టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కోవిడ్ సోకింది. ఆసియా కప్ కు బయల్దేరే ముందు జట్టు సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో ద్రావిడ్ కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ద్రావిడ్ కు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, అయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని బిసిసిఐ వెల్లడించింది. కోవిడ్ నుంచి కోలుకున్న వెంటనే ఆయన జట్టుతో చేరతారని పేర్కొంది.
ఆగస్ట్ 27నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఆసియా కప్ -2022 మొదలు కానుంది. ద్రావిడ్ మినహా మిగిలిన బృందం అంతా నేడు అక్కడకు బయల్దేరి వెళ్తోంది. సెప్టెంబర్ 11న ఫైనల్ తో టోర్నమెంట్ ముగియనుంది.
2018లో జరిగిన ఆసియా కప్ విజేతగా నిలిచిన ఇండియా డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది.
వచ్చే ఆదివారం ఆగస్ట్ 28న ఇండియా తన తొలి మ్యాచ్ ను దాయాది పాకిస్తాన్ తో ఆడబోతోంది. గ్రూప్ స్టేజ్ లో బెర్త్ కోసం ప్రస్తుతం జరుగుతున్న పోటీల్లో గ్రూప్ ఏ నుంచి క్వాలిఫై అయిన జట్టుతో రెండో మ్యాచ్ ఆడనుంది.