Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంక్షణ క్షణం సంగీతం

క్షణ క్షణం సంగీతం

A New Raagam: అవార్డు వచ్చిన నాటు నాటు పాట కీరవాణి గురించి చర్చోపచర్చలు జరుగుతుంటే… అవార్డు రాకముందు కీరవాణి గురించి చాలా చర్చ జరగాలి కదా అని అనిపించింది.

కె వి మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజ, రాజ్- కోటీల దారుల్లో వెళ్లకుండా కీరవాణి సంగీత క్షణ క్షణాలను తన వైపు ఎలా తిప్పుకున్నారో కొంత చర్చ జరగాలి. చిటికెలోన చిక్కబడ్డ కటిక చీకటి…కరిగిపోక తప్పదమ్మ అరుణ కాంతికి అంటూ సిరివెన్నెల కలం వెలుగు పూలు చల్లితే వాటిని ఏరుకుని స్వరాల దండ కట్టి మాయ చేసిన కీరవాణి మీద మరికొంత చర్చ జరిగి ఉండాలి. కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన వేటూరి కొత్త పూల మధుమాస వనాల్లో తుమ్మెద జన్మకు నూరెళ్లేందుకు? అని వేదాంతం పాడించిన కీరవాణి మీద ఎంతో కొంత చర్చించి ఉండాల్సింది. ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో అచ్చాగా…అంటూ బాలు చేత గాత్రంలోనే ఈ నాటు కంటే ఘాటుగా, కొంటెగా నాట్యం చేయించినప్పుడు సిల్వర్ గ్లోబ్ అయినా ఇవ్వలేదే అని ఇప్పుడు విసుక్కోవాలి.


రాలిపోయే పూలకు రాగాలెందుకు? అంటూనే వాటికి ఎందుకు రాగాలు అద్దారో ప్రశ్నించాలి. వాలిపోయే పొద్దులకు ఎందుకు స్వరాల వర్ణాలు పులిమారో గట్టిగా నిలదీయాలి. తెలవారని రాత్రుల్లో తెల్లవార్లూ ఏడ్చే తల్లిని “నీకిది తెలవారని రేయమ్మా!” అని ఆమె ముందు పదే పదే అదే పాడి…ఆమెతోపాటు మనల్ను కూడా ఎందుకు ఏడిపించారో కనుక్కోవాలి. “రాయినై ఉన్నాను ఈనాటికి… రామపాదము రాక ఏనాటికి…” అని చిత్ర చేత పాడించి మన గుండెలు పిండిన మనిషిని మనం వెతికి వెతికి పట్టుకోవాలి. పట్టుకుని మనల్ను ఇంతగా ఏడిపించే అధికారం ఎవరిచ్చారని కాలర్ పట్టుకుని గట్టిగా నిలదీయాలి.

అన్నమయ్య, రామదాసుల భక్తిలో కీరవాణిని చూశాం.
విజిలేసిన ఆంధ్రా సోడా బుడ్డీల్లో కొంటె కీరవాణిని చూశాం.
హీరో ఇన్ బొడ్డు మీద తిరిగిన చీమకు పాట నేర్పిన సరస కీరవాణిని చూశాం.
నవరసాల కీరవాణిని విన్నాం.

“రాజ్యమా!
ఉలికిపడు!!”
అని కాళ్లకింద భూమిని తన సంగీత గాత్రాలతో కదిలించిన బాహుబలి కీరవాణిని చూశాం. విన్నాం.

నాటు నాటు పాట పాదులో గోల్డెన్ గ్లోబ్ అవార్డు నాటుకోవడం మంచిదే. కీరవాణి స్వరపరిచినవాటిలో ఇంతకంటే మన మనసుల్లో ఎప్పుడో, ఎంతగానో నాటుకున్న పాటల పూదోటల మీద ఈ సందర్భంగా అయినా కొంత చర్చ జరిగితే ఇంగువకట్టిన గుడ్డగా ఉన్న తెలుగు సినిమా సంగీత సాహిత్యాలకు ఎంతో కొంత ఉభయతారక ప్రయోజనం ఉంటుంది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో కీరవాణి సంగీతానికి గుర్తింపు వస్తుందా?
కీరవాణి సంగీతాన్ని గుర్తించారు కాబట్టి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందా?
హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ పేరిట ఒకానొక అంతర్జాతీయ సినిమా సమీక్ష బృందం ఇచ్చే ఈ అవార్డు వల్ల తెలుగు పాటకు, లేదా భారతీయ సినిమా పాటకు కలిగే ప్రయోజనం ఎంత?
తెలుగులో గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాదగ్గ పాటలేవీ ఇదివరకు లేవా?
ఇలా నెగటివ్ ధ్వనితో ఎన్ని ప్రశ్నలయినా వేసుకోవచ్చు. ఆ ప్రశ్నలకు ఎడతెగని నెగటివ్ సమాధానాలు కూడా రాబట్టుకోవచ్చు.

