Self-Realization: తప్పు చేయడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. కానీ…చేసిన తప్పొప్పుకోవడానికి మాత్రం చాలా ధైర్యం ఉండాలేమో! నేర విచారణలో పోలీసులు అవలంబించే మానవాతీత విద్యలన్నీ తప్పును ఒప్పుకోవడానికి చేసేవే. వాదనల తరువాత న్యాయాన్యాయ సమీక్ష చేసి శిక్ష వేయాల్సింది న్యాయస్థానం. న్యాయదేవత ముందుకు వెళ్లేలోపే ముద్దాయిలకు శారీరక, మానసిక, ఆర్థిక శిక్షలెన్నో పడుతూ ఉంటాయి. నేరం రుజువయితేనే దోషి. అంతవరకు నేరారోపణ ఎదుర్కొంటున్న ముద్దాయి మాత్రమే. వీటిమధ్య ఉన్న సన్నని విభజన రేఖ దేవాతావస్త్రం.
ఇప్పుడంటే చిన్నపిల్లలు పోలీసులను భయపెడుతున్నారు కానీ…ఇదివరకు పిల్లలు అల్లరి చేస్తే పోలీసుకు చెప్తా అని అమ్మలు భయపెట్టేవారు. అన్నం తినకుండా మారాం చేస్తే…తిను…తినకపోతే పోలీసు వస్తాడని బెదిరిస్తే…నిలువెల్లా వణికిపోయి…మారు మాట్లాడకుండా తినేవారు. కొన్ని వృత్తుల స్వభావం ఇతరేతర వృత్తులకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇదొక కొల్లేటరల్ ప్రయోజనం లాంటిది.
దేవుడికంటే దెబ్బే గురువు అన్నది పోలీసు అలిఖిత విధి వ్యవహార సూత్రం. కాలం, దేశం, సందర్భం, ఎదుటి మనిషి స్థాయిని బట్టి చెవులు వినలేని తిట్లు, చెంప దెబ్బ, లాఠీ, తుపాకీ ఇలా శబ్ద, స్పర్శ సంబంధ ఆయుధాలు మారుతూ ఉంటాయి.
సమాజ రక్షణకు పోలీసులు పరీక్షలు పాసై తీసుకున్న శిక్షణలో ‘శిక్ష’ ఉండనే ఉంది కాబట్టి దాన్ని రక్షలో భాగమయిన దీక్షా దక్షగానే పరిగణించాలి తప్ప కక్షగా చూస్తే వారేమి చేయగలరు?
మధ్యప్రదేశ్ లో ఒక ఆలయంలో దొంగతనం జరిగింది. బంగారం, హుండీ నగదుతో పాటు విలువయిన వస్తువులు పోయాయి. ఆలయ పాలకమండలి పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. కేసు విచారణ మొదలయ్యింది. ఆలయంతో మొదలుపెట్టి ఊరు ఊరంతా సి సి టీవీ కెమెరాల దృశ్యాలను జల్లెడ పడితే …క్లూ ఉంది కానీ దొంగ దొరకలేదు. రోజులు గడుస్తున్నాయి. భక్తుల్లో అసహనం మొదలవుతోంది. ఇక ఇంతే సంగతులు అని దేవుడి సొమ్ముకు నీళ్లు నువ్వులు వదులుకోవడానికి భక్తులు సిద్ధమవుతున్న వేళ…ఒక సూర్యోదయాన ఊరి పంచాయతీ భవనం అరుగుమీద ఒక మూట కనిపించింది. విప్పి చూస్తే…పోయిన దేవుడి బంగారం, నగదు అన్నీ అణా పైసలతో పాటు ఉన్నాయి. అందులో ఒక ఉత్తరం కూడా ఉంది.
“ఒక బలహీన క్షణంలో దొంగతనం చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. చేశాక మనసు మనసులో లేదు. అపరాధ భావం నన్ను నిలువెల్లా దహించి వేస్తోంది. తప్పొప్పుకుంటూ దొంగిలించిన దేవుడి సొమ్మును మూటకట్టి ఇక్కడ పెడుతున్నాను. క్షమించండి”
నేరం- శిక్షలకు సంబంధించిన భారతీయ శిక్షాస్మృతి ప్రకారం బహుశా…తప్పొప్పుకుని…దొంగిలించిన సొమ్మును పువ్వుల్లో పెట్టి తిరిగి ఇచ్చేసినా…శిక్ష తప్పదేమో! కాకపొతే తీవ్రత తగ్గితే తగ్గవచ్చు.
న్యాయం ఏ కాలంలో అయినా ఒకటే. ధర్మం మాత్రం కాలం, సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
దేవుడికన్నా…రేప్పొద్దున పోలీసు గురువులు కొట్టబోయే దెబ్బలకు ఈ మనసున్న దొంగ భయపడి…వెనక్కు ఇచ్చేశాడా? వెనక్కు ఇచ్చినా…కొట్టినా…కొట్టకపోయినా…దేవుడి సొమ్ము దొంగతనం మహా పాపం అని నిజంగానే పశ్చాత్తాపంతో ఇచ్చేశాడా?
అన్నది చర్చ.
ఎలా ఇచ్చినా…
వెనక్కు ఇచ్చినందుకు…
తప్పు ఒప్పుకున్నందుకు…
క్షమించమని ఉత్తరంలో వేడుకున్నందుకయినా మనం క్షమించి వదిలేయాలి.
లేకుంటే…
రేప్పొద్దున చేసిన తప్పులు ఒప్పుకోవడానికి ముందుకు రావు.
చేతులు జోడించిన తప్పులను క్షమించడానికి మనసులు ముందుకు రావు.
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదనే మానసిక శుద్ధి సంస్కారం స్థిరపడదు.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :