మార్కస్ స్టోనిస్ బ్యాట్ తో విధ్వంసం సృష్టించడంతో టి20 వరల్డ్ కప్ లో నేడు జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్టోనిస్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 59(నాటౌట్) పరుగులు రాబట్టి జట్టును అలవోకగా గెలిపించి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు.
శ్రీలంక విసిరిన 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇన్నింగ్స్ నెమ్మదిగా ఆరంభించింది. 8.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు మాత్రమే చేసింది. డేవిడ్ వార్నర్-11; మిచెల్ మార్ష్-17 పరుగులు చేసి ఔటయ్యారు. తర్వాత గ్లెన్ మాక్స్ వెల్ మరోసారి తన సత్తా చాటి 12 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 23 పరుగులు చేసి భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద ఆశీన్ బండారా పట్టిన క్యాచ్ కు వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టోనిస్ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరో ఎండ్ లో ఉన్న కెప్టెన్ పించ్ అతనికి సహకరించాడు. పించ్ 42 బంతుల్లో ఒక సిక్సర్ తో 31 రన్స్ సాధించాడు. 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్ష్యాన్ని చేరుకుంది.
లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వా, చమీర కరునరత్నే, మహీష్ తీక్షణ తలా ఒక వికెట్ సాధించారు.
పెర్త్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, 6 పరుగుల వద్ద కుశాల్ మెండీస్ (5) ఔటయ్యాడు. రెండో వికెట్ కు పాతుమ్ నిశాంక-ధనుంజయ డిసిల్వా 69 పరుగులు జోడించారు. జట్టులో పాతుమ్-40; అసలంక-38; డిసిల్వా-26 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.
ఆసీస్ బౌలర్లలో హాజెల్ వుడ్, కమ్మిన్స్, స్టార్క్, మాక్స్ వెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.