నా వరకు ఒక సగటు తెలుగు భాషాభిమానిగా ఒక తెలుగు పాటకు అంతర్జాతీయ గుర్తింపు రావడం దానికదిగా ఒక మైలు రాయి. నాటు నాటు కంటే తెలుగులో ఇంకా గొప్ప పాటలు ఎన్నో ఉండి ఉండవచ్చు. ఇలాంటి అవార్డు ప్రమాణాలకు అన్నీ కుదిరిన, సమయం సందర్భం కలిసివచ్చిన పాట ఇదయి ఉండవచ్చు. బాహుబలితో విశ్వవ్యాప్తమయిన రాజమౌళి ఖ్యాతి దీనికి దారులు వేసి ఉండవచ్చు. త్రిబుల్ ఆర్ కథా గమనంలో హీరోలిద్దరూ సవాలు విసిరి…నాట్యం చేసి…గేలిచేసిన వారిని ఓడించిన కీలకమయిన నాటు నాట్యం గెలుపు అయి ఉండవచ్చు. సాహిత్యం కంటే ఎగరడానికి ఊపిరులూదిన స్వరాలే ప్రధానం అయి ఉండవచ్చు. హీరోలిద్దరి అలుపెరుగని ఎగురుడు…ఆ సంగీతం తెలుసుకోవడానికి కారణం అయి ఉండవచ్చు. ఇలా ఎన్నెన్నో కారణాలు అయి ఉంటేనే కీరవాణి చేతిలో గోల్డెన్ గ్లోబ్ కనిపిస్తూ ఉండవచ్చు.

ఎవరు అవునన్నా…కాదన్నా…తెలుగు సినిమా చరిత్ర రాజమౌళికి ముందు…రాజమౌళి తరువాత అని రాసుకోవాల్సిన స్థాయిలో ఉన్నారు రాజమౌళి. సినిమా నుండి పక్కకొచ్చి బయట ప్రపంచదృష్టితో చూసినా…కెరీర్ గురించి తపించే ఎవరయినా రాజమౌళిని చూసి ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చు. అలాంటి రాజమౌళికి అన్నయ్యగా కీరవాణి…తమ్ముడి గెలుపును కోరుకుంటారు. సహజంగా ఆ తమ్ముడు రాజమౌళి…అన్నయ్య కీరవాణి గెలుపును కోరుకుంటారు. కాబట్టి కీరవాణి చేతిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు భౌతికంగా కనిపిస్తున్నా…అది రాజమౌళి చేతిలో కూడా ఉన్నట్లే అనుకోవాలి. అవార్డు అందుకున్న వెంటనే కీరవాణి క్రెడిట్లో సింహభాగం రాజమౌళికే ఇచ్చారు.

ఈ పాట రచయిత, గాయకులు, నృత్య దర్శకుడు, నటులు, సినిమా దర్శకుడు…అందరూ అభినందనీయులే.

ఈ వేడి తగ్గిన తరువాతయినా…
నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ కు ముందు కీరవాణిని చూడాలి. తెలుగును తెలుగులా పాడి…పాడించిన కీరవాణిని వినాలి.
“రం రం రం రక్తవర్ణం కటికటితతనుం తీక్ష్ణదంష్ట్రాకరాళం
ఘం ఘం ఘం ఘోష ఘోషం ఘ ఘ ఘ ఘ ఘటితం ఘర్ఝరం ఘోరనాదమ్” లాంటి చదవడానికే చాలా కష్టమయిన ఆధ్యాత్మిక స్తోత్రాలను సంగీత సాహిత్యాలకు భంగం కలగకుండా భక్తితో పాడిన కీరవాణిని తెలుసుకోవాలి. లేకుంటే కీరవాణి ఒక పేరు…మహా అయితే ఒక రాగం పేరు అనుకునే ప్రమాదం ఉంది.

కొసమెరుపు:-
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న కీరవాణి గురించి తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లీషు మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. వస్తున్నాయి. చర్చలు జరిగాయి. జరుగుతున్నాయి. వాటన్నిటిలో నాకు నచ్చినది ఈ అమూల్ కార్టూన్. త్రిబుల్ ఆర్ కీరవాణి పాటకు అమూల్యమయిన అమూల్ “రియల్లీ రిమార్కబుల్ రివార్డ్” కార్టూన్.


“సే హా నాట్ నా టు బటర్”
నాటు నాటు మాటను కూడా అమూల్ బటర్ ను వద్దనకండి అనే అర్థంలో “నాట్ నా టు బటర్” అని అవధానులు దత్తపదుల్లో విరుచుకున్నంత విన్యాసం ఉంది. భాషమీద పట్టు ఉన్నవారి చేతిలో భావం మైనపు బొమ్మ.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

ఎన్ని యుగాలైనా… ఇది ఇగిరిపోని గంధం

RELATED ARTICLES

Most Popular

న్యూస్