Lord Siva-Chess: రెండ్రోజుల క్రితం 44వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ వైభవంగా ముగిసింది. తమిళనాడులోని మహాబలిపురం వేదికగా ఈ పోటీలు జరిగాయి. చదరంగం ఆట ప్రస్తావన మన పురాణాలు, ఇతిహాసాల్లోనే ఉంది. శివపార్వతులు చదరంగం ఆడినట్లు కూడా చరిత్ర చెబుతోంది.
తమిళనాడులో 1500 సంవత్సరాల క్రితమే చదరంగం క్రీడ ఉన్నట్టు చరిత్ర పుటలు చెబుతున్నాయి. ఈ క్రీడ పుట్టింది భారతదేశంలోనే అయినప్పటికీ ఐరోపా దేశాలలో ప్రాచుర్యం పొందింది.
చదరంగంలోని ప్రస్తుత ఆట స్వరూపం స్పెయిన్, దక్షిణ ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో పదిహేనో శతాబ్దం ద్వితీయార్థంలో అవతరించింది. ఈ ఆటలోని ప్రధానాంశం తన రాజుని కాపాడుకుంటూ ప్రత్యర్థి రాజును ఓడించడమే.
మన భారతదేశంలోనే ఈ క్రీడ పుట్టిన తమిళనాడులో పారంపర్య క్రీడగా చెప్పడానికి ఓ ఆలయ చరిత్ర తెలుపుతోంది. దాని గురించి తెలుసుకుందాం. అవును, తిరువారూర్ జిల్లా నీడామంగళం సమీపంలో మన్నార్ గుడి రహదారిలో పూవనూర్ అనే గ్రామం ఉంది. ఇక్కడ పూల తోటలు ఎక్కువగా ఉండి ఎప్పుడూ పరిమళం వీస్తుండటంతో ఈ పల్లెను మొదట్లో పుష్పవనం అనే చెప్పుకునేవారు. కాలక్రమంలో ఇది పూవనూరుగా మారింది. ఇక్కడున్న ఆలయం పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆలయం పేరు “చదరంగ వల్లభనాథర్ ఆలయం. శైవ క్షేత్రాలలో ఇది 103వది. ఈ ఆలయంలో మూలవిరాట్టు చదరంగ వల్లభ నాథుడు.
పూర్వం తెన్ పాండి దేశాన్ని వసుసేనుడు అనే రాజు పొలించేవాడు. అతనికి వారసులు లేరు. రాజదంపతులు శివభక్తులు. పరిపూర్ణ ఆయుర్దాయం కలిగిన వీరికి ఈ జన్మలో సంతాన భాగ్యం లేదన్న విషయం గ్రహించిన పార్వతీదేవి “నాథా! మిమ్మల్ని నిత్యమూ ఆరాధించే ఈ దంపతులను మానసిక వేదనకు గురి చేయవచ్చా? వారికి సంతానభాగ్యం ప్రసాదించవచ్చు కదా” అని అడుగుతుంది.
అంతట పరమేశ్వరుడు “ఈ జన్మలో వారికి సంతానం లేకపోవడం అనేది వారి విధిరాత. కానీ నువ్వు భూలోకంలో అవతరించి వారి బిడ్డగా ఎదుగుతావు. తగిన సమయంలో నేనొచ్చి నిన్ను వివాహమాడుతాను” అంటాడు.
ఆ వేళలోనే వసుసేనుడు, కాంతిమతి తామ్రపర్ణి నదీ తీరాన స్నానమాచ రించరిస్తుండగా తామరపూవు మీద ఓ శంఖం కనిపిస్తుంది. ఆ శంఖాన్ని తీయగానే వారి చేతిలో అది ఓ అందమైన బిడ్డగా మారుతుంది. ఆ పరమేశ్వరుడే తమకు పంపిన బిడ్డగా నమస్కరించి రాజరాజేశ్వరి అని పేరు పెడతారు. కంటికి రెప్పలా చూసుకున్న ఆ బిడ్డకు సకల కళలూ నేర్పిస్తారు. ఆ యువరాణి ప్రత్యేకించి చదరంగంలో దిట్టగా మారుతుంది. ఆమెకు పెళ్ళీడు వచ్చింది. తన కుమార్తెను చదరంగ క్రీడలో ఎవరైతే గెలుస్తారో వారికి తన బిడ్డనిచ్చి పెళ్ళి జరిపిస్తానని రాజు చాటింపు వేయిస్తాడు.
