ఈరోజునుంచి పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. అనపర్తిలో బహిరంగసభలో పాల్గొనేందుకు చంద్రబాబు కాకినాడ నుంచి బయల్దేరారు. అయితే ఈ సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు. దీనితో ఆగ్రహానికి గురైన చంద్రబాబు ఎలా అడ్డుకుంటారో చూస్తానంటూ అనపర్తికి బయల్దేరారు. మార్గమధ్యంలోని బలభద్రపురం వద్ద బాబు కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా పోలీసు వాహనాన్ని, లారీని పెట్టారు. దీనితో ఒక్కసారిగా కోపోద్రిక్తులైన టిడిపి కార్యకర్తలు ఆ లారీని పక్కకు నెట్టేశారు. పోలీసులు రోడ్డుపై బాబు వాహనాలకు అడ్డంగా కూర్చున్నారు. ఈ ఘటనతో బాబులో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘మీరు చట్టప్రకారం పనిచేయడంలేదు… మీకు అల్టిమేటం ఇస్తున్నా ఈరోజు నుంచి సహాయ నిరాకరణ చేస్తున్న’ అంటూ బాబు వ్యాఖ్యానించారు.
తన పర్యటనకు ముందుగా అనుమతి ఇచ్చి ఇప్పుడు ఎవరో చెప్పారని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఇది పోలీసు రాజ్యం కాదని, రౌడీ రాజ్యమని నిప్పులు చెరిగారు. స్వాతంత్రోద్యమ సమయంలో కూడా మొదట సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైందని, ఆ తర్వాత అది దండి మార్చ్ గా మారి, చివరకు క్విట్ ఇండియా ఉద్యమానికి దారితీసిందని… అదే రీతిలో రాష్ట్రంలో కూడా ఐదుకోట్ల ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.
ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, పోలీసులు మొదటగా చెప్పినదాని ప్రకారం తనకు అనుమతిస్తే సహకరిస్తానని, లేకపొతే దూసుకెల్తానంటూ నిప్పులు చెరిగారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన వాహనాలు తీయకపోతే తానే ముందుకు వెళతానని హుకుం జారీ చేశారు. ప్రజా ఉద్యమానికి ఈరోజు నుంచే నాంది పలుకుతున్నానంటూ ప్రకటించారు.
అనంతరం టిడిపి కార్యకర్తలు లారీని తొలగించారు. బాబు పాదయాత్రగా అనపర్తి బయల్దేరారు, విద్యుత్ కు అంతరాయం కలగడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు మొబైల్ ఫోన్లలో లైట్ ఆన్ చేసి దారి చూపిస్తూ బాబు యాత్ర వెంట నడుస్తున్నారు.