ఆమ్ ఆద్మీ పార్టీ ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి ఆమ్ ఆద్మీ పార్టీనే పోటీ ఇస్తుందని ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ తరచుగా చెపుతున్నారు. ఇప్పుడు పార్టీ విస్తరణకు మార్గం సుగమం అయింది. గుజరాత్ ప్రజల ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ నేడు జాతీయ పార్టీగా అవతరించనుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ మూడు స్థానాల్లో గెలిచినపార్టీ మరో రెండు స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో సిసోడియా గురువారం ఉదయం ట్వీట్ చేశారు. ‘గుజరాత్ ప్రజల ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ నేడు జాతీయ పార్టీగా అవతరిస్తోంది. జాతీయ రాజకీయాల్లో మొదటి సారిగా విద్య, ఆరోగ్యం ప్రధాన అంశాలుగా నిలిచాయి..’ అంటూ ట్వీట్ చేశారు.
ఒక రాజకీయ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే.. కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందాలి. ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండగా.. గోవాలో రెండు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో ఆప్ జాతీయ పార్టీగా అవతరించనుంది.