బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీల్లో ఉన్న బీబీసీ కార్యాలయాల్లో ఇవాళ ఐటీ శాఖ తనిఖీలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్‌లో అక్రమాలు జరిగినట్లు బీబీసీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీబీసీపై ఐటీశాఖ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కొన్ని వర్గాలు ద్వారా తెలిసింది. కొందరు జర్నలిస్టుల ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తామేమీ సోదాలు చేయడం లేదని, కానీ సర్వే చేస్తున్నట్లు కొందరు ఐటీశాఖ అధికారులు వెల్లడించినట్లు సమాచారం. అకౌంట్ బుక్స్‌ను చెక్ చేస్తున్నామని, తనిఖీలు నిర్వహించడంలేదన్నారు. సిబ్బంది బయటకు వెళ్లవద్దు అని అధికారులు ఆదేశించారు.
ఢిల్లీలోని బీబీసీ ఆఫీసులో జరుగుతున్న సోదాల్లో సుమారు 20 మంది అధికారులు పాల్గొన్నారు. ముంబైలో ఉన్న బీబీసీ స్టూడియోస్‌లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాక్యుమెంట్లను సీజ్ చేశారు. జర్నలిస్టుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను లాగేసుకున్నారు. సర్వే కోసం ఆఫీసును సీల్ చేసినట్లు చెప్పారు. ఎటువంటి వివరాలను బయటకు వెల్లడించరాదు అని ఉద్యోగులకు ఆదేశించారు. బీబీసీ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ వద్ద ఉన్న బ్యాలెన్స్ షీట్, అకౌంట్ల వివరాలను సేకరిస్తున్నట్లు ఐటీశాఖ అధికారులు తెలిపారు.
ఇటీవల గోద్రా అల్లర్లపై బీబీసీ ఛానల్ ఓ డాక్యుమెంటరీని రిలీజ్‌చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ డాక్యుమెంటరీపై పెను దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే కక్ష్య సాధింపుగా ఆ సంస్థపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని ఇటీవల కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ల్లో ఆ డాక్యుమెంటరీని నిషేధించారు. రెండు భాగాలు ఉన్న ఆ డాక్యుమెంటరీని యూట్యూబ్, ట్విట్టర్‌లో బ్యాన్ చేశారు. కానీ కొన్నికాలేజీలు, వర్సిటీల్లో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.