Politics.. only to use- not to do: “నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు”
“ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. నేను ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు”
“రాననుకున్నారా? రాలేననుకున్నారా?”
“రావడం ఆలస్యం కావచ్చేమో కానీ… రాకపోవడం అన్నది మాత్రం ఉండదు”
“రాజకీయం నా ఒంట్లో ఉంటది. నా ఇంట్లో ఉంటది”
ఇలాంటి పంచ్ డైలాగులు రాసేవారికి ఇప్పుడు విపరీతమయిన డిమాండు. తెరమీద నటనకు తగిన కథ, కథనం, మాటలు, పాటలు ఉండాలనుకోవడం తప్పు కాదు. అవసరం కూడా. హీరోలు చెప్పే ఇలాంటి టేక్ హోమ్ మెసేజులు ఎక్కువై అసలు రాజకీయం బుర్ర గోక్కుంటోంది.
ఏ హీరో ఎవరిని గురిపెట్టి ఏ విమర్శల డైలాగులు రాయించుకుంటున్నారో ఇప్పుడున్న ముఖ్యమంత్రులకు తెలుసు. ఆ చర్చ ఇక్కడ అనవసరం.
క్రమాలంకారంలో పై డైలాగులను పరిశీలిద్దాం.
నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా…నా నుంచీ రాజకీయం దూరం కాలేదు అంటే…మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి?
నేను ఎంత వదిలించుకోవాలనుకున్నా…విదిలించుకున్నా…విసుక్కున్నా…ముఖం మీదే తలుపులు మూసేసినా…ఈసడించుకున్నా…రాజకీయం నన్ను పట్టుకుని వదలట్లేదు. ప్రాధేయపడుతోంది…అని అనుకోవాలా?
నాలో అణువణువునా రాజకీయమే ఉంది అని చెప్పదలుచుకున్నారా?
రానున్న ఎన్నికల్లో తన అభిమాన పవనాలను ఒడుపుగా తిప్పదలచుకున్న వైపుకు తిప్పడానికి డైలాగులను ట్విట్టరీకరిస్తున్నారని అనుకోవాలా?
సినిమా వ్యాపారానికి డైలాగుల జాకీలు పెట్టి లేపే గాడ్ ఫాదర్ పాత్రకు సినిమాటిక్ జస్టిస్ చేస్తున్నారని అనుకోవాలా?
ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను- అంటే ఇదివరకు చాలా దగ్గరగా ఉన్నట్లు ఒప్పుకున్నట్లేగా?
ఆ దగ్గరగా ఉన్న కాలాలేవో?
ఎవరెవరితో దగ్గరగా ఉన్నారో?
ఏయే పార్టీలకు దగ్గరగా ఉన్నారో?
ఎవరికివారు తెలుసుకోవచ్చు.
రాననుకున్నారా?
రాలేననుకున్నారా? మాటలో పంచ్ బాగుంది. ఇంతకూ ఆ డైలాగ్ సినిమాలో విలన్లను ఉద్దేశించిందా? బయట ఓటర్లను ఉద్దేశించినదా?
సినిమాను దాటి ఇంకేవో ప్రయోజనాలను పిండుకోవాలని రాసినవారి రాజకీయ పరిజ్ఞానం, చెప్పినవారి రాజకీయ పరిణితి ఓట్ల మెట్ల దగ్గర పరీక్షలో తెలిసిపోలేదా?
రావడం ఆలస్యం ఎప్పుడయ్యింది?
రావాల్సినప్పుడే వచ్చారు కదా?
నిజమే. వచ్చి పోవడం ఉందేమో కానీ…రాకపోవడం లేనే లేదు కదా?
సినిమాలో ఆలస్యం బయట నిజమై…
బయట ఆలస్యం వల్ల సినిమాలు కూడా ఆలస్యమయితే…సినిమాలో కథాపరమయిన తొందరను బయట నిజమైన తొందర అనుకునే ప్రమాదం లేదా?
ఒంట్లో ఎవరికయినా రక్త మాంసాలే ఉంటాయి. మీరు మానవాతీతులు కాబట్టి మీ ఒంట్లో రాజకీయం ఉంటది. మీ ఇంట్లో కూడా ఉంటది.
కొంచెం తిక్కకే ఎన్నో లెక్కలుంటే…ఇంతింత రాజకీయ ప్రేరేపిత డైలాగుల తైతక్కలకు ఎన్నెన్ని లెక్కలుంటాయో లెక్క కట్టుకోలేనంత అమాయకులమనుకుంటున్నారా మమ్మల్ను?
మేము విజిలేస్తే…
జారుతుంది…!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :