Friday, March 29, 2024
HomeTrending Newsఒకే విషయంలో పవన్ కు ఏకాభిప్రాయం : సజ్జల

ఒకే విషయంలో పవన్ కు ఏకాభిప్రాయం : సజ్జల

తమను అధికారంలోకి రాకుండా చేయాల్సింది పవన్ కళ్యాణ్ కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. పెన్షన్ తీసుకుంటున్న 60 లక్షల మంది అవ్వాతాతలు, 30లక్షలమంది అమ్మ ఒడి లబ్దిదారులు, మరో 30 లక్షల మంది ఇళ్ళ స్థలాలు పొందిన వారు, రైతు భరోసా సాయం పొందుతున్న 56 లక్షల మంది సన్నకారు రైతులు, 26వేల కోట్ల రూపాయల రుణ మాఫీ సాయం పొందుతున్న  కోటి మంది డ్వాక్రా మహిళలు… వీళ్ళు వద్దనుకుంటే అప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి తిరిగి రాకుండా ఈ నేతలు ఆపగలుగుతారని ఎద్దేవా చేశారు.

సిఎం జగన్ కూడా తాము ఇవి చేశాము కాబట్టి మీ చల్లని దీవెనలు ఇవ్వాలని ప్రజలను అడుగుతున్నారని… కానీ వీరు మాత్రం తాము రానీయబోమని అంటున్నారని విమర్శించారు.  వైసీపీని అధికారంలోకి రానివ్వకుండా చూడడమే తన పవిత్ర బాధ్యత అన్నట్లు పవన్ అనుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కోసం పని చేస్తున్నట్లు పవన్ పరోక్షంగా చెబుతున్నారని, ఒకవేళ స్వతంత్రంగా పని చేస్తున్నట్లయితే ఆ విషయం బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

తానే ప్రత్యామ్నాయం అని పవన్ చెప్పుకుంటే మొత్తం 175సీట్లలో పోటీ చేస్తానని చెప్పాలన్నారు. ఎక్కడో స్క్రిప్ట్ తయారైతే దాన్ని చదివి వెళ్ళడం పరిపాటిగా మారిందన్నారు. ఒక్కో సమయంలో ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని… కానీ టిడిపిని మాత్రం పల్లెత్తు మాట మాట్లాడ్డం లేదని, బహుశా ఈ విషయంలోనే ఆయనకు ఏకాభిప్రాయం ఉన్నట్లుందన్నారు సజ్జల.

గ్రామ సచివాలయాల పేరుతో ఓ సరికొత్త వ్యవస్థనే తయారు చేశారని లక్షా 35 వేల మందికి ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చారని, ఇవి కాక వైద్య ఆరోగ్య శాఖలో కలిపి మొత్తం 2 లక్షల ఉద్యోగాలిచ్చారని.. అలాంటిది యువతకు ఉపాధిపై ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్