Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమైనపు బొమ్మా, నువ్వెవరమ్మా!

మైనపు బొమ్మా, నువ్వెవరమ్మా!

Wax-Entertainment: చూపు చుక్కల్లో ఉన్నా కాళ్లు నేలమీదే ఉండాలిగా.. లండన్‌ పోతానో లేదో, పోయినా కారల్‌ మార్క్స్‌ సమాధీ, మేడమ్‌ టుస్సాడ్స్‌ మైనపు బొమ్మల మ్యూజియం చూస్తానో లేదో… మబ్బుల్ని చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుడెందుకు? ఉన్నది చూస్తే పోలా! అనుకుంటూ లాస్‌ వెగాస్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం బిల్డింగ్‌ ముందు ఆగాను. నా మది కనిపెట్టిన మా అమ్మాయి దీప్తి.. టిక్కెట్‌ చేతిలో పెట్టి ’మీరు చూసి రండి, మేం వేరే ప్లేస్‌కి వెళ్లొస్తామంది’.

జిగేల్‌ రాణి ఈ లాస్‌ వెగాస్‌..
లాస్‌ వెగాస్‌ ఎలియాస్‌ వెగాస్‌. నెవెడా రాష్ట్రంలో అతి పెద్ద నగరం. అటు కాలిఫోర్నియా ఇటు యూటా.. ఇదెలాంటిదంటే ఆడోళ్లను మగాళ్లుగా, మగాళ్లను ఇడియట్స్‌గా మారుస్తుందట. ఇక్కడ దొరికే వినోదకేళి భూ ప్రపంచంలో ఎందెందు వెతికినా దొరకదట. ఇది ప్రపంచ వినోద రాజధాని. (ఎంటర్‌టైన్‌మెంట్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌). సమస్త కళల సంగమం. కంటిమీద కునుకుండదు. విందు వినోదాలకు తెంపుండదు. గల్లీలోనూ తావుండదు. చీకటైతే చిందేస్తది. కొత్త పెళ్లికొడుకులకు నెలవవుతది. పగలైతే ఆవలిస్తది. పొద్దున్నే వానకు తడిసిన గువ్వవుతది. ఈకలు పీకిన కోడవుతది. నిజానికిదో ఎడారి ప్రాంతం. నీళ్లు లేని చోట నీళ్లు పుట్టించి ఎందుకూ కొరగానివనుకున్న ఎర్రమన్ను పర్వతశ్రేణుల్ని బంగారపు ముద్దల్లా మార్చిన తీరు అబ్బురపరుస్తుంది.

లండన్‌ తర్వాత వెగాస్‌లోనే…
అటువంటి చోట 1999లో వెలిసిందీ మేడమ్‌ టుస్సాడ్స్‌ వాక్స్‌ మ్యూజియం. యావత్‌ ప్రపంచంలో ఇట్లాంటివి 21 ఉంటే ఇది రెండోది. అమెరికాలో మొదటిది. లండన్‌ తర్వాత లాస్‌ వెగాస్‌లోనే! ది గ్రాండ్‌ కానల్‌ ఫాపర్స్‌ మాల్‌ నుంచి బయటికి వస్తూనే ‘ది వెనిటియన్‌’ బిల్డింగ్‌లో ఉంది. టిక్కెట్‌ ధర 45 డాలర్లు. లోపల ఎలా మసులుకోవాలో, ఏవేవి చూడొచ్చో చెబుతూ టిక్కెట్‌ చేతిలో పెడతారు. క్యూ లో పది మెట్లెక్కి పై అంతస్తుకి  వెళ్లడంతోనే ఓ పెద్దాయన ఓ చేత్తో వైన్‌ గ్లాస్‌తో… మరో చేత్తో లోనికి రమ్మన్నట్టుగా స్వాగతం పలుకుతారు. ఆయనెవరంటే.. ఈ మ్యూజియంను ప్రారంభించిన నాటి నగర మేయర్‌ ఆస్కార్‌ గుడ్‌మెన్‌. అలా కొంచెం ముందుకు పోగానే కౌబోయ్‌ పిల్‌ మెగ్రా .. నాతో ఫోటో దిగుతారా! రండి, రండంటాడు. ఆయన పక్కన నిలబెట్టి ఫోటోలు తీసేవాళ్లుంటారు. అలా వద్దనుకుంటే రెడ్‌ కార్పెట్‌ ఉండనే ఉంటుంది. కంప్లల్సరీ కాదు గాని తీసుకునే వాళ్లు చివర్లో డబ్బు కట్టి ఫోటోలు తీసుకోవచ్చు.

