Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రచారం తప్ప పసలేని సూత్రీకరణ

ప్రచారం తప్ప పసలేని సూత్రీకరణ

New Grammar: ఈ మధ్య ఒక భారతీయ యువకుడు పాణిని సంస్కృత వ్యాకరణ సూత్రానికి కొత్త అన్వయం కనుక్కుని…రెండున్నర వేల ఏళ్లుగా మహా మహా పండితులు కూడా తికమక పడ్డ సూత్రానికి సరైన భాష్యం చెప్పాడని జాతీయ, అంతర్జాతీయ మీడియాలో పెద్ద వార్త. ఏదయినా పదరూపం మార్పుకు సంబంధించిన సూత్రాల విషయంలో వివాదం, చర్చ వస్తే…దానికి సంబంధించిన చివరి సూత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని పాణిని ప్రతిపాదించాడు. అలా తీసుకోవాల్సిన పనిలేదని ఈ యువకుడు కొత్త తర్కం లేవదీశాడు. దీనిమీద ఒక సంస్కృత పండితుడి స్పందన ఇది:-

రిషి రాజ్ పోపట్ అనే యువకుడు పాణిని సూత్రానికి కాత్యాయన ముని మొదలైన వారు 2500 సంవత్సరాలుగా తప్పు అర్థం చెప్పారని ఆక్షేపించారు. అది సరి కాదు. పాణిని ముని చెప్పిన సూత్రాలను ఆయన కాలం నుండి గురు శిష్య పరంపరగా అధ్యయనం చేస్తున్నారు. కాబట్టి పాణిని ముని ఉద్దేశించిన అర్థం సంప్రదాయంలో చదివిన వారికే తెలుస్తుంది.

“విప్రతిషేధే పరం కార్యమ్” అనే సూత్రం చేత మంత్రైః అనే రూపం తయారు కాదు. అది పర సూత్రం బలమైనదని చెప్పే సూత్రం. పర సూత్రం కంటే నిత్య సూత్రం బలమయింది. “అతో భిస ఐస్” నిత్య సూత్రం. దానివల్ల మంత్రైః అవుతుంది. ఈ విషయం వ్యాకరణ మహా భాష్యంలో కాత్యాయన పతంజలి మునుల వాక్యాలవల్ల తెలుస్తోంది. అది నిత్య సూత్రం అవడం, అక్కడ స్థానివద్భావం వర్తించడం మొదలైన విషయాలు మహా భాష్యంలో ఉన్నాయి. కాబట్టి ప్రాచీనులు చెప్పిన దానిలో తప్పు ఏ మాత్రం లేదు.

“విప్రతిషేధే పరం కార్యమ్” సామాన్య సూత్రం. “అతో భిస ఐస్” అపవాద సూత్రము. అంటే విశేష సూత్రము. సామాన్య సూత్రం కంటే అపవాద సూత్రం బలమైనది కనుక మంత్రైః అవుతుందని మరి కొందరు చెప్పారు. ఎలాగైనా ప్రాచీనులు చెప్పిన దానిలో తప్పు లేదు.

రిషి రాజ్ పోపట్ పరిశోధన చేసి ఒక సూత్రానికి కొత్త అర్ధం చెప్పి సంస్కృత వ్యాకరణ మార్గంలో ఋషి పుంగవులను, ఋషి తుల్యులను కించపరిచాడు. ఇతడు కొత్తగా చెప్పిన అర్థం వల్ల రామేభ్యః మొదలైన రూపాలు తయారు కావు. కాబట్టి “విప్రతిషేధే పరం కార్యమ్” అనే సూత్రానికి రిషిరాజ్ పోపట్ చెప్పిన అర్థం సరి కాదు.

సామాన్యులకు అర్థం కాని వ్యాకరణ విషయాలకు కొత్త అర్థం చెప్పి, వాటిలో దోషాలున్నా, వార్తా పత్రికల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా తానొక ఘనత సాధించినట్లు ప్రచారం చేసుకోవడం ద్వారా మహర్షులను, మహర్షి మార్గాన్ని అనుసరించే భారతీయులను అవమానించడం, దానిని మన వాళ్ళు గొప్ప విషయంగా భావించి ప్రచారం చేయడం చాలా బాధాకరం.

ఈ విషయం మీద ఆసక్తి ఉన్నవారు చిర్రావూరి శివరామకృష్ణ శర్మగారి వివరణ కోసం ఈ వీడియో చూడగలరు .

-డాక్టర్ చిఱ్ఱావూరి శివరామ కృష్ణ శర్మ,
భాషా ప్రవీణ, B. O. L., M. A. (Sanskrit), M.A. (Telugu), Ph. D.
Reader (విశ్రాంతుడు, ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్టణం)

RELATED ARTICLES

Most Popular

న్యూస్