థాయిలాండ్ నౌకాదళానికి చెందిన నౌక ఒకటి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్‌లో ఆదివారం రాత్రి మునిగింది. ఆ నౌకలో ఉన్న సుమారు వంద మంది నావికులను రక్షించారు. భారీ తుఫాన్ రావడం వల్ల గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్‌లో హెచ్‌టీఎంఏఎస్ సుఖోటాయి నౌక మునిగినట్లు అధికారులు తెలిపారు. ఆ జలాల్లో ఇంకా 28 మంది నావికులు ఉండిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎవరూ మరణించినట్లు నమోదు కాలేదు. ముగ్గురు సిబ్బంది పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. నౌక నీటిలోకి వెళ్లగానే దాంట్లో పవర్ పోయింది. దీంతో షిప్‌ను కంట్రోల్‌లోకి తెచ్చేందుకు తెగ ప్రయత్నించారు. బంగ్ సఫాన్ జిల్లాకు 32కిలోమీటర్ల దూరంలో ఆ నౌక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షిప్‌లో ఉన్న సిబ్బందిని రక్షించేందుకు మూడు నావల్ షిప్స్‌తో పాటు హెలికాప్టర్లను పంపారు.