Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

S V Ranga Rao :

తెలుగు తెరపై ఆయన ఎదురులేని ప్రతినాయకుడు. తిరుగులేని మాంత్రికుడు. సాంఘికమైనా జానపదమైనా పౌరాణికమైనా తెరపై ఆయనతో తలపడటం కథనాయకులకు కష్టమైపోయేది. జమీందారుగా .. మహారాజుగా .. అసురచక్రవర్తిగా గంభీరంగా కనిపించే ఆయన ముందు నిలబడటం అంత తేలికైన విషయమేం కాదు. దర్పంతో కూడిన పాత్రలలో ‘ఔరా’ అనిపించిన ఆయన, నిరుపేద పాత్రలలో .. నిస్సహాయుడి పాత్రలలో ‘అయ్యో’ అనిపించేలా మెప్పించడం ఆయనకి మాత్రమే సాధ్యమైంది.

అంతలా నవరసాలను శ్వాసించిన .. శాసించిన నటుడిగా ఎస్వీ రంగారావు ( S V Ranga Rao ) కనిపిస్తారు. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకటరంగారావు. కృష్ణాజిల్లా నూజివీడు గ్రామంలో ఆయన జన్మించారు. మొదటి నుంచి కూడా ఆయనకి నటన పట్ల ఆసక్తి ఉండేది. అందువలన చదువుకునే రోజుల్లోనే ఆయన స్టేజ్ నాటకాలపై తన ప్రతిభను చాటుకున్నారు. ఉద్యోగం సంపాదించినా, నటనవైపే ఆయన మనసు లాగుతూ ఉండేది. అలా ఆయన 1946లోనే ‘వరూధిని’ అనే సినిమాలో అవకాశాన్ని సంపాదించుకోగలిగారు. కానీ ఆ సినిమా అంతగా ఆదరణ పొందలేదు.

ఆ తరువాత ఒకటి రెండు చిన్న చిన్న వేషాలను వేసిన రంగారావుకి, ‘షావుకారు’ సినిమాలో ‘సున్నపు రంగడు’ పాత్ర దక్కింది. అప్పట్లో గ్రామాల్లో తారసపడే ఆ తరహా వ్యక్తులను దగ్గరగా పరిశీలించిన ఆయన, సహజమైన తన నటనతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనలో తనదైన ప్రత్యేకత ‘పాతాళ భైరవి’ సినిమాలో మాంత్రికుడి పాత్రను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకి ఆయువు పట్టులాంటి ఈ పాత్రను కొత్తవాడైన రంగారావుకు ఇవ్వొద్దని దర్శక నిర్మాతలకు చాలామంది సన్నిహితులు చెప్పారట.

సన్నిహితుల మాటలను సైతం పట్టించుకోకుండా తనపై దర్శక నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎస్వీఆర్ నిలబెట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ అలాంటి మాంత్రికుడు తెరపైకి రాకపోవడమే అందుకు నిలువెత్తు నిదర్శనం. ‘సాహసము సేయరా డింభకా .. రాజకుమారి లభించునురా’ అంటూ ఆయన డైలాగ్ చెప్పిన తీరును .. ఆయన నటనా చాతుర్యాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ‘భట్టి విక్రమార్క’ .. ‘బాలనాగమ్మ’ సినిమాల్లోని మాంత్రికుడి పాత్రలు కూడా ఆ సినిమాలకి హైలైట్ గా నిలిచాయి.

S V Ranga Rao

తెలుగులో ఎన్టీఆర్ పేరు చెప్పగానే శ్రీరాముడు .. శ్రీకృష్ణుడు వంటి పాత్రలు ఎలా గుర్తుకు వస్తాయో, ఎస్వీఆర్ పేరు  వినగానే రావణుడు .. కంసుడు .. హిరణ్యకశిపుడు .. యముడు .. కీచకుడు .. ఘటోత్కచుడు .. బాణాసురుడు .. నరకాసురుడు వంటి అసుర పాత్రలు, ఆ పాత్రల్లో ఆయన చేసిన విశ్వరూప విన్యాసాలు కళ్లముందు కదలాడతాయి. ఒక వైపున తప్పును ఒప్పుకోలేని అహంభావం, మరో వైపున అందరినీ కోల్పోయాననే అంతర్మథనం చెందే రావణుడి పాత్రలో ఆయన పలికించిన హావభావాలను ఎప్పటికీ మరిచిపోలేం.

