Seetharamaiah Gari Manavaralu – A heart touching story with great emotions :
కోనసీమలో ఓ సీతారామాపురం. ఆ ఊర్లో మహారాజరాజశ్రీ మంచుకొండ సీతారామయ్య గారని ఓ కామందు. పాషాణంలా కనిపించే వెన్నముద్ద. డాక్టరీ చదువుతున్న ఏకైక పుత్రరత్నం శ్రీనివాసమూర్తి తన మాట కాదని ప్రేమవివాహం చేసుకుంటానని భీష్మించుకోవడంతో ఆ పెళ్లి చేసి కొడుకుతో మాట్లాడటం మానేస్తాడు. తండ్రి విధించిన శిక్ష భరించలేక వాసు సతీసమేతంగా అమెరికా పోవడంతో కథ ప్రారంభమవుతుంది.
సీతారామయ్య గారి పెద్దకూతురి కూతురు పెళ్లికి వాసు కూతురు సీత అమెరికా నుండి వస్తుంది. ఆ సీత, ఈ సీతారామయ్య గారి మనవరాలు. ఆ తాతామనవరాళ్ల భావోద్వేగాల ప్రేమకథే మిగతా సినిమా అంతా.
ఇంత నిక్కమైన తెలుగులోగిళ్ల సినిమా దాదాపుగా ఇంకోటి రాలేదు.
అక్కినేని నాగేశ్వరరావు గారి నటన శిఖరాయమానం. చిన్నచిన్న ఎమోషన్లని గొంతు పూడుకుపోయిన, గుండెల్లో ఆనందం నిండిన, కళ్లలో ఆగ్రహం నిండిన, ఛీత్కారం, వెటకారం, అభిజాత్యం, ప్రేమ నిండిన భావోద్వేగాలన్నీ అత్యద్భుతంగా అభినయించారు. భూకైలాస్, సుడిగుండాలు, సీతారామయ్య గారి మనవరాలు ప్రధాన నటుడు ఎందుకు నటసామ్రాటో తెలిసిపోతుంది. షష్టిపూర్తి రాత్రి భార్య మరణించినప్పుడు, ఆ తర్వాత సన్నివేశాల్లో ఏఎన్నార్ అభినయం మన కంట నీరెట్టిస్తుంది.
ముది వయసులో దంపతుల మధ్య విరిసిన ఆ అమలిన శృంగారాన్ని, రోహిణి హట్టoగడి, పెద్ద ముత్తయిదువ మోమున చూపిన ఆ చిరు సిగ్గు పూర్ణత్వాన్ని చూయించిన తీరో నోస్టాల్జియా…!
సీతారామయ్య గారి మంచితనమే వాసూలో ఉంది. అదే సీతకి వచ్చింది. అదో మమతానురాగాల శాఖాసంక్రమణం అంటూ దర్శకుడందుకే సినిమాని ముక్తాయిస్తాడు.
“ఓ సీతా, హల్లో మైసీత నీవంటి స్వీటు స్వరూపము” అనే పాత్రోచిత కామెడీ లొల్లాయిగీతాన్నొదిలేస్తే మిగతా పాటలన్నీ తేనెలూరే తెలుగులు. వేటూరి పాటలన్నీ తేటూరిన తెలుగావకాయలు.
1) మసకబడితే నీకు మల్లెపూదండ; తెలవారితే నీకు తేనెనీరెండ..
2) పూసింది పూసింది పున్నాగ, కూసంత నవ్వింది నీలాగ ; అష్టపదులూ, ఇష్టసఖులూ..
3) ఇరవయ్యేళ్ల వరుడు మీ రాముడైతే, పదహారేళ్ల పడుచు మా జానకమ్మ..
4) కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలూ కనకమాలక్ష్మీ.. తదితరాలు చంద్రునికి నూలుపోగులు.
Seetharamaiah Gari Manavaralu :
పాత్రోచితమైన గణేష్ పాత్రో గారి సంభాషణలు సినిమాకి ప్రాణం.
