In searching of….. : భవిష్యత్తు ఇలాగే ఉంటుందని ఎవరూ చెప్పలేరు. ఇంతకంటే బాగుండాలనే అందరూ అనుకుంటారు. ఆశపడతారు . అయితే అందుకు తగ్గట్టు ఏమిచేస్తున్నారనేదే ప్రశ్న.
ఆనందం
పరమానందం
బ్రహ్మానందం మాటలకు వేదాంత కోణంలో వేరే అర్థాలున్నా – మనం లౌకిక అర్థమే చూద్దాం. ఆనందం వెతుక్కోవడంలోనే మనం తికమకపడుతున్నాం. ఆనందం కానిది ఆనందం అనుకుని పరుగులు తీస్తున్నాం. జీవితం ఎప్పుడూ సరళరేఖ కానేకాదు. ఒకేవేగం, ఒకే పద్ధతిలో వెళ్ళదు. ఎగుడు దిగుళ్లు; లాభనష్టాలు; కష్టసుఖాలు సహజం. అయితే లాభమూ సుఖమూ ఆనందించదగ్గది – నష్టమూ కష్టమూ భరించకూడనిది అవుతుంది. ఇక్కడే వస్తోంది చిక్కంతా.
జీవితం సంక్లిష్టం కావాలని ఎవరూ కోరుకోరు. కానీ సంక్లిష్టమయినప్పుడు బయటపడడానికి, ఆ ప్రయత్నంలో ఆనందం వెతుక్కోవడానికి ప్రయత్నించేవారు తక్కువ.
ఆనందం దానికదిగా వస్తువు కాదు. మార్కెట్లో దొరకదు. ఆనందం అక్షరాలా మనం తయారుచేసుకునే పదార్థం. మనమే వెతికి పట్టుకోవాల్సిన వస్తువు. మనలోపలే ఉన్నా మనం లేదనుకుని వెతికే ఫీలింగ్. ఒక అనుభూతి. ఒక మానసిక స్థితి.
మరి-మనలోపలే ఆనందం టన్నులకొద్దీ ఉంటే మనకెందుకు కనిపించదు? అనిపించదు?
గెలుపు ఆనందం;
ఓటమి బాధ. స్థూలంగా ఆనందానికి- బాధకు మన నిర్వచనం ఇది. లక్ష్యం , గమ్యం ఆనందం.
చేరేదారి, గమనం బాధ. నొప్పి. అసహ్యం. అసహనం. అసంతృప్తి .
గమ్యంతోపాటు గమనాన్ని, చేరే దారిని కూడా ఆనందించాలి, ప్రేమించాలి, అనుభవించాలి.
జీవితం చాలాసార్లు సవాళ్లు విసురుతుంది. ఇక మార్గమే లేనట్లుగా చేస్తుంది. బరువుగా మారుతుంది. దిగులుగా చేస్తుంది. నీరసపరుస్తుంది. నిస్పృహ నింపుతుంది. మొండిగా బండగా మారుస్తుంది. కానీ ఇలాంటి సమయాల్లో కూడా ఆనందాలను వెతుక్కోవాలి. అలవికాని ఆశలు, అంచనాలు, ఇతరులతో పోలిక, ఇతరులు ఏమనుకుంటారోనన్న ఆందోళనలు వదిలేస్తే ఎన్నెన్నో ఆనందాలు కళ్ళముందే ప్రత్యక్షమవుతాయి.
బాధ – కృతజ్ఞత రెండూ ఒక ఒరలో ఒదగవు. చెప్పుల్లేనివాడు పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు. ఎవరూ ఓదార్చలేకపోయారు. అయితే రెండు కాళ్లు లేనివాడిని చూసేసరికి అతడి ఏడుపు ఆగిపోయింది. కాళ్లు లేనివాడిగురించి కన్నీళ్లు ఉబికాయి. ఇప్పుడు అతడిది బాధ కాదు, సహానుభూతి, సానుభూతి, పరిపక్వత. కాళ్లున్నందుకు ఆనందం, కృతజ్ఞత. అలా లేనివాటికంటే – ఎన్నో మనకున్నవాటికి ఎంత కృతజ్ఞతతో ఉండాలి మనం?
చాలామంది డబ్బు, కార్లు, ఇళ్లు, విలాసాల్లో ఆనందం ఉందనుకుని వాటికోసమే ఆగని పరుగుల్లో ఉన్నారు. ఆ పరుగుల్లో నిజానికి ఆనందం తప్ప అన్నీ దక్కించుకుంటున్నారు. ఎంతో కష్టపడి, పరుగులుతీసి సంపాదించుకున్నవి ఎక్కడ పోతాయోనని బతికినంతకాలం బాధపడుతూ ఉంటారు. ఆశకు అంతే లేదు. చిన్న చిన్న బంధాలు, ప్రేమలు, స్నేహాలు, ఇష్టాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, చేతనయిన సాయం చేయడాల్లో అంతులేని ఆనందాలు దాగి ఉన్నాయి.
జీవితంలో బ్యాంక్ బ్యాలన్స్, ఇతర సంపదలు పోగు చేసినట్లే – ఆనందం పోగుచేయడానికి ఏమి చేస్తున్నామో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. చేయకూడనివి ఏవి చేస్తూ ఆనందాలకు దూరమవుతున్నామో సమీక్షించుకోవాలి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మనుషులను నిత్యం ద్వేషిస్తూ ఉంటే – ప్రతిఫలంగా ద్వేషమే వస్తుంది.
చాలా సార్లు పరిస్థితులను యథాతథంగా, లోతుగా కార్యకారణ సంబంధాలతో అర్థం చేసుకోవడమే ఆనందమవుతుంది. అర్థం కాకపొతే అదే అయోమయం, బాధగా మారుతుంది.
ప్రపంచంలో 146 దేశాల్లో సంతోష సూచీని( హ్యాపీనెస్ ఇండెక్స్) లెక్కిస్తే భారత్ అట్టడుగున 136 వ స్థానంలో ఉంది. అంటే 135 దేశాలు మనకంటే చాలా సంతోషంగా ఉన్నాయని మనం నైతికంగా బాధపడాల్సిన పరిస్థితి. సంతోషాన్ని లెక్కించే ప్రమాణాల్లో చాలావరకు సామూహిక కొలమానాలు ఉండడం వల్లే ఇలా సంతోష సూచీలో కిందన పడిపోయాము… లేకుంటేనా! అని కొందరు సాంకేతికంగా మన సంతోషానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని అభయమిస్తున్నారు.
ప్రపంచం మన సంతోషాన్ని గుర్తించనప్పుడు-
అక్కినేని నోట ఆత్రేయ పలికించిన మాటలు ఉండనే ఉన్నాయి!
“నేను పుట్టాను- లోకం మెచ్చింది.
నేను ఏడ్చాను- లోకం నవ్వింది.
నేను నవ్వాను- ఈ లోకం ఏడ్చింది.
నాకింకా లోకంతో పని ఏముంది?డోంట్ కేర్…”
ఎవరి సంతోషం వారిది.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :