సీరం ఫార్మా కంపెనీ యజమాని ఆదర్/ఆధర్/అదర్ పూనావాలా అచ్చం సినిమాల్లో చూపించే సంపన్న పారిశ్రామికవేత్తలానే ఉంటాడు. ఆగర్భ శ్రీమంతుడు కాబట్టి అలాగే ఉండాలి. లండన్లో వారానికి యాభై లక్షల చొప్పున నెలకు రెండు కోట్లు పెట్టి ఇల్లు అద్దెకు తీసుకున్న అదర్ లో లక్ష్మీ కళ కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉంటుంది. ఆయన పేరు అదర్/ఆధర్/ఆదర్ లో ఏది సరయినదో ఆయనే చెప్పాలి. నిజానికి ఆధార్ పూనావాలా అయితే అర్థవంతంగా ఉండేది. అర్భకులయిన మనమంతా ఆయన వ్యాక్సిన్ మీదే ఆధారపడి వ్యాక్సినో ఆధర్ చంద్రా! అని అలమటిస్తున్నాం కాబట్టి- ఆయనకు ఆమాత్రం గర్వం, అహంకారం, లెక్కలేనితనం ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు.
కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణి, ధరలమీద ఇంత సీరియస్ గా సుప్రీం కోర్టు నుండి వీధుల్లో సామాన్యుల దాకా అందరూ గుండెలు బాదుకుంటుంటే- ఆయన లండన్ వెళ్లిపోయారు. ఎందుకు లండన్ లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాల్సి వచ్చిందో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. భారత దేశంలో ముఖ్యమంత్రులు మొదలు అందరూ వ్యాక్సిన్ కోసం తనతో పరుషంగా మాట్లాడుతున్నారట. కొందరు బెదిరిస్తున్నారట. ఆ ఒత్తిడి తట్టుకోలేక లండన్ లో హాయిగా ఉన్నాడట.
ఇదే కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసిన ఇంకో కంపెనీ పెద్దాయన- మేము చేయబోయే వ్యాక్సిన్ వాటర్ బాటిల్ రేటు కంటే తక్కువే ఉంటుంది అని ఊదరగొడితే జనం నిజమనుకుని ఆ వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూశారు. తీరా ఆ వ్యాక్సిన్ వచ్చి, దాని ధర తెలిశాక సుప్రీం కోర్టే తలపట్టుకుంది.
ఎవరి సౌభాగ్యం వారిది. ఎవరి అలవాట్లు వారివి. ఆదర్శాలు మీడియాలో రాసుకోవడానికే. ఆచరణలో ఎద్దు పుండు కాకికి ముద్దు.
అదర్ లండన్ వాలా లండన్లోనే సెటిలైపొతే ఒక జాతిగా మనకెంత అవమానం? వాటర్ బాటిల్ రేటెంత? ఆ బాటిల్ తో పోల్చి వచ్చిన వ్యాక్సిన్ రేటెంత? అని అవే తాటికాయంత అక్షరాలు ఇప్పుడు కనిపించవెందుకు? అని అడిగే అధికారం మనకు ఉండదు. అడిగినా చెప్పి తీరాలన్న రూలేమీ లేదు.
ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలి. రోగాలు కమ్ముకొచ్చినప్పుడే ఫార్మా కంపెనీలు సొమ్ము చేసుకోవాలి. ఇది నవీన ధర్మం.
దేవుడా!
ఉన్నావా?
అసలున్నావా?
ఉంటే- కళ్లు మూసుకున్నావా?
ఈ వ్యాక్సిన్ ధరల దందా చూడకున్నావా?
పమిడికాల్వ మధుసూదన్