నాలుగు జోన్లుగా మ్యూజియం…
ఈ మ్యూజియం 4 జోన్లుగా ఉంటుంది. టుస్సాడ్స్‌ క్లబ్‌ ప్రముఖులు, క్రీడారంగ దిగ్గజాలు, ప్రఖ్యాత పాప్, ర్యాప్‌ సంగీత నిపుణులు, పేరున్న సినీనటులు. వీటికి అదనంగా లోకల్‌ టాలెంట్‌ హంట్, 4డీ మువీ మార్వెల్‌ థియేటర్, హాంగోవర్‌ బార్‌. ప్రతి బొమ్మ పక్కనా వివరాలున్న బోర్డులున్నాయి. నచ్చిన వాళ్ల దగ్గర నిలబడి ఫోటోలు తీసుకోవచ్చు. వీడియోకీ అనుమతి ఉంది. అయితే ముందే చెప్పాలి. చూసే ఉబలాటం ఉంటే ఓ రెండు గంటలు పడుతుంది. లేకుంటే ఓ అరగంటో, ముప్పావు గంటలోనో చుట్టేసి రావొచ్చు. భారతీయుల బొమ్మలేవీ కనిపించలేదు.

మైక్‌ టైసన్‌… మనోడేననుకున్నా!
డీజే మ్యూజిషియన్‌ స్టీవ్‌ బకీ, మిస్టర్‌ ఫిట్‌ హాలీ బెర్రీ, జాజ్, పియానో స్పెషలిస్ట్‌ మిసెస్‌ గాగా, రేసర్లు రిచర్డ్‌ హ్యారీ, డేల్‌ ఎర్న్‌హార్డ్‌ జూనియర్, రిచర్డ్‌ పిటీల బొమ్మలు మనకు మొదట్లో కనపడతాయి. వీళ్లందరూ లాస్‌ వెగాస్‌ కింగ్‌లే. వీళ్లను దాటి అటు నాలుగడుగులేయగానే..∙పిడికిలి బిగించి మొహం మీద గుద్దుతానన్నట్టుగా మన మీదికి దూసుకొస్తుంటాడొకాయన. ఈయన్నెక్కడో చూసినట్టుందే అనుకుంటూ ఇది బొమ్మా, నిజంగానే మనిషా! అని ముట్టుకున్నా. అబ్బురమనిపించింది. మొక్కట్లు ఉన్నవున్నట్టుగా ఎట్లా చేశారో మరి! అతడే మైక్‌ టైసన్‌. బాక్సింగ్‌ కింగ్‌. తెలుగు ప్రజలకు బాగా తెలిసిన వాడు. టైసన్‌కి కొంచెం ఎడంగా… ’ సీతాకోక చిలుకలా ఎగురు, తేనెటీగలా కుటు’ అని చెప్పే మహమ్మద్‌ ఆలీ. 12 ఏళ్లప్పుడే బాక్సింగ్‌ బాట పట్టి 1960 ఓలంపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ కొట్టిన ఆలీ వరల్డ్‌ హెవీ వెయిట్‌ చాంఫియన్‌. మాల్కమ్‌ ఎక్స్‌ శిష్యుడు.

ఐస్‌టీ లో లెమనాయిడ్‌ కలిపితే..!
ఈ మ్యూజియంలో వారందరిదీ తలోక స్పెషాలిటీ. తెలియంది ఏదైనా మనకు కొత్తే కదా. ఆర్నాల్డ్‌ పామెర్‌ అని ఓ గోల్ఫర్‌ ఉన్నాడు. అతడి ప్రత్యేకత ఏంటంటే– ఐస్‌ టీలో లెమనాయిడ్, వోడ్కాను కలిపి తాగే డ్రింక్‌ను కనిపెట్టాడట. ఇప్పుడది లాస్‌ వెగాస్‌లో పెద్ద ఫేమస్‌ డ్రింక్‌. ఆ గదిలోనే టెన్నిస్‌ దిగ్గజాలు ఆండ్రీ అగస్సీ, బేస్‌ బాల్‌ ప్రముఖుల మైనపు బొమ్మలున్నాయి. ఓ మూలన జిగేల్‌ జిగేల్‌ మనే ఫోటో స్పాట్‌ ఉంది. ఆశల ఊసులు, రెక్కల పల్లకిలో ఎగిరిపోతుండేలా ఫోటో దిగి నా అనుకునే వాళ్లకి చూపవచ్చు. ఆ స్పాట్‌ చూసింతర్వాత ఫోటో దిగకుండా ఉండలేకపోయా! అలా కొంచెం పక్కకు వస్తే బాల్‌ రూమ్‌ డాన్స్‌ ట్రూప్‌ కనిపిస్తుంది. పొడవాటి గొలుసుతో పైకప్పుకు వేలాడదీసుండే పెద్ద గుండుపై ఓ అమ్మాయి డాన్స్‌ చేసే చిత్రాన్ని కళ్లతో చూడాల్సిందే. మ్యూజికల్‌ ఇనుస్ట్రుమెంట్స్, మ్యూజిక్‌ హెల్మెట్లు, పాతకాలపు వాద్య పరికరాలు, యమహా పియానోలాంటివి ఉన్నాయి.

