Saturday, March 7, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రపంచం మెచ్చిన ఉపాధ్యాయుడు

ప్రపంచం మెచ్చిన ఉపాధ్యాయుడు

A Great Philosopher: అది మైసూర్ నగరం. ఒక ఉపాధ్యాయుని ఇల్లు. ఆ రోజు ఆ ఉపాధ్యాయుడు మైసూర్ విశ్వవిద్యాలయం నుండి శ్రీ అశుతోష్ ముఖర్జీ కోరికపై, కలకత్తా విశ్వవిద్యాలయంలో పనిచేయడానికి వెళుతున్నారు. స్వయంగా మైసూర్ మహరాజు పంపిన సార్ట్ బండి ఆయన కోసం సిద్ధంగా ఉంది. ఆయన వచ్చి బండిలో కూర్చోగానే జరిగింది ఆ సంఘటన.

కొంతమంది విద్యార్థులు వచ్చి బండికి కట్టిన గుఱ్ఱాలను తీసివేశారు. బండి కాడిని తమ భుజాలపైన వేసుకుని ఆ ఉపాధ్యాయుని మైసూర్ రైల్వే స్టేషన్ వరకూ ఊరేగింపుగా తీసుకు వెళ్ళారు. బహుశః ఆధునిక ప్రపంచంలో అంతటి గౌరవం పొందిన తొలి ఉపాధ్యాయుడు ఆయనే అయి ఉండవచ్చు. ఈ సత్కారాన్ని పొందిన ఉపాధ్యాయుడు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్  అయితే దీన్ని నిర్వహించిన విద్యార్థి బృందం నాయకుడు ఆ తర్వాత రోజుల్లో కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా చేశాడు. ఆయన పేరు ఎస్.నిజలింగప్ప. ఇది 1921 నాటి సంఘటన.

ఆంధ్రా యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ లకు వైస్ ఛాన్సలర్ చేసిన ఘనత  రాధాకృష్ణన్ ది.  ఒకసారి కొంతమంది మిత్రులు ఆయనతో సంభాషిస్తూ, మీలాంటి వారు ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జి లాంటి యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేసి ఉంటే మీ పేరు మరింతగా పరిమళించేది అన్నారట.

అందుకు సమాధానమిస్తూ  “నేను ఆ యూనివర్సిటీలకు విద్యార్థిగా కాదు. ఒక గురువుగా మాత్రమే వెళతాను” అన్నారు. అదే విధంగా 1937 నుండి’57 దాకా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ విజిటింగ్  ప్రొఫెసర్ గా పనిచేశారు.

హైస్కూల్ విద్య పూర్తి చేసుకుని కళాశాలలో చేరేటప్పుడు ఫీజుల కోసం తన బంధువుల్లో ఒకరిని సహాయం అడుగుదామని బయల్దేరిన రాధాకృష్ణన్ గారికి ఆ బంధువు మద్రాస్ స్టేషన్ లోనే ఎదురై తనదగ్గర సొమ్ము లేదని, పుస్తకాలు మాత్రం ఇవ్వగలనని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో చదువుకున్నారాయన.

బనారస్ హిందూ యూనివర్సిటీ లో వైస్ ఛాన్సలర్ గా చేస్తున్న కాలంలో ప్రతిరోజూ ఒక్కో అంశంపై విద్యార్థులకు ఉపన్యాసాలు చెప్పేవారు. ఆ గోడల దగ్గరకు వెడితే నాటి ఉపన్యాసాలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.

Dr Sarvepalli Radhakrishnan

హిందూధర్మంలోని విశేషాలను అత్యంత సూక్ష్మంగా పశ్చిమ దేశాలకు వివరించి చెప్పిన మనకాలపు వివేకానందుడు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్!!  ఆంధ్ర విశ్వకళా పరిషత్ ను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళిన మహనీయుడాయన. అక్కడి విద్యార్థి వసతి గృహాలకు ‘నాగార్జున, సిద్ధార్థ, శాతవాహన’ వంటి పేర్లు ఆయన పెట్టినవే!

రష్యా కు భారత రాయబారిగా వెళ్ళి , అత్యంత మొండివాడిగా పేరొందిన జోసెఫ్ స్టాలిన్ ను ఆత్మీయంగా పలకరించిన ఔదార్యం డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ది. “నన్ను ప్రపంచమంతా ఒక నాయకునిగా మాత్రమే చూసింది. కానీ నాలోని మనిషిని నాకు చూపించిన మహనీయుడు రాధాకృష్ణన్!” అని స్టాలిన్ చెప్పారు. స్వతంత్ర భారతావనికి తొలి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా రాథాకృష్ణన్ ఆ పదవులకే అలంకారమయ్యారు.

అప్పటి గ్రీక్ దేశపు అధ్యక్షుడికి స్వాగతం చెబుతూ  “మీకన్నా ముందే మీ దేశం నుండి మా దేశానికి కొంతమంది వచ్చారు. కానీ భారతదేశం తన హృదయ కవాటాలు తెరచి ఆహ్వానిస్తున్న గ్రీక్ దేశపు అధ్యక్షులు మీరు” అని అలెగ్జాండర్ గురించి నర్మగర్భంగా చెప్పారు.

స్వతంత్ర భారతదేశాన్ని తొలిసారిగా సందర్శించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ ను భారత పార్లమెంట్ సభ్యులకు పరిచయం చేస్తూ… రాధాకృష్ణన్ మాట్లాడిన తీరుకు, ఆయన వాడిన ఆంగ్ల పద సంపదకు అచ్చెరువొంది, ఐసెన్ హోవర్ తాను వ్రాసుకొచ్చిన ఉపన్యాసాన్ని తడబడుతూ చదివాడట. అటువంటి మహనీయుని జన్మదినాన్ని యావద్భారతదేశం ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటుంది.

ఈ సందర్భంగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి సహృదయ నివాళులు.

– చక్రావధానుల రెడ్డప్ప ధవేజి

Also Read :

పుస్తకం- హస్త భూషణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular