What is the new Ministry of Cooperation?
భారతదేశంలో కేంద్రప్రభుత్వంలో తొలిసారి సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటయ్యింది. ఈ సరికొత్త శాఖకు జగమెరిగిన అమిత్ షా మంత్రి. ప్రధాని మోడీ లక్ష్యమయిన “ఆత్మ నిర్భర మరియు సమృద్ధ భారత్” అమిత్ షా “సహకారం” వల్ల సాధ్యమవుతుందని దేశవ్యాప్తంగా సహకార రంగ ఆర్థిక సంస్థలు అన్ని భాషల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇస్తున్నాయి.
ఎందరో మంత్రులయ్యారు. ఎన్నో శాఖలు మారుతుంటాయి. ఇలా దేశమంతా ఒక కేంద్రమంత్రి శాఖ మీద ప్రకటనలు ఇదివరకు విన్నది కాదు. కన్నది కాదు. అసలే కరోనాతో నష్టపోయిన మీడియాకు ఈ సహకార సంస్థల ప్రకటనలు ఎంతో కొంత సహకరిస్తున్నట్లుంది.
మోడీ- అమిత్ షా ప్రతి కