Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమనసులేని వారికెలా తెలుస్తుంది?

మనసులేని వారికెలా తెలుస్తుంది?

Feelings – Emotions:
మనోభావాలు..
దీనంత దురుపుయోగమైన పదం ఇంకోటి లేదు.
అయినదానికీ, కానిదానికీ మనకి మనోభావాలు దెబ్బతినేస్తాయి.
రాసిన మాటకి, పాడిన పాటకి
తీసిన సినిమాకి, వేసిన వేషానికీ
దేనికైనా మనోభావాలు దెబ్బతినొచ్చు.
కులం,మతం, వృత్తి, వేషం దేన్నడ్డం పెట్టుకునైనా మనోభావాల బేరం పెట్టొచ్చు.

కానీ, నిజంగా మనకి మనోభావాలంటే ఏంటో తెలుసా?
అది తెలియాలంటే ఒకసారి ప్రీతిని అడగాలి.
డాక్టర్ అవుతుందనుకుంటే, ఆస్పత్రి బెడ్ మీద చావుబతుకుల్లో పడున్న ప్రీతిని అడగాలి.
అచేతనంగా వున్న కూతురిని చూసి తల్లడిల్లిపోతున్న ఆమె తల్లిదండ్రులని అడగాలి.
మనోభావాలంటే మందినేసుకుని మీడియాలో చేసే గోల కాదు..
తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుంగిపోవడం.
మనోభావాలంటే మైక్ ముందు అరవడం కాదు..
గుండెలోని బాధతో గొంతు దాటలేక మూగబోవడం.
మనోభావాలంటే మతాన్నో, కులాన్నో అడ్డుపెట్టుకుని బేరమాడ్డం కాదు..
మనసులోని బాధని ఎవరూ అర్థం చేసుకోక ఏకాకిగా మిగిలిపోవడం.
ప్రీతికి జరిగింది ఇదే.

తనని అవమానించడానికి వాడెవడు?
ఈ అవమానాన్ని నేనెందుకు భరించాలి?
ఈ ఫ్రెండ్స్, లెక్చరర్స్ నన్నెందుకు అర్థం చేసుకోవట్లేదు?
సమాధానంలేని ఈ ప్రశ్నలు..
పైకి కనపడని అవమానాలు…
ఇవన్నీ మిగిల్చిన తీవ్రమైన మనోవేదన.
అలాగని ఆమె బలహీనమైనదేం కాదు..
ఎదిరించింది..
నిలదీసింది..
ఇంట్లో తండ్రికి చెప్పుకుంది..
పాపం ఆ తండ్రి తన శాయశక్తులా కూతురికి అండగా నిలబడ్డానికి ప్రయత్నించాడు.
కానీ, ఫలితం లేకపోయింది.


నిజానికి ప్రీతి అనుభవించిన బాధ అంత తేలికగా అర్థం కాదు.
పైకి ఎక్కడా అరుపులు కేకలు లేవు.
తిట్టడం కొట్టడం లేదు.
జస్ట్ వాట్సప్ మెసేజ్..
ఒకదాని తర్వాత ఒకటిగా వరుస మెసేజ్ లు..
క్లాస్ స్టూడెంట్స్ అందరూ వుండే గ్రూప్ లో “నువ్వెందుకూ పనికి రావన్న” మెసేజ్ లు
గైడ్ చేసే వంకతో అవమానించే మెసేజ్ లు..
ఒక సీనియర్ స్టూడెంట్, జూనియర్ కి చెప్తున్న మంచి మాటల్లా వుంటాయి.
కానీ, అదేపనిగా పదిమందిలో అవమానించడం,
కనపడని సోషల్ బాయ్ కాట్ చేయడం,
ఇవన్నీ మామూలు విషయాలు కాదు.
అయితే, ఈ వేధింపులు ఒకెత్తు..
మెసేజ్ లే కదా.. దానికే ఇంత సీన్ చేయాలా?
అన్న ప్రశ్న.. మరొకెత్తు.
తోటివిద్యార్థుల్లో, ఫాకల్టీలో కనిపించిన ఈ ఇన్ సెన్సిటివిటీ ప్రీతిని మరింతగా కుంగదీసింది..
అదే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.
చీటికీ మాటికీ మనోభావాలు దెబ్బతినడం గురించి మాట్లాడతాం కానీ,
నిండాపాతికేళ్ళు లేని ఒక అమ్మాయి నిజంగా మనసులో కుంగిపోతుంటే మాత్రం ఎవరికీ అర్థం కాదు.
అందుకే ఇవాళ ఆ అమ్మాయి చావుబతుకుల్లో వుంది.


ప్రీతి విషయంలో వేధించిన సీనియర్ ది ఎంత తప్పో..
అసలు అది వేధింపని అర్థం చేసుకోలేని సమాజానిదీ అంతేతప్పు.
అయితే, ఇంత సీరియస్ చర్చలో కొందరు కేతిగాళ్లు దూరుతారు జాగ్రత్త!
ప్రతి సమస్యలోనూ ఒకే రకమైన రాజకీయం వెతుక్కునే దౌర్భాగ్యులుంటారు జాగ్రత్త!
ఎవరి గురించి ఏమీ తెలియకుండా మతం రంగు పులిమేవాళ్ళుంటారు జాగ్రత్త!

కె. శివప్రసాద్

Also Read :

శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే…

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్