సాధారణంగా విజయ్ సినిమాలు తమిళంలో రూపొందుతూ ఉంటాయి. ఆ తరువాత తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలవుతూ ఉంటాయి. కానీ ఈ సారి తెలుగు సినిమానే తమిళంలో విడుదల చేస్తున్నారా అనే స్థాయిలో ఆయన దిల్ రాజు బ్యానర్లో .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు’ సినిమా చేశాడు. తమిళంలో ఈ సినిమా ‘వరిసు’ పేరుతో పలకరించనుంది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను నిన్న వదిలారు. అయితే ఇది విజయ్ స్టైల్ కి కాస్త భిన్నంగా .. కొత్తగా అనిపించింది. విజయ్ అంటే తమిళనాట మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తాడు. మాస్ ఆడియన్స్ అభిరుచికి తగినట్టుగానే ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్స్ .. సాంగ్స్ ఉంటూ ఉంటాయి. ఇక ఈ తరహా కథల్లో ఏదో ఒక మేనరిజం ఉండేలా ఆయన కేర్ తీసుకుంటూ ఉంటాడు. అవే ఆడియన్స్ ను కట్టిపడేస్తుంటాయి.
కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తే .. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా కనిపించాయి. ఉమ్మడి కుటుంబం .. ఒక మాట మీద నడిచే కుటుంబ సభ్యులు .. విలన్ ప్లాన్ దెబ్బకి ఆ ఫ్యామిలీ చెల్లా చెదురవుతుంది. వ్యాపార పరంగా కూడా ఆ కుటుంబం వీధిన పడే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎంట్రీ ఇచ్చి న హీరో, అటు బిజినెస్ ను .. ఇటు ఫ్యామిలీని ఒక గాడిలో పెడుతూనే, విలన్ కి గుణపాఠం చెప్పే ప్రోగ్రామ్ పెడతాడనే విషయం అర్థమవుతోంది. మరి తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా విజయ్ చేసే ఈ సాహసానికి మాస్ ఆడియన్స్ ఎంతవరకూ కనెక్ట్ అవుతారనేది చూడాలి.