పలు దేశాలకు చెందిన యువరాజులు, యువకులు వచ్చి ఆమెతో చదరంగం ఆడుతారు. కానీ ఎవరూ గెలవలేదు. దాంతో రాజు దిగులు చెందుతాడు. తన బిడ్డనెవరూ ఓడించలేకపోయారు కదా? ఆమెకిక పెళ్లి కాదా అని బాధపడతాడు రాజు. ఇదే విషయాన్ని శివుడి దగ్గర విన్నవించడానికి భార్య, కుమార్తెతో కలిసి కావేరీ దక్షిణ తీరాన ఉన్న శివాలయానికి వెళ్తాడు. పలు శివాలయాలను ఆ రాజకుటుంబం దర్శించుకుంటూ ఆ రాజకుటుంబం తిరుపూవనూరులో నివాసముంటుంది
మరుసటిరోజు పొద్దున్న వయస్సుమళ్ళిన ఓ వ్యక్తి రాజును కలిసి “మీ కుమార్తె నాతో చదరంగం ఆడుతుందా?” అని అడుగుతాడు. అందుకు రాజు సమ్మతిస్తాడు. ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది. అప్పటివరకూ ఓటమి అనేది ఎరుగని రాజరాజేశ్వరి ఆ వృద్ధుడి చేతిలో తొలిసారిగా ఓడిపోతుంది. అయితే ఈ వృద్ధుడికి తన కుమార్తెనిచ్చి ఎలా పెళ్ళి చెయ్యాలా అని లోలోపల బాధపడతాడు రాజు. దాంతో రాజు శివుడిని ధ్యానిం చగా అక్కడ వృద్ధుడు అదృశ్యమై సాక్షాత్తూ పరమేశ్వరుడు దర్శనమిస్తాడు.
చదరంగపోటీలో రాజరాజేశ్వరిని ఓడించి పెళ్ళి చేసుకోవడంతో పరమేశ్వరుడికి “చదరంగ వల్లభనాథుడు” అనే పేరు వచ్చింది. రాజరాజేశ్వరికి పెంపుడు తల్లిగా వ్యవహరించిన చాముండేశ్వరికి ఈ ఆలయంలో ప్రత్యేక సన్నిధి ఏర్పాటైంది. ఇక్కడి వల్లభనాథుడిని దర్శించుకుని ప్రార్థించి చదరంగం ఆడితే ప్రావీణ్యం సిద్ధిస్తుందని పలువురి విశ్వాసం.
ఈ ఆలయ ఉత్సవ మూర్తిని పుష్పవనేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయంలో చాముండేశ్వరి సన్నిధి కూడా దర్శించుకోవచ్చును.
కనుక ఈ ఆలయ చరిత్రను దృష్టిలో పెట్టుకుని చదరంగ క్రీడ తమిళనాడులో పదిహేను వందల సంవత్సరాల క్రితమే పుట్టినట్టు చెప్పబడుతోంది. చదరంగం ఆడటాన్ని బుద్ధికి మంచి కసరత్తుగా పరిగణిస్తారు. మేధాశక్తి, విజ్ఞానపరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళానైపుణ్యం వంటివి ఈ ఆటకు అవసరం. ఈ ఆటకు కావలసినవి – తెలుపు, నలుపు గళ్ళు గల ఓ బోర్డు, నలుపు, తెలుపు పావులు.
పోటీ పడే ఇద్దరిలో ఒకరు తెల్లపావులతోనూ, మరొకరు నల్లపావులతోను ఆడతారు. ఆట ఆరంభంలో చెరో రాజు, (king), చెరో మంత్రి (దీనినే queen అనీ అంటారు), రెండు ఏనుగులు (rooks), రెండు గుర్రాలు (knights), రెండు శకటాలు (bishops), ఎనిమిది బంట్లు (pawns) ఉంటాయి. ఈ ఆట ఉద్దేశం ఎదుటి రాజును కట్టడి (checkmate) చెయ్యడమే.
క్రమబద్దమైన చదరంగం ఆటల పోటీలు 16 వ శతాబ్దంలో ప్రారంభించారు. చదరంగ చరిత్రలో మొదటి అధికారిక ప్రపంచ ఛాంపియన్ విల్ హెల్మ్ స్టీనిజ్. ఆయన 1886లో ఈ టైటిల్ గెలుచుకున్నాడు.
20 వ శతాబ్ద ప్రారంభం నుండి, వరల్డ్ ఛెస్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ కరస్పాండెన్స్ ఛెస్ ఫెడరేషన్ అనే రెండు అంతర్జాతీయ సంస్థలు చదరంగం ఆటల పోటీలను నిర్వహిస్తున్నాయి.
1990 తరువాత ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్ లైన్ చదరంగం కూడా అభివృద్ధి చెందింది.
చదరంగాన్ని చతురంగ అని కూడా అంటారు. మన భారత దేశం నుండి ఈ ఆట పర్షియాకి వ్యాపించింది. పర్షియా మీద దాడి చేసిన అరబ్బులు, దక్షిణ ఐరోపాకి ఈ ఆటను తీసుకుపోయారు. ఇక నలుగురు ఆడే చదరంగం బోర్డు 18 శతాబ్దంలో కనిపెట్టారు.
– యామిజాల జగదీశ్
Also Read :