Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏదేశమేగినా... ఎందుకాలిడినా....

ఏదేశమేగినా… ఎందుకాలిడినా….

Sweet Language:
త్రిలింగ మనదేనోయ్

తెలుంగులంటే మనమేనోయ్… ఈ పాట నా చిన్నప్పుడు మాబడికి వచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి ఎదురుగా మా పిల్లలందరం పాడాము. ఆ సన్నివేశం నాకు లీలగా గుర్తుంది. అదుగో అప్పుడు పట్టుకుందీ తెలుగు రుచి.

నా బాల్యం ఏలూరులో మా మాతామహుల ఇంట గడిచింది. వారి ఇంట్లో రెండు పేద్ద బీరువాలలో అనేక రకాలయిన పుస్తకాలు ఉండేవి. కాని వాటికన్నా మా అమ్మమ్మ ఉదయాన్నే పూజ చేసుకుంటూ పాడే ‘కలహంసల నడకలదానా ఎక్కడికే’, ‘సీతమ్మ వారి జడ’, ‘లక్ష్మణ దేవర నవ్వు’ పాటలు భలే నచ్చేవి. ఆవిడ ఇంట్లోని పనులన్నీ చేసుకుంటూ ఈ పాటలు పాడుకుంటుండేది. ఆ ప్రభావం నా మీద చాల ఉంది. తెలుగన్నా, తెలుంగులన్నా ఇప్పటికీ పిచ్చి అభిమానం. హైస్కూల్ చదువుకు మా సొంత ఊరు నరసాపురం వచ్చేసినా ఈ పాటల ప్రభావం పోలేదు సరికదా మరింతగా ముదిరిపోయింది.

అసలు ఆంధ్రుల చరిత్ర చదివితే మన పుట్టుకే విశిష్టమైన పుట్టుక. హరిశ్చంద్ర  మహారాజుకు పిల్లలు లేకపోతే పిల్లల కోసం వరుణ దేవుడిని మొక్కుకున్నాడట. పిల్లవాడు పుట్టినట్లయితే నీకే ఇచ్చేస్తాను. అసలంటూ ఒక పుత్రుడుదయిస్తే పున్నామ నరకం తప్పుతుంది కదా..అన్నాడట.  సరేనని వరుణుడు హరిశ్చంద్రునికి ఓ పుత్రుని అనుగ్రహించిన అనంతరం నీ మాట ప్రకారం వీడిని నేను తీసుకుపోతున్నానన్నాడట. హరిశ్చంద్రుడు ‘ఇప్పుడిప్పుడే కదా పుట్టాడు.  కాస్త అచ్చట, ముచ్చటా తీర్చుకోనీ’ సరేనన్నాడు వరుణుడు. ఆ పిల్లాడికి రోహితుడు అని పేరు పెట్టాడు. వరుణుడు అప్పుడూ గుర్తు చేశాడు. ఉపనయనం అయిన తరువాత చూద్దాం అన్నాడు హరిశ్చంద్రుడు. ఇలా కోర్టు వాయిదాల్లా కుదరదు ఇంక అని నిష్కర్షగా చెప్పేశాడు వరుణుడు. అప్పుడు మంత్రుల సలహాతో శునశ్యేపుడు అనే ఓ బ్రాహ్మణ పిల్లవాడిని దత్తత తీసుకుని ఆతని తల్లిదండ్రులకు కోరినంత ధనమిచ్చాడట.  వరుణుడ్ని రమ్మని శునశ్యేపుడు ని బలి ఇవ్వబోతున్నాడట. అప్పుడు విశ్వామిత్రుడు వచ్చి శునస్యేపుడ్ని రక్షించి అతనిని దత్తత చేసుకుని తన పెద్ద పుత్రునిగా ప్రకటించాడు.

దీంతో కోపగించుకున్న విశ్వామిత్రుని పెద్ద కుమారుడు “ఆంధ్రుడు’ తండ్రిపై ఎదురు తిరిగాడు. విశ్వామిత్రుడు ఆంధ్రుడ్ని శపించాడు. ఆ శాపంతో ఆంధ్రుడు ఇంటి నుండి వెడలిపోయి కృష్ణ, గోదావరి నదుల మధ్యలో రాజ్యం ఏర్పరుచుకున్నాడు. ఇదీ ఐతరేయ బ్రాహ్మణ్యంలో మన ఆంధ్రుల పుట్టుక కథ. భాగవతం లోనూ కొద్ది తేడాతో ఈకథ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఎదిరించి దేశాలు పట్టుకు పోవడం అన్నది మనకు పుట్టుకతో వచ్చింది అన్నమాట.

