ఆస్ట్రేలియా- ఇండియా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన తొలి టి 20 మ్యాచ్ లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ బెత్ మూనీ 57 బంతుల్లో 16ఫోర్లతో 89పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఐదు టి 20 మ్యాచ్ ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇండియాలో పర్యటిస్తోంది. ముంబై డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం లో జరిగిన తొలి మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షఫాలీ వర్మ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించి 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి ఔటయ్యింది. స్మృతి మందానా-28; కెప్టెన్ హర్మన్ ప్రీత్-21; దేవికా వైద్య-25 పరుగులతో రాణించారు. చివర్లో దీప్తి శర్మ ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడి 15 బంతుల్లో 8 ఫోర్లతో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా, రిచా ఘోష్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి….20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి స్టంప్ అవుట్ గా వెనుదిరిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 172పరుగులు చేసింది.
ఆసీస్ బౌలర్లలో పెర్రీ రెండు; కిమ్ గ్రాత్, గార్డ్ నర్, సుదేర్లాండ్ తలా ఒక వికెట్ సాధించారు.
ఆసీస్ మహిళలు తొలి వికెట్ కు 73 పరుగులు చేశారు. కెప్టెన్ అలెస్సా హీలీ 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి ఔటయ్యింది. తరువాత మూనీ- తహిలా మెక్ గ్రాత్ లు కలిసి మరో వికెట్ పడకుండా 18.1 ఓవర్లలోనే లక్ష్యం సాధించారు. మెక్ గ్రాత్ 29 బంతులో 4 ఫోర్లు, ఒక సిక్సర్ తో 40 పరుగులతో అజేయంగా నిలిచింది.
బెత్ మూనీ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.