తెలుగు తెరపై రాజేంద్రప్రసాద్ తరువాత పూర్తి హాస్య కథానాయకుడిగా ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని అనుకుంటున్న సమయంలో అల్లరి నరేశ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈవీవీ తనయుడిగా ఈజీగానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ, టాలెంట్ తోనే ముందుకు వెళ్లాడు. కామెడీపై తనదైన ముద్ర వేయడానికి కూడా ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకుని, 50 సినిమాలకి పైగా చకచకా పూర్తి చేసేశాడు.
తక్కువ బడ్జెట్ లోనే ఆయన సినిమాలు రూపొందేవి .. ప్రేక్షకులను అలరించేవి. టీవీల్లో ఆయన సినిమాలు రిపీటెడ్ గా వస్తున్నప్పటికీ, వదలకుండా చూసే హాస్యప్రియులు ఉన్నారు. అయితే ఆ మధ్య కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడం వలన .. అవకాశాలు తగ్గడం వలన, ఇకపై విభిన్నమైన పాత్రలను మాత్రమే చేయాలనే ఒక బలమైన నిర్ణయానికి ఆయన వచ్చేశాడు. అలాంటి సందర్భంలోనే వచ్చిన ‘నాంది’ హిట్ కావడంతో, తాను తీసుకున్న నిర్ణయం సరైనదేననే ఒక అభిప్రాయానికి ఆయన వచ్చేశాడు.
అలా ఇటీవల ఆయన చేసిన సినిమానే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ సినిమా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. కథ సీరియస్ గా నడవడం .. ఆ కథలో కొత్తదనం లేకపోవడం .. కథనంలో ఆసక్తి పాళ్లు లోపించడం అందుకు కారణాలుగా చెప్పుకోవచ్హు. ఇక అల్లరి నరేశ్ ను తెరపై సీరియస్ గా చూపిస్తూ, ఆయన చుట్టూ ఉన్న పాత్రలతో కామెడీని పండించాలనే ప్రయత్నం మరో మైనస్ గా నిలిచింది. ‘నాంది’ వంటి కథలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. అలాంటివి అప్పుడప్పుడే చేయాలి కూడా. అందువలన అల్లరి నరేశ్ అల్లరి చేస్తేనే బాగుంటుందని అభిప్రాయానికి అభిమానులు వచ్చేశారు. మరి ఆయన తన ఆలోచనను మార్చుకుంటాడేమో చూడాలి.
Also Read : మారేడుమిల్లి మాటేమిటంటే .. ?!