ఒక వైపున పుత్రవ్యామోహం .. మరో వైపున తన శత్రువు నామాన్ని స్మరిస్తున్నాడనే కోపం. అనురాగానికీ .. ఆగ్రహానికి మధ్య నలిగిపోయే హిరణ్యకశిపుడి పాత్రలో ఆయన ఆవిష్కరించిన నటన అసమానం .. అసాధారణం. మహా సౌందర్యరాశి అయిన ద్రౌపదిపై మనసుపడి, ఆమెను దక్కించుకోవడానికి కీచకుడిగా ఆయన ప్రదర్శించిన తహతహ అనిర్వచనీయం. ఇక ‘మాయా బజార్’లో ఘటోత్కచుడుగా ‘వివాహభోజనంబు .. ‘పాటలో ఆయన బాడీ లాంగ్వేజ్ .. ఎక్స్ ప్రెషన్స్ చూసి తీరవలసిందే. ఈ పాటలో రకరకాల వంటకాలవైపు ఆశగా ఆయన చూసే చూపులే ప్రేక్షకులకు నోరూరేలా చేస్తాయి.

S V Ranga Rao

అసుర సంబంధమైన పాత్రల్లో ఎస్వీఆర్ నటన ఆశ్చర్యచకితులను చేసేది. అందువలన ఆయా పాత్రల అంతర్మథనం పేరుతో ఆయనపై స్పెషల్ ఎపిసోడ్స్ మాదిరిగా భారీ సీన్స్ ను చిత్రీకరించేవారు. చూడటానికి అది ఒక ఏకపాత్ర అభినయం మాదిరిగా అనిపించేది. ఆ తరువాత ఆయా పాత్రలను ఎంతోమంది స్టేజ్ పై ప్రదర్శించేవారు. ఆ పాత్రలను ఎవరు పోషించినా ఎస్వీఆర్ ముద్ర నుంచి .. ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయేవారు. ఎంతగా ప్రయత్నించినా ఆయనను అనుకరించక తప్పేది కాదు. అదే ఆయన ప్రత్యేకత .. అదే ఆయన గొప్పతనం.

S V Ranga Rao

నటుడిగానే కాదు దర్శక నిర్మాతగా ఆయన ‘చదరంగం’ .. ‘బాంధవ్యాలు’ వంటి సినిమాలు చేశారు. ఆ సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పట్లో అటు ఎన్టీఆర్ .. ఇటు ఏఎన్నార్ ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ వెళుతుంటే, ఈ ఇద్దరి సినిమాల్లోను ఎస్వీఆర్ చెప్పుకోదగిన పాత్రలలో కనిపించేవారు. ఇద్దరూ కలిసి నటించిన సినిమాల్లోను సందడి చేసేవారు. అందుకు ‘మిస్సమ్మ’ .. ‘గుండమ్మ కథ’ సినిమాలే ఊరంతటి ఉదాహరణ. తెలుగు సినిమా కళామతల్లికి ఎన్టీఆర్ .. ఏఎన్నార్ రెండు కళ్లు అయితే, నుదుటున దిద్దబడిన ‘వీరతిలకం’ ఎస్వీఆర్ అని చెప్పొచ్చు. ఈ రోజున ఆయన జయంతి .. ఈ సందర్భంగా ఆ విశ్వనట చక్రవర్తిని మనసారా స్మరించుకుందాం.

(జూలై 3, ఎస్వీఆర్ జయంతి ప్రత్యేకం)

-పెద్దింటి గోపీకృష్ణ

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com