బ్రాడ్‌ పిట్‌ కూడా జర్నలిస్టే..
బుల్లెట్‌ ట్రైన్, బాబిలోన్‌ వంటి సినిమాల హీరో బ్రాడ్‌ పిట్‌. పెద్ద విగ్రహం. నింపాది. మంచి అందగాడు. ’సెక్సిస్ట్‌మెన్‌ ఎలైవ్‌’ అంటుంటారు. ఆయనా ఓ జర్నలిస్టని తెలిసి ఫోటో దిగాలనిపించింది. మిస్సోరీ యూనివర్శిటీలో జర్నలిజం డిగ్రీ చేస్తూ నటనపై మోజుతో కాలిఫోర్నియా చేరాడట. తోటి నటి ఏంజిలినా జోలిని పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కన్నాడు. మరో ముగ్గుర్ని దత్తత తీసుకున్నాడు. ఇటీవలి వరకు ఈ మ్యూజియంలో యాంజిలినా, బ్రాడ్‌ కలిసున్న బొమ్మనే ఉంచారట. ఇప్పుడు విడిపోవడంతో ఆ బొమ్మనూ విడదీశారు. 1996, 97లలో రోమియో జూలెట్‌ సినిమా ఓ ఊపు ఊపింది. కుర్రాళ్లను వెర్రెక్కించింది. ఆ సినిమా హీరో లియోనార్డో డికాప్రినో.. అలాంటి వాణ్ణి పట్టుకుని ఓ జర్నలిస్టు ’మీరేమైనా ట్రెండ్‌ సెట్టరా?’ అని అడిగితే.. అయ్యో, నేను మామూలు వ్యక్తిని మాత్రమే అన్నాడట. ఆయన బొమ్మనూ తీర్చిదిద్దారిక్కడ. ‘మీరు– నన్ను ఆడని పిలిచినా మగని పిలిచినా లేదా రిజిస్, క్యాత్లీ అని పిలిచినా పర్లేదు. కానీ పిలుస్తూనే ఉండండి’ అని చెప్పే అమెరికన్‌ యాక్టర్‌ రుపౌల్‌ చిత్రానికి ఈ మ్యూజియంలో పెద్ద పీట వేశారు. ఈయన నాలుగైదు సార్లు ఈ మ్యూజియం కళాకారులతో భేటీ వేశారట.

Madame Tussauds Wax Museum

బాబ్‌ మార్లే రూటే సెపరేట్‌…

బాబ్‌ మార్లే… జమైకాలో పుట్టి అమెరికాలో గిట్టిన జాతిరత్నం. ఆటా,పాటా, రాత ఆయన సొంతం. జాతి వివక్షపై గళమెత్తిన వాడు. వేయి పూలు వికసించనీ అనే దానికి అద్దం. జమైకాలో ఓ వినూత్న ఉద్యమం– రెగ్గీ–ని ప్రోత్సహించిన వాడు, గంజాయిని చట్టబద్ధం చేయాలన్న అమెరికన్లకు మద్దతుగా నిలిచిన వాడు. డోంట్‌ గివప్‌.. (వదిలిపెట్టొద్దు) పాటతో ఎంతో మంది మనసు దోచిన కళాకారుని బొమ్మ ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన గొంతెత్తి పాడుతున్నట్టు ఉండే బొమ్మకు ఎదురుగా గంజాయితో తయారు చేసిన పెద్ద చుట్టను ఉంచారు. దానిపై అటొకరు ఇటొకరు కూర్చొని ఊగవచ్చు. అటువంటి మార్లే 36 ఏళ్ల వయసులో చనిపోతూ తన కొడుకుతో .. డబ్బుతో జీవితాన్ని కొనలేమురా అయ్యా.. అన్నాడట. ఆ తర్వాత మైకెల్‌ జాక్సన్‌ బొమ్మ ఉంది. ఆయన గురించి ప్రపంచానికి తెలియదేముంది. మైకు పట్టుకుని పాట పాడుతున్న బొమ్మను ఇక్కడుంచారు.