ఈ చరిత్రనంతా ఎందుకు తవ్వవలసి వచ్చిందంటే ఇప్పటికీ మన రాత అలాగే ఉంది. వెయ్యేళ్ళకు పూర్వమే ఉన్న తెలుగు భాషలో శాసనాలున్నాయి. ఈ భాష ద్రావిడ కుటుంబం లోనిది అని, కాదు ఆర్య, సంస్కృత భాషల సమ్మేళనంగా ఉద్భవించిందని కొందరూ సిగలు పట్టుకుంటున్నారు. వాళ్ళనలా పక్కన పెడితే తెలుగు భాషను ఆదిలో గ్రాంధికంలోనే పుస్తకాలు వ్రాసేవారు. గ్రామీణులు తప్ప నాగరుకులమనుకునే వారందరూ గ్రాంధీకాన్నే పట్టుకుని వ్రేళ్ళాడారు.

Gidugu Rammoorthy Panthulu

చరిత్ర, వ్యవహారాలు అందరికీ అందుబాటులో ఉండాలని అలాగైతే మాత్రమే భాష బ్రతుకుతుందనీ, ఉత్తరాంధ్ర దేశంలో ఇద్దరు ముసలాళ్ళకు తోచింది. వెంటనే ఒకాయన ప్రజలు మాట్లాడుకునే భాషలో ఓ నాటకం వ్రాసేశాడు (గురజాడ). ఈ భావాన్ని పండిత ప్రకాండులకు తెలియజెప్పాలని కాళ్ళకు బలపం కట్టుకుని దేశమంతా తిరిగాడు. ఆయనే ‘గిడుగు రామ్మూర్తి’ పంతులు గారు. ఇప్పటి ఒడిశాలోని పర్లాకిమిడి నుండి మద్రాస్ వరకూ నిరంతర శ్రామికునిలా విరామమెరుగక తిరిగాడు.

జయంతి రామయ్య పంతులు గారి నాయకత్వంలో పండిత ప్రకాండులంతా గ్రాంధిక భాషను సమర్ధిస్తూ సభలను నిర్వహించారు. ఆనాడు రాజమహేంద్రవరం లో గిడుగు రామమూర్తి గారిని సభ జరుపుకోనివ్వలేదు. అయినా లెక్క చేయక  గురజాడ, కందుకూరి ల మద్దతు తో వాడుక భాషోద్యమాన్ని రాష్ట్రమంతటా విస్తరించారు.

ఏ రాజమహేంద్రవరం అయితే తనను సమావేశానికి కూడ రానియలేదో అదే రాజమహేంద్రవరం లో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ “20 ఏండ్ల క్రిందట  నేను వాడుక భాష గురించి ప్రజలునచ్చ చెప్పవలెనని ఈళగరంలో ప్రయత్నిస్తే నాకు అవకాశమే రాలేదు. అట్టి రాజమహేంద్రవరం లో పూర్వము నాకు ప్రతికక్షులుగా ఉండే పలువురు కవిపండితుల సమక్షంలో నేడింతటి అపూర్వ సత్కారం జరగటం నా వ్యావహారిక భాషావాదం ప్రజాదరమూ, పండితాదరమూ పొందిందన డానికి ప్రబల తార్కాణం. నా కృషి ఫలించింది” అని అన్నారు.

గిడుగు వారు ఎంత పట్టుదల కలిగిన వారంటే, 1931లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తలపెట్టినప్పుడు ఆంధ్రుల పట్టణం పర్లాకిమిడి ని ఒరిస్సా లో కలపవద్దని రాజావారికి వినతించారు.  అయినా రాజా గారు వినలేదు.
విలీనానికి వ్యతిరేకంగా పర్లాకిమిడి నుండి మద్రాస్ ప్రావెన్సీ వరకూ సుమారు 65 ఏళ్ళ వయస్సులో నడచివెళ్ళి పాతపట్నం ఏటిలో స్నానం చేసి అక్కడ రైలెక్కి రాజమహేంద్రవరం చేరుకున్నారు.

సవరలు ఉత్తరాంధ్ర లో పెద్ద గిరిజన శాఖ. ఆ గిరిజనులు మాట్లాడుకునే భాషకు లిపి తయారు చేశారు.

ఆమహనీయుని జన్మదినం ఈరోజు. ఈరోజును రాష్ట్ర అధికార భాషొదినోత్సవంగా నిర్ణయించి సంబరంగా చేస్తున్నారు. భాషను బ్రతికించిన గిడుగు రామ్మూర్తి గారికి కృతజ్ఞతాంజలులతో

-చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ
9703115588

Also Read :

అవగాహన లేమి పెద్ద అవరోధం

Also Read :

భాషకు లోకం దాసోహం

RELATED ARTICLES

Most Popular

న్యూస్