దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో వాయు కాలుష్యం కరోనా వ్యాప్తికి తోడవుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ఆరు నెలలుగా గణాంకాలను పరిశీలిస్తే వాయు కాలుష్యం తక్కువగా ఉన్న జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కాలుష్యం ఎక్కువగా ఉండి అగ్నికి ఆజ్యం తోడయినట్లు…కరోనా వ్యాప్తి వేగానికి కారణమవుతున్న ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి.
ఊపిరితిత్తుల మీద తీవ్రమయిన ప్రభావం చూపే కరోనాకు- వాయు కాలుష్యానికి తప్పనిసరిగా సంబంధం ఉంటుంది. పరిశ్రమలు, వాహనాల, ఇతర కాలుష్యాలు ఈ ప్రాంతాల్లో గాలిని మరింత విషతుల్యం చేస్తున్నాయి. చెట్లను రక్షించుకోవడం, పెంచడం, కార్బన్ పదార్థాలను విడదల చేసే ప్రక్రియలను బాగా నియంత్రించడం తప్ప ఈ సమస్యకు మరో పరిష్కారం లేదు. లేకపోతే ప్రతి మనిషి వీపుకు ఆక్సిజన్ సిలిండర్ కట్టుకుని కృత్రిమంగా ప్రాణవాయువు పీల్చాల్సిన రోజులు వస్తాయి.