వందేళ్లు గొర్రెలా బతికే కన్నా… మడోన్నా
వందేళ్లు గొర్రెలా బతికే కన్నా ఏడాది పాటు సింహంలా బతకడం మంచిదన్న అమెరికా నటి, రాక్‌ అండ్‌ రోల్‌ డ్యాన్సర్‌ మడోన్నా గుర్తున్నారుగా.. ఆమె చిత్రం ప్రత్యేకం. దేశవాళీ నటులు, పాప్‌ సింగర్స్‌ డ్రేక్, ప్రిన్స్, టిమ్‌ మ్యాక్‌గ్రా, మిల్లే సైరస్, స్టీవ్‌ వాండరర్‌ లాంటి అనేక సంగీత ప్రముఖుల చిత్రాలు చూసిన తర్వాత డౌన్‌ఫ్లోర్‌కి వెళ్లే దారిలో మేడమ్‌ టుస్సాడ్స్‌ బొమ్మ ఉంటుంది.

ఎవరీ మేడమ్‌ టుస్సాడ్‌….
విగ్రహాల తయారీలో విప్లవమంటే ఆమెదే. అసలు పేరు మేరీ టుస్సాడ్‌. 1761 డిసెంబర్‌ 1న ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో పుట్టింది. తండ్రి జోసెఫ్‌ గ్రోషోల్ట్‌జ్, తల్లి అనీ మేరీ వాల్డర్‌. మేరీ పుట్టడానికి రెండు నెలల ముందే తండ్రి చనిపోయాడు. దీంతో తల్లి పిల్లతో స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌ చేరింది. అక్కడ ఓ వైద్యుడు ఫిలిప్‌ కర్టియస్‌ ఇంట పనికి కుదిరింది. కర్టియస్‌ డాక్టర్‌ కమ్‌ ప్రొఫెసర్‌. శరీర నిర్మాణాన్ని చూపేందుకు మైనపు బొమ్మల్ని తయారు చేసి విద్యార్థులకు చెప్పేవాడు. ఇందుకోసం ఆయన ప్యారిస్‌లో ఓ కార్ఖానా పెట్టారు. టుస్సాడ్‌కి ఈ కళను నేర్పించింది ఆయనే. అనంతర కాలంలో ప్యారిస్‌ చేరిన టుస్సాడ్‌ 1777లో తొలిసారి సొంతంగా ఫ్రెంచ్‌ తత్వవేత్త వోలై్టర్‌–బొమ్మను చేసి సత్తా చాటింది. ఇక, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. వరుసగా జీన్, జాక్వెస్‌ రూసో, బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ వంటి ఫ్రెంచ్‌ ప్రముఖుల చిత్రాలతో ఆకట్టుకుంది. ఫ్రెంచ్‌ రాజు 15వ లూయిస్‌ సోదరి ఎలిజబెత్‌కూ ఈ కళలో శిక్షణ ఇచ్చిందనీ, అందువల్లే ఫ్రెంచ్‌ విప్లవ సమయంలో రాజకుటుంబ అనుచరురాలిగా అనుమానించి అరెస్ట్‌ చేస్తారని చెబుతారు. 1795లో సివిల్‌ ఇంజనీర్‌ ఫ్రాంకోయిస్‌ టుస్సాడ్‌తో పెళ్లైంది. ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు జోసెఫ్, ఫ్రాంకోయిస్‌. కుమార్తె చనిపోతుంది.

