టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్!

టీమిండియా హెడ్ కోచ్ గా ఒకప్పటి మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ నియామకం దాదాపు ఖరారైంది. నియామక ప్రక్రియలన్నీ పూర్తి చేసి ద్రావిడ్ పేరును బిసిసిఐ ప్రకటించడం ఇక లాంఛనమే. నిన్న దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా లు ద్రావిడ్ తో సమావేశమయ్యారు. కోచ్ గా వ్యవహరించేందుకు ఒప్పించారు. తాత్కాలిక కోచ్ గా మిగిలిపోవడం తనకు ఇష్టం లేదని ద్రావిడ్ వారితో చెప్పినట్లు తెలిసింది. దీనితో ఈ నవంబర్ నెలాఖరు నుంచి 2023 చివరి వరకూ రెండేళ్ళ పూర్తి పదవీ కాలానికే ద్రావిడ్ నియామకం జరగనుంది. ప్రస్తుత కోచ్ రవి శాస్త్రి పదవీ కాలం ఈ టి-20 వరల్డ్ కప్ ముగిసే వరకూ ఉంది.  ఈ టోర్నీ ముగిసిన తరువాత కోచ్ బాధ్యతలనుంచి వైదొలుగుతానని రవి శాస్త్రి ఇప్పటికే ప్రకటించారు, మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ టోర్నీ ముగిసిన వెంటనే టి-20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని బిసిసిఐ కూడా ఆమోదించింది.  ప్రస్తుతం రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ గా రామకృష్ణన్ శ్రీధర్ వ్యవహరిస్తున్నారు.

వీరి స్థానంలో రాహూల్ ద్రావిడ్ తో పాటు బౌలింగ్ కోచ్ గా ఇర్ఫాన్ పఠాన్, బ్యాటింగ్ కోచ్ గా విక్రం రాథోడ్ లు నియమితులు కానున్నారు.  2016 నుంచీ కోచ్ పదవికి ద్రావిడ్ పేరు వార్తల్లోకి వస్తూనే ఉంది, అయితే అయన అందుకు అంగీకరించలేదు.  అనిల్ కుంబ్లే, ఆ తర్వాత రవిశాస్త్రి ఈ బాధ్యతలు చేపట్టారు. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమి బాధ్యతలతో పాటు అండర్-19, ఇండియా ‘ఏ’ జట్లకు కోచ్ గా ద్రావిడ్ పనిచేశారు. ఇటీవల శిఖర్ ధావన్ నేతృత్వంలో శ్రీలంకలో పర్యటించిన జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరించారు. ఈ సిరీస్ లో వన్డే సిరీస్ ను ఇండియా 2-1 తేడాతో; టి-20 సిరీస్ ను శ్రీలంక 2-1 తేడాతో గెల్చుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *