జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ రోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్…స్వామివారి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాదు నుంచి సిద్దిపేట, కరీంనగర్ మీదుగా కొండగట్టు చేరుకున్న పవన్ కళ్యాణ్ కి ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు, వేద పండితులు వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించి, వాహనం ఎదుట సంకల్పసిద్ధి చేయించారు.
ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని వారాహికి కట్టి, సింధూరంతో శ్రీరామదూత్ అని రాశారు. పూజల అనంతరం విఘ్నాలు తొలగిపోయేలా, విజయాలు సిద్ధించేలా గుమ్మడికాయ కొట్టి వారాహిని ప్రారంభించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రారంభసూచకంగా వారాహి ఎక్కి వాహనాన్ని పరిశీలించారు.
జన సేనాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన బందో బస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. పవన్ కల్యాణ్‌కు కొండగట్టు అంజన్న అంటే సెంటిమెంట్ అనే విషయం తెలిసిందే.. పలు సందర్భాల్లో ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించారు.. దీంతో, వారాహికి కొండగట్టులోనే వాహన పూజ నిర్వహించాలని నిర్ణయించారు.. కొద్ది సేపటి క్రితం కోడీమ్యాల మండలం పరిధిలోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణ జనసేన 32 నియోజకవర్గ కార్యానిర్వహక సభ్యులతో సమావేశం అయ్యారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యాచరణపై ముఖ్య నాయకులకు పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేస్తారు.
ఆ తర్వాత సాయంత్రం 3.30 నిమిషాలకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆయన.. ధర్మపురి నుండి అనుష్టుస్ నారసింగ యాత్రగా 32 క్షేత్రాల సందర్శన యాత్ర ప్రారంభిస్తారు.. ఇక, సాయంత్రం 5.30 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ ప్రయాణం కానున్న పవన్ కల్యాన్.. రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.
Also Read : వారాహి… ఎన్నికల యుద్ధానికి సిద్దం