Saturday, November 23, 2024
HomeTrending Newsవనరుల సద్వినియోగం జరగట్లేదు - సిఎం కెసిఆర్

వనరుల సద్వినియోగం జరగట్లేదు – సిఎం కెసిఆర్

తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకుల అధ్యయన కార్యక్రమం రెండోరోజు కొనసాగుతున్నది.
ఇందులో భాగంగా శనివారం ఉదయం ప్రగతి భవన్ కు చేరుకున్న రైతు సంఘాల నేతలు సిఎం కెసిఆర్ తో భేటి అయ్యారు. వ్యవసాయం, సాగునీటి రంగం తదితర తెలంగాణ ప్రగతి పై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు. తమ క్షేత్రస్థాయి పరిశీలనకు, డాక్యుమెంటరీలోని దృశ్యాలు, వివరణలు అద్దంపడుతున్నాయని రైతు సంఘాల నాయకులు తెలిపారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన దేశవ్యాప్తంగా పాల్గొన్న దాదాపు 100 మంది రైతు సంఘాల నాయకులతో సమావేశం కొనసాగుతున్నది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ…‘‘మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ పాలన ఇంకా గాడిలో పడకుండా, ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను మనం అన్వేషించాలి. స్వాతంత్ర్య పోరాటం ముగిసిన దశాబ్దాల తర్వాత కూడా దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలను, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు సిద్ధపడుతుండటం ఎందుకో మనందరం ఆలోచించాల్సి ఉంది. ముఖ్యంగా దేశంలోని రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడంలేదో, ఈ దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో మనందరం చర్చించుకోవాల్సిన సందర్భం ఇది.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
‘‘చట్టసభల్లో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు నిర్లక్ష్యం వహిస్తుండటం, ప్రజల కోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేయడం అనే పొంతనలేని ప్రక్రియ ఒకటి ఈ దేశంలో కొనసాగుతుండటం మనందరి దురదృష్ణకరం.’’ అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు, ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు సంఘర్షించాల్సి ఉంటదని సీఎం అన్నారు. ఈ సంఘర్షణ ప్రారంభదశలో మనతో కలిసివచ్చే శక్తులు కొంత అనుమానాలు, అయితదా కాదా? అనే అపోహలకు గురవుతుంటారని సీఎం వివరించారు. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందన్నారు.
‘‘భారతదేశంలో ప్రకృతి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి దేవుడిచ్చిన వరం. అమెరికా, చైనా వంటి మిగతా ఏ దేశాలతో పోల్చి చూసినా నీటి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి, మానవ వనరులు భారతదేశంలోనే పుష్కలంగా ఉన్నాయి. దేశంలో మొత్తం 40 వేల కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉన్నది. ఈ భూముల సాగుకు కావల్సింది కేవలం 40 వేల టీఎంసీల నీళ్లు మాత్రమే. తాగునీటికి 10 వేల టీఎంసీలైతే సరిపోతాయి. మరి, 70 వేల టీఎంసీల నీటి వనరులు మన దేశంలో అందుబాటులో ఉన్నా కూడా, ఎందుకు సాగునీటికి, తాగునీటికి దేశ ప్రజలు ఇంకా కూడా ఎదురు చూడాల్సి వస్తున్నది. అదే సందర్భంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం మన దేశానికి ఉన్నది. అయినా, 2 లక్షల మెగావాట్ల విద్యుత్ ను కూడా వినియోగించుకోలేకపోతున్నాం.

తెలంగాణ రాష్ట్రం రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తూ, సాగునీటిని అందిస్తున్నపుడు ఇదేపనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయదు? రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్లు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్ లు ఉన్నాయా? సాగునీరున్నది. కరంటు ఉన్నది. కష్టపడే రైతులున్నారు. అయినా ఈ దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎందుకున్నది. రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయి? కేంద్ర పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయాలను మనం విశ్లేషించుకొని, చర్చించాల్సిన సందర్భం ఇది. మన దేశ వనరులను సరిగా వినియోగించుకుంటూ దేశ సౌభాగ్యాన్ని గుణాత్మకంగా అభివృద్ధి పరిచే రైతు వ్యవసాయ సంక్షేమ దిశగా సాగే సుపరిపాలన కోసం మనం అడుగులు వేయాల్సి ఉన్నది.’’ అని సీఎం కేసీఆర్ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ సహా ఢిల్లీ, ఒడిషా, గుజరాత్,కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్ గఢ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, అస్సాం, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పాండిచ్చేరి, దాదానగర్ హవేలి తదితర రాష్ట్రాలకు చెందిన, వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న పలువురు సీనియర్ రైతు సంఘాల నేతలు సహా దాదాపు 100 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : తెలంగాణలో 25 రాష్ట్రాల రైతు నేతలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్