Wednesday, December 18, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఫెయిల్యూర్ కథను గెలిపించిన కథనం

ఫెయిల్యూర్ కథను గెలిపించిన కథనం

Sagara Sangamam: The best movie ever made

నరుని బతుకు నటన; ఈశ్వరుడి తలపు ఘటన;
ఆరెంటి నట్టనడుమ; నీకెందుకింత తపన…?

ఈ ప్రశ్నకు సమాధానమే సాగరసంగమం సినిమా…!
ఓ ఫెయిల్యూర్ కథని చాలా సక్సెస్ఫుల్ గా చెప్పిన కథనం బహుశా మళ్లీ పునరావృతం కాలేదేమో.

యాభై రూపాయల పారితోషికం కోసం, చిరిగిన బట్టలతో, అరిగిన చెప్పులతో శైలజ నృత్యసమీక్ష రాయడానికి వచ్చిన బాలకృష్ణ, సినిమా మొదలైన పావుగంటలో తను ఆవాహనం చేసుకున్న సాంప్రదాయిక నృత్యరీతుల్ని అలవోకగా ప్రదర్శించి తన కదలికలతో మనల్ని కట్రాటల్ని చేస్తాడు.

కథని నాన్ లీనియర్ గా చెప్పిన తీరు అద్భుతం. వర్తమానంలో మొదలైన కథ, బాలకృష్ణని రఘు వెదుకుతూ వెళ్లి ఇంటికి తీసుకెడుతున్నప్పుడు మొదలైన గతం హీరో వెక్కిళ్లతో వర్తమానంలోకి వస్తుంది. వర్తమానంలో బాలకృష్ణ గురించి మాధవికి తెలిసి హైదరాబాద్ వచ్చిన తర్వాత భంగిమల ఫోటోలతో మొదలైన గతం బాలకృష్ణ వివరాల ఫోన్ కాల్ రావడంతో సమాప్తమవుతుంది. తర్వాత బాలుని బతికించుకోవాలని రఘూ, మాధవులూ; తన ఆత్మైన కళని బతికించుకోవాలనే బాలూ తాపత్రయమే మిగిలిన కథ. గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో ఏ కళకైనా అంతంలేదనే భరతవాక్యంతో సినిమా ఐపోతుంది.

Sagara Sangamam :

ఈ సినిమా విజయానికి కారణం నడిమితరగతికి చెందిన కుటుంబరావులూ; ప్రేమను వదులుకొని పెద్దలమాటతో పెళ్లికి తలవంచిన మంగతాయార్లూ కారణమేమో..!నాతో సహా ప్రతి గన్నాయ్ గాడూ తనలో బాలుకున్నంత టాలెంటుందనీ, ఏవో సత్రకాయ కారణాల వల్ల తాను సక్సెస్ కాలేదనీ అనుకుంటాడు. తిలక్ చెప్పినట్టు “అసలప్పుడే కాంగ్రెస్ లో చేరితే, ఈ పాటికి మినిస్టరునయ్యేవాణ్ననుకుని, ఓసారి నిట్టూర్చి దుప్పటి కప్పుకు పడుకుంటాడు. వాడికి ఆవగింజంతైనా టాలెంట్ లేకపోయినా, తనని తాను బాలూలో చూసుకుంటాడు. సగటుమనిషి చేతగానితనం బాలూ వైఫల్యంలో కనిపిస్తుంది.

పట్టు వదిలిన విక్రమార్కుడు బాలూ..!

మనసుతో ఆడుకునే సన్నివేశాలీ సినిమాలో బోలెడు.

1) బాలూ నాట్యకౌశలం తెలిసే మొదటి సన్నివేశం, తను విసిరికొట్టిన స్కార్ఫ్ మడతపెట్టి ఇవ్వడం, వెళుతుంటే ప్యూన్ ‌నమస్తే చెప్పడం.
2) కృష్ణాష్టమి రోజున వదిన ‌అన్నం ముద్దపెడితే ఏడుస్తూ ‌ఆమె చేతులు పట్టుకోవడం.
3) రెండు తప్పులు చేశారంటూ పత్రికాఫీసులో వీరంగం.
4) ఆలిండియా డాన్స్ ఫెస్టివల్ ఆహ్వానపత్రం సన్నివేశం.
5) తల్లి మరణం సన్నివేశం.
6) శివయ్య అమాయకత్వపు సన్నివేశాలు.
7) మాధవి సుమంగళిగా రావడం; విధవని తెలియడం..
8) మాధవి పెళ్లి గురించి బాలూకి తెలిసిన సన్నివేశం..
9) బాలూ, మాధవి కలిసి దిగిన ఏకైక ఫోటో అస్పష్టంగా వస్తుంది. వాళ్ల భవిష్యత్తు స్పష్టాస్పష్టంగా ద్యోతకమవుతుంది.

అన్ని భావోద్వేగాలూ చూస్తున్న మన గుండెని గొంతులోకి తెస్తాయి.

బాలూ ప్రేమప్రకటనా, మాధవి అయోమయంతో కూడిన ఇష్టం, తరువాత జరిగిన పెళ్లిని అంగీకరించిన తీరూ, గుప్పెడు పసుపు గులాబీలూ, ఓ ఎర్రగులాబీని ఊతంగా తీసుకుని చిత్రీకరించిన తీరు నాలో పూర్తిగా ఇంకిపోయింది. అలాంటి ఓ సన్నివేశం; ఆంధీ లో భార్యాభర్తల మధ్య “తెరేబినా జిందగీ సే కోయీ షిక్వా” లాంటి పాట చిత్రీకరణా పునరావిష్కరింపబడితే బావుండు.

నాకు వ్యక్తిగతంగా పని పెట్టుకున్నాక, దాని అంతుచూసే ఎల్వీ ప్రసాదులూ; నేనింతే రవితేజలూ; అంతఃపురం జగపతిబాబుల కథలే ఇష్టం..! కానీ, టాలెంటూ పనేం లేకుండా “మరుపురానీ బాధకన్నా మధురమేలేదూ..!” అంటూ విఫలమైన దేవదాసు కన్నా; అవి ఉండి “నేనెందుకిలా ఐపోయానో, మీరు పాత బాలూని చూస్తారు” అంటూ తనని‌తాను పునరావిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసిన బాలకృష్ణ కథ ఎక్కువ నచ్చింది.

పీ.యెస్.: ఈ సినిమా మల్టీస్టారర్. కనిపించే హీరో కమల్ హాసన్ ఐతే, కనిపించని వేటూరీ జంధ్యాలా ఇళయరాజాలు మరో ముగ్గురు హీరోలు…!

-గొట్టిముక్కల కమలాకర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్