Madame Tussauds Wax Museum

లండన్‌ యాత్ర ఇలా…
ఫ్రెంచ్‌ విప్లవానికి ముగింపుగా 1802లో బ్రిటన్, ఫ్రెంచ్‌ రిపబ్లిక్‌ మధ్య అమియన్స్‌ నగరంలో సంధి కుదురుతుంది. ఇరు దేశాల మధ్య రాకపోకలకు మార్గం సుగమమైంది. అప్పుడామె తన భర్త, పెద్ద కొడుకును ప్యారిస్‌లోనే వదిలి మైనపు బొమ్మల ప్రదర్శన కోసం నాలుగేళ్ల కొడుకు జోసెఫ్‌ను చంకనేసుకుని లండన్‌ చేరింది. మరో కళాకారుడు పాల్‌ ఫిలిడోర్‌తో కలిసి లైసియం థియేటర్‌లో బొమ్మల్ని ప్రదర్శించింది. పెద్దగా గిట్టుబాటేమీ కాలేదు. తిరిగి ఫ్రాన్స్‌ పోలేకపోయింది. 1803లో ఎడిన్‌బర్గ్‌ వెళ్లి తలదాచుకుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత పెద్ద కొడుకు ఫ్రాంకోయిస్‌ తల్లిని వెతుక్కుంటూ లండన్‌ వస్తాడు. తల్లిని కలుస్తాడు. కుటుంబ వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆమె భర్త మాత్రం ఫ్రాన్స్‌లోనే ఉండిపోయారు. ఇద్దరూ మళ్లీ ఒకరినొకరు చూసుకోలేదు. బ్రిటన్‌ వచ్చిన 33 ఏళ్ల తర్వాత 1835లో లండన్‌ బేకర్‌ స్ట్రీట్‌లో తనకంటూ ఓ శాశ్వత ప్రదర్శనశాలను ఏర్పాటు చేసుకోగలిగారు. 1842లో ఆమె స్వీయ చిత్రపటాన్ని తయారు చేసుకుంది. మ్యూజియం ప్రవేశద్వారం వద్ద పెట్టిందదే ఇప్పుడు. ఆమె తన 88వ ఏట 1850 ఏప్రిల్‌ 16న లండన్‌లో నిద్రలోనే కన్నుమూశారు.

Madame Tussauds Wax Museum

బార్‌ సెక్షన్‌లోకి వెళ్లడం మరువకండి..
టుస్సాడ్‌ చిత్రాన్ని చూస్తూ పక్క గదిలోకి పోవడంతోనే ఎందరెందరో ప్రముఖులు కనిపిస్తారు. క్యాసినో మ్యూజిక్‌ హీరోలు, డాన్సర్లు, స్టంట్‌ మాస్టర్లు, ఫేమస్‌ ట్రంపెట్స్, రాబర్ట్‌ డి నిరో వంటి ట్రింఫనీలు, ఎర్రటి రుమాలతో విన్యాసాలు చేస్తూ డాన్స్‌ చేసే మిస్టర్‌ ఎల్విస్, లిక్కర్‌ సీసాలకు నిప్పంటి గాల్లోకి ఎగరేస్తూ వయ్యారంగా గ్లాసుల్లోకి వొంపే వాళ్లవి, బ్రూస్‌ క్యాంప్‌ బెల్, వ్యాన్‌ న్యూటన్‌ లాంటి నటులు, బ్లూమెన్‌ గ్రూపు, గ్యాంగ్‌స్టర్‌ బుడ్డీ సీగల్‌ బొమ్మలుంటాయి. అక్కడి నుంచి కిందికి దిగడంతోనే బార్‌ సెక్షన్‌ ఉంటుంది. అమెరికాలో ఏదీ ఉచితం కాదు. డబ్బులిచ్చి కొనుక్కోవాలి. ఐస్‌ లెమనాయిడ్‌ లేదా మార్గరేటాను టేస్ట్‌ చేయవచ్చు. తాగుడుపై పలువురు చెప్పిన సూక్తులు, రకరకాల టేస్టుల్ని చదువుకోవచ్చు. పక్కనే మైక్‌ టైసన్‌ బాత్‌ రూం ఉంది. అందులో పులి బొమ్మ చూపరులను ఆకట్టుకుంటుంది. వెడ్డింగ్‌ ఛాపెల్‌లోకి వెళ్లి కాసేపు ఆనందించవచ్చు. ఆ పక్కనే ఉన్న మార్వెల్‌ సెక్షన్‌లో 4డీ థియేటర్‌లో కూర్చుని ఓ 15 నిమిషాల సేపు ఆట చూడొచ్చు. మన పక్కనే స్పైడర్‌ మ్యాన్‌ ఉన్న అనుభూతిని పొందొచ్చు. అక్కడి నుంచి గిఫ్ట్‌ రూంలోకి వచ్చి మీకు నచ్చినవి ఏమైనా ఉంటే కొనుక్కొని బయటకు రావొచ్చు. మీరెప్పుడైనా అటు వెళితే తప్పని సరిగా ఈ మ్యూజియంను చూసి రండి.

అమరయ్య ఆకుల,
జర్నలిస్ట్‌, 9347921291

Also Read :

స్టాన్‌ఫోర్ట్‌ వర్శిటీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్