‘Anti”biotic: ఇరవై ఏళ్ళ క్రితం వరకూ మనకు ఏదైనా జ్వరం వస్తేనో, జలుబు చేస్తేనో తడిగుడ్డతో ఒళ్లంతా మర్దన చేసుకోవడం, ఆవిరి పట్టుకోవడం చేసేవాళ్ళం. మర్నాటికి తగ్గకపోతే అప్పుడు క్రోసిన్ టాబ్లెట్ వాడేవాళ్ళం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చిన్న చిన్న గ్లాజు సీసాల్లోంచి నాలుగైదు మాత్రలు ఒక పేపర్లో పొట్లం కట్టి ఇచ్చేవాళ్ళు. మరి కొందరైతే జ్వరం వస్తే వేడి అన్నంలో చింతకాయ పచ్చడి కలుపుకుని తినేవాళ్ళు. ఒకప్పుడు అమృతాంజన్, జండూ బామ్, విక్స్, జిందా తిలస్మాత్, నివారణ్ 90…. ఇవే మనకు తెలిసిన మందులు, వైద్యం. రాను రాను ఆస్పత్రుల సంఖ్య పెరిగే కొద్దీ మెడికల్ షాపుల సంఖ్య పెరిగింది. దీనితో పాటుగా అనాదిగా వస్తున్న సంప్రదాయ వైద్యాన్ని కాదనుకొని చీటికీ మాటికీ ఆస్పత్రుల చుట్టూ వెళ్ళే వారితో పాటు, నేరుగా మెడికల్ షాపుల్లో రోగం పేరు చెప్పి వారు ఏ మందు గోలీ ఇస్తే దాన్ని వేసుకొనే వారి సంఖ్య కూడా పెరిగింది.
వైద్యం ఓ మంచి బిజినెస్ గా మారిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు వారి వారి యాజమాన్యాల నిర్ణయాలకు అనుగుణంగా ట్రీట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకున్న వాళ్ళు కొంత కాలం నిజాయతీతో కూడిన వైద్యమే అందించారు గానీ, ఈ మందుల మాఫియా వారిని పొల్యూట్ చేసింది. ఇప్పటికీ కొంతమంది విలువలు కలిగిన వైద్యులు అక్కడక్కడా ఉన్నారు. తప్పనిపరి అయితే తప్ప యాంటీ బయాటిక్స్ రాయరు. ఇది ఆ వైద్యులని ఎరిగినవారి అదృష్టం. కానీ మెజార్టీ వైద్యులు నైతికత, సామాజిక బాధ్యత ఏమాత్రం లేకుండా ఉంటారు. ఇష్టానుసారం టెస్టులకు రాసి, అనవసరమైన యాంటీ బయోటిక్స్ రాస్తుంటారు. కరోనా సమయంలో వైద్యులు, ఆస్పత్రులు చేసిన నిర్వాకం చరిత్రలో నిలిచి పోయేంత ఉంటుంది.
దేశంలో ఈ యాంటీ బయాటిక్స్ వినియోగంపై బోస్టన్ యూనివర్సిటీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే నివేదికను లాన్సెట్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియా అనే జర్నల్ ప్రచురించింది. దీని ప్రకారం 2019 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 500 కోట్ల మందు గోలీలు మింగేశారు. వీటి విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. వీటిలో 90 శాతం వరకూ ప్రైవేటు హాస్పిటల్స్ లో డాక్టర్లు రాసినవి, మెడికల్ షాపుల్లో నేరుగా కొనుక్కొని మింగినవే ఉన్నాయి. అందునా అజిత్రో మైసిన్, సెఫిగ్జిమ్ డ్రగ్స్ ఎక్కువ మోతాదులో ఉన్నాయి. వినియోగించిన మందులైనా నాణ్యతా ప్రమాణాలు పాటించే ఫార్మా సంస్థలు తయారు చేసినవా అంటే అది కూడా కాదు, కేవలం 47.1శాతం మాత్రమే సెంట్రల్ గ్రడ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గుర్తింపు పొందినవి…… అంటే మిగినిలవన్నీ నకిలీ మందులే అన్నమాట.
- ఇది కరోనా రాక ముందు 2019లో చేసిన సర్వే, అదే 2020, 21 సంవత్సరాల్లో జరిగిన వినియోగంపై సర్వే జరిపి ఉంటే మరెన్నో కఠోర వాస్తవాలు బైటపడి ఉండేవి
- కరోనా సమయంలో నకిలీ ఫార్మా కంపెనీలు వీర విహారం చేశాయి. కమీషన్ల ఎర చూపి తమ ఉత్పత్తులను ఎడా పెడా మార్కెట్లోకి దించి కొనుగోలు చేయించాయి.
- మెడికల్, ఫార్మా మాఫియాలు ప్రభుత్వాలను శాసించే స్థాయిలో ఉన్నాయి కాబట్టి వాటి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
- యాంటీ బయాటిక్స్ వినియోగంపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి
- ఆస్పత్రికి వెళ్ళాలంటే జేబునిండా డబ్బు ఉండాలి కాబట్టి… ఇప్పటికీ మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టులు ఇచ్చే మందులపైనే ఎక్కుమంది జనాభా ఆధారపడుతున్నారు. పిచ్చి పిచ్చి మందులు వేసుకోవడం ద్వారా కొత్త రోగాలు తెచ్చుకొని తీరా ప్రాణాపాయ సమయంలో ఆస్పత్రులకు చేరి ఇల్లూ ఒళ్ళూ గుల్ల చేసుకుంటున్నారు.
- 142 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవాలన్న నిబంధన అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలా చేస్తే చాలా మెడికల్ షాపులు మూసుకోవాల్సి వస్తుంది.
ఓ వైపు ప్రభుత్వాలు సామాన్యులకు సరైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రస్తుతం ఉన్న వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలి. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులు కొంతమేరకైనా సామాజిక బాధ్యతతో వ్యవహరించి అనవసర టెస్టులు, మందులు రోగులకు ఇవ్వడం మానుకోవాలి.
మనం ఎప్పుడూ అంతేగా రోగం ఒకటైతే మందు వేరే వేస్తాం……
కొసమెరుపు:
జనానికి కూడా రోగం గంటల్లో తగ్గిపోవాలనే ఆత్రుత ఎక్కువైంది… ఇది కూడా యాంటి బయాటిక్స్ ఈ తరహా వినియోగానికి మరో కారణం.
Also Read :