Oath of Allegiance – Swearing in Ceremony & Language :
భాషలో ఒక మాట ఎలా పుట్టిందో తెలుసుకోవడానికి ప్రత్యేకమయిన వ్యుత్పత్తి పదకోశాలు ఉంటాయి. ఉన్న మాటలే వాడక మట్టిగొట్టుకు పోతుంటాయి కాబట్టి మాటల వ్యుత్పత్తి దాకా ఎవరూ వెళ్లరు. వెళ్లాలని నియమం కూడా ఏమీ లేదు. ఎన్నో మాటలు తెలియకుండా వాడేస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు ఆ మాటల పుట్టుక, అంతరార్థం తెలుసుకుంటే మంచిది.
రాజకీయాల్లో ఓనమాలు దిద్దడం రాకపోయినా పరవాలేదు. మంత్రివర్గ విస్తరణ అన్న మాట మాత్రం తెలిసి ఉండాలి. వార్డు మెంబరుగా వరుసగా ఓడిపోయినా పరవాలేదు. ఎమ్మెల్సీగా ఎన్నికై, రాజ్యసభ మెంబరై, మంత్రిగా సార్వభౌమాధికారం దగ్గర నోరు తిరగకపోయినా ప్రమాణం చేసి, ప్రజలకు బలంతంగా సేవ చేయాలన్న బలమయిన కోరిక మాత్రం ఉండి తీరాలి.
మంత్రిగా విధి నిషేధాల కంటే మంత్రి కావడం అన్న కల కలగా మిగిలిపోకుండా అది నెరవేర్చుకునే విద్య తెలిసి ఉండాలి. మంత్రివర్గ విస్తరణకు ముందు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కంట్లో పడాలి. జాతీయ పార్టీల్లో అయితే సభా మర్యాద దృష్ట్యా చెప్పకూడని ఇతరేతర విద్యలు తెలిసి ఉండాలి. విస్తరణ మాటకు వ్యుత్పత్తి అర్థం తెలియకపోయినా- విస్తరణ కోసం విస్తరి వేసుకుని సిద్ధంగా ఉండాలి.
సంస్కృతంలో మాటకు ముందు వచ్చేవి ఉపసర్గలు. అందులో “వి” చాలా విశేషమయినది. శ్రుత అంటే వినపడేది. విశ్రుత అంటే బాగా వినపడేది. అంటే పిండితార్థం బాగా వ్యాప్తి పొందినది. సృత అంటే వెళ్లడం అని అర్థం. వెళితేనే వ్యాప్తి అవుతుంది కాబట్టి-వ్యాప్తికి వెళ్లడమే ఆధారమవుతుంది. వి ప్లస్ సృతం కలిస్తే విస్తరణ అవుతుంది. అంటే చాలా ఎక్కువగా, విశేషంగా వ్యాపించినది అని అర్థం. తరణ అంటే దాటడం. దాటి వ్యాపించడం అన్న అర్థంలో వి ప్లస్ తరణ కలిసి విస్తరణ అవుతుందని పొరబడేవాళ్లు కూడా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో చోటు దొరికి, మంత్రులై తరించిన వారుంటారేమో కానీ- వ్యుత్పత్తి ప్రకారం వి ప్లస్ తరణ కాదు. మంత్రి అయ్యాక వితరణ గురించి వ్యాకరణం అడగదు. విస్తృతి అన్న మాట కూడా ఒకరకంగా విస్తరణకు దగ్గరగా ఉన్నదే. మంత్రివర్గ విస్తృతి అని రాస్తే బాగోదు. శబ్దానికి సంబంధించిన వ్యాప్తి అయితే విశ్రుత అని వాడాలి. మిగతా వ్యాప్తికి విస్తృత వాడాలి. గుడ్డి గూగుల్ అనువాదమే పరమ ప్రామాణికమయిన ఈరోజుల్లో శబ్దం విస్తృతమై, వ్యాప్తి విశ్రుతం చేస్తున్నా మౌనంగా భరించడం తప్ప ఏమీ చేయలేం.
విస్తరణం కోసం అనేక సమీకరణాల రణం జరుగుతుంది. కొందరు రాత్రికి రాత్రి “అనే నేను…” అనే నామస్మరణలో ఉంటారు. “కోహం?” నేనెవరు? అన్నది వేదాంత పరిభాషలో పెద్ద ప్రశ్న. రాజకీయాల్లో కూడా నేనెవరు? అన్నదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగా దొరికేవే పదవులు. అసలు పేరు పేరులేనిదై…కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎం పి…అన్న పేర్లతో పిలిపించుకోవడానికి జరిగేదే రాజకీయం. త్రేతాయుగంలో ఒకానొక సాయంత్రం గూని సర్వెంట్ మంథర చెబితే తెలుసుకున్న కైకేయిది అక్షరాలా రాజకీయమే. తన గారాల కొడుకు భరతుడు ప్రధాన మంత్రి అయ్యి కాన్వాయ్, గన్ మెన్లు, ఫోన్, ఫ్యాన్, ప్యూన్ అన్నీ ఉంటే ఎంత బాగుంటుంది? అని కైకేయి ముచ్చటపడింది. ఆ కొడుకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనేలేదనుకోండి- అది వేరే విషయం. భారతంలో కురు-పాండవులది రాజకీయమే. అలాంటిది కలియుగంలో అంతా రాజకీయం కాకుండా ఎలా ఉంటుంది?
నాలుగున్నరేళ్లు విస్తట్లో ఎంగిలి మెతుకయినా వేయకుండా- ఎన్నికలు ఆరు నెలల్లో ఉన్న రాష్ట్రాల విస్తరిలో మాత్రమే విస్తరణ పంచ భక్ష్య పరమాన్నాలు వడ్డించడం ఆధునిక విస్తరణ విధానం. ప్రతిభ, అనుభవం, పనితీరు, నీతి నిజాయితీల కంటే…కులం, మతం, ప్రాంతం, అవసరాలు, సర్దుబాట్లు, ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నవే విస్తరణకు ప్రాతిపదికలు అయిన కాలం.
చేయడం కంటే…చేసినట్లు కనిపించడం రాజకీయాల్లో ప్రధానం.
ఆ కోణంలో చూసినప్పుడు తాజా విస్తరణ నూటికి నూరు పాళ్లు సరయిన సమయంలో సరయిన విస్తరణ. ఇంతకూ విస్తరణ అంటే ఎక్కువగా వ్యాపించినది అనే కదా నిఘంటు అర్థం! ఆ కోణంలో విస్తరణకు లిటరల్ మీనింగ్ దొరికినట్లే. లిటరల్ జస్టిఫికేషన్ జరిగినట్లే.
-పమిడికాల్వ మధుసూదన్