1) మనవరాలు మన వరాలు..! అని జానకమ్మ భర్తతో అనడం..,
2) ఇరవయ్యేళ్ల నా ఆవేదన తెలుసుకుని, దాన్ని తీర్చడానికి వచ్చిన మా అమ్మవమ్మా నువ్వు…! ఇప్పుడు వాసుకన్నా నువ్వే నాకెక్కువ అనిపిస్తోంది. అని సీతారామయ్య గారు తన మనవరాలికి చెప్పుకోవడం..,
3) నా గురించి చెబుతున్నా విను, నాకు గౌరవంలేని చోట నా కన్నకూతురు కాదు కదా, నా కన్నతల్లి ఉన్నా సరే, ఆ పొలిమేరల్లో కూడా నా అడుగు పెట్టను..! అని సీతారామయ్య గారు తన వియ్యంకుడిని మర్యాదగానే హద్దుల్లో ఉంచడం..,
4) “పెళ్లి చేశారు కదా, ఇంకేంటీ..?” అని పెద్దల్లుడంటే, “చేశాను కదా, ఇంకేంటీ…?” అని సీతారామయ్య గారు అనడం.
కథలో రెండు రకాల సస్పెన్సూ ఉంటుంది. వాసూ, తన భార్యా ఆక్సిడెంట్ లో కాలం చేశారన్న విషయం సినిమా సగం అయ్యేదాకా సీతకు తప్ప ప్రేక్షకులకూ, పాత్రలకూ తెలియదు. ఆ తర్వాత ప్రేక్షకులకు తెలిసి సీత కష్టం మీద సానుభూతీ; మిగతా వారికి తెలియకపోవడం మీద సహానుభూతీ మనకు కలుగుతాయి. షష్టిపూర్తికి కొడుకు రాకపోతే సర్దిచెప్పుకున్న సీతారామయ్య, భార్య చనిపోయినా కొడుకు రాకపోవడాన్ని సహించలేకపోతాడు. మనవరాల్ని వెనక్కి వెళ్లిపొమ్మని దీనంగా అర్ధించే ఆ వృద్ధుని దైన్యాన్ని చూసి చెమర్చని కన్ను ఉండదు. “రక్తం నీళ్ల కన్నా చిక్కన..!” అని మీగడతరక లాంటి కథని అందించారు క్రాంతి కుమార్ గారు.ఈ సినిమా చూస్తే, పిల్లలకు తల్లిదండ్రుల మీదా; మనవలూ, మనవరాండ్రకు తాతలమీదా, బామ్మలూ, మామ్మల మీదా ప్రేమాభిమానాలు పెరుగుతాయి. పుట్టినూరికి వెళ్లాలనిపిస్తుంది
మానవ సంబంధాల్లోని మాధుర్యాలూ; సంక్లిష్టతలూ ఎంత హత్తుకునేలా చూపించారో, అరుదైన మన సాంప్రదాయాల్లోని అనేక అపురూపమైన ఆనందాల్ని
మరుమల్లెల్లా,హరివిల్లుల్లా, సెలయేళ్ళ గలగలల్లా అందంగా ఆవిష్కరించారు..!
నవ్వించి ఏడిపిస్తూ; ఏడిపించి నవ్విస్తూ ప్రేమను పెంచే; మంచిని పంచే కథనమిది..!
కుటుంబం ఎంతో బలమైనదో, మన నమ్మకాలూ, భావోద్వేగాలూ ఎంత లోతైనవో, మనం సంస్కృతి ఎంత అందమైనదో తెలిపినందుకూ గానూ ఈ సినిమా విజయం సాధించింది.
మురారిలో కూడా ఇవే లక్షణాలున్నాయి. కథ, కథనం, పాత్రలూ, పాత్రధారులూ పడుగూ పేకలా కలిసాక ముద్దపప్పూ, ఆవకాయలా తెలుగోడి మృష్టాన్నమయ్యింది.
ఓ కమర్షియల్లీ సక్సెస్ ఫుల్ సినిమా సాధించిన అరుదైన అసలైన విజయమిది.
-గొట్టిముక్కల కమలాకర్
Must Read : తెలుగు తెరపై విరుగుడు లేని విలనిజం .. కోట