Saturday, July 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబాధితులతో మ్యాచ్ వీక్షణ

బాధితులతో మ్యాచ్ వీక్షణ

Victims-Victory: భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టీ ట్వంటీలో భారత్ గెలిచి…సిరీస్ దక్కింది. కథ సుఖాంతం. ఈ మ్యాచ్ కు ముందు టికెట్ల కొనుగోలు వేళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్- హెచ్ సి ఏ అధ్యక్షుడు అజారుద్దీన్ నిర్ణయాల వల్ల అభిమానుల మనసులు గాయపడ్డాయి. పోలీసు లాఠీలు వాతలను మిగిల్చాయి. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.

తెలంగాణ క్రీడా మంత్రికే ఆలోచన వచ్చిందో…లేక ఎవరయినా సలహా ఇస్తే పాటించారో కానీ…ఈ మ్యాచ్ సందర్భంగా ఒక మంచి పని చేసి…తప్పును సరిదిద్దుకున్నారు. ప్రాయశ్చిత్తంగా గాయపడ్డ అభిమానులనందరినీ రవీంద్రభారతిలో పోగుచేసి…అక్కడినుండి పోలీసు వాహనాల్లో స్టేడియానికి ఉచితంగా తీసుకెళ్లి…వారితోనే కూర్చుని మ్యాచ్ చూశారు.

ఇది చాలా చిన్న వార్తే కావచ్చు. కానీ…చాలా పెద్ద విషయం. ఈపాటి చిన్నపనిని అదే పేరు గొప్ప అజారుద్దీన్ కూడా చేసి ఉండవచ్చు. అతడి ప్రాధాన్యాలు వేరు. అతడి దృష్టి వేరు. టికెట్ల అమ్మకం పేటీఎం కు అప్పజెప్పాము కాబట్టి విరిగిన అభిమానుల ఎముకలు అతికించే బాధ్యత తమది కాదని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడి పుండుమీద కారం చల్లాడు.

పెద్ద పెద్ద కార్యక్రమాల్లో ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి. తప్పు జరిగినప్పుడు పెద్ద స్థానాల్లో ఉన్నవారు ఆ తప్పును మరొకరిమీద నెట్టేయకుండా బాధ్యత తీసుకుంటేనే పెద్దరికానికి విలువ. గాయపడ్డ అభిమానులకు క్షమాపణ చెప్పడం కనీస ధర్మం.

ఏ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడడానికి టికెట్ల కొనుగోలప్పుడు దెబ్బలు తిన్నారో…అదే మ్యాచ్ కు ప్రభుత్వ వాహనాల్లో వెళ్లిన అభిమానులు తప్పకుండా అందరినీ క్షమించే ఉంటారు.

పోలీసు కేసులు, సాక్ష్యాధారాలు, బాధ్యులను విచారించడం, కోర్టులో నిరూపించడం, శిక్షలు పడడం వెంటనే జరగవచ్చు. కొన్ని యుగాలసేపు ఆలస్యం కావచ్చు.

బాధితులను వెంటబెట్టుకుని క్రీడామంత్రి మ్యాచ్ కు వెళ్లడంతోనే ఈ కేసులో కొంత న్యాయం జరిగినట్లు అయ్యింది. కొన్ని సందర్భాల్లో తీర్పుకన్నా నేర్పు ముఖ్యం. ఈ నేర్పు ప్రతీకాత్మక ప్రదర్శన అని పట్టించుకోని వారు కూడా ఉండవచ్చు. ఎవరో ఒకరు దీన్ని ఆదర్శంగా తీసుకుని…సందర్భమేదయినా బాధితులను ఓదారిస్తే…వారికి అండగా నిలబడితే... అంతకంటే కావాల్సింది ఏముంటుంది?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

అజారుద్దీన్ నిర్లక్ష్యం

RELATED ARTICLES

Most Popular

న్యూస్