తెలుగు దేశంతో పాటు కాంగ్రెస్ కు ఎంత నష్టం జరిగిందో లెక్కగట్టడం అసాధ్యం.
ఇంకొద్దిగా వెనక్కు వెళితే హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయంలో అంజయ్యకు జరిగిన అవమానంతో ఎన్ టీ ఆర్ కు కలిగిన లాభం ఎంతో? కాంగ్రెస్ కు జరిగిన నష్టం ఎంతో? లెక్కగట్టడం అసాధ్యం.
మొన్నటికి మొన్న స్వతంత్ర దేశ చరిత్రలో తొలిసారి ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయిన సందర్భంలో కాంగ్రెస్ ఎం పి అధిర్ చౌదరి అన్న మాట కాంగ్రెస్ కు ఆత్మహత్యా సదృశం. ఒరిస్సాలో 28 శాతం గిరిజనులు ఉన్నవేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బి జె పి ఎత్తులకు పై ఎత్తుగా ద్రౌపది ముర్ము ఎంపికను సాదరంగా స్వాగతించి హుందాగా ప్రవర్తించారు. దేశవ్యాప్తంగా గిరిజన ఓటు బ్యాంకుకు కాంగ్రెస్ తన వేలితోనే తూట్లు పొడుచుకుంది. కొన్నిరోజుల తరువాత దిద్దుబాటుకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పుకుంది కానీ…జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
సాధారణంగా సరిదిద్దుకోలేని ఇలాంటి తప్పులు చేయడంలో కాంగ్రెస్ దే పేటెంట్. ఇప్పుడు అందరూ అదే దారిలో ఉన్నారు.
తాజాగా మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర మనసును గాయపరిచాయి. ఎక్కడో ఏదో ఒక మామూలు ఆత్మీయ సమావేశంలో ఆయన అలవోకగా అన్న మాటలతో మహారాష్ట్ర బి జె పి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. బాంబే, థానేలో గుజరాతీలు, రాజస్థానీలు లేకపోతే మహారాష్ట్ర నిరుపేద అవుతుంది…బాంబే దేశ ఆర్థిక రాజధాని బిరుదును కూడా కోల్పోతుంది…అనే అర్థం వచ్చేలా గవర్నర్ మాట్లాడారు. సాయంత్రానికి దిద్దుబాటుగా వివరణ ఇచ్చుకున్నారు. తన ఉద్దేశం అది కాదన్నారు.
మహారాష్ట్ర మట్టిని ఇంతగా అవమానిస్తారా? అంటూ మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఎన్ సి పి నేతలు విరుచుకుపడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి షిండే కూడా గవర్నర్ వ్యాఖ్యలను ఖండించారు. అయినా వివాదం రాజుకుని రాష్ట్రమంతా విస్తరిస్తోంది.
గుజరాతీ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరులందరికీ బాంబేలో లాభార్జన పాఠాలు చెబుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా అగ్గికి ఆజ్యం పోస్తాయో ఊహించవచ్చు.
గుజరాతీ, రాజస్థానీ వ్యాపారుల మెళకువల మీద గవర్నర్ కు పులకింత ఉంటే ఐ ఐ ఎం అహ్మదాబాద్ లో పాఠాలు చెప్పుకోవచ్చు.
ఈ దేశ స్వాతంత్ర్యానికి మరాఠా వీరులు చేసిన నిరుపమానమైన సేవలు పులకింతకే పులకింతలు పుట్టించేవి.
హిందూ ధార్మిక చైతన్యానికి మరాఠీ గడ్డ నెత్తిన పెట్టుకున్న గణపతి భక్తికే పులకింతలు పుట్టించేది.
భారతీయ భజన సంప్రదాయానికి ఓనమాలు దిద్దిన మరాఠీ అభంగాలు పేరుకు తగ్గట్టు అన్ని భాషల్లో అభంగ మృదంగ తరంగమై మారుమోగడం జనసామాన్య నామ గానానికే పులకింతలు పుట్టించేవి.
ఏ భౌగోళిక ప్రాంతానికయినా దాని చరిత్ర, సంస్కృతి, ప్రత్యేకతలు దానికుంటాయి. నిలుచున్న నేల మీద గౌరవం లేకుంటే…కాలి కింద భూమి కూడా మోయడం బరువుగా భావిస్తుంది. చరిత్రలో ఉన్నతోన్నత స్థానాల్లో ఉన్నవారు ఎక్కడ ఏమి మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడినప్పుడు ఏమి జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.
-పమిడికాల్వ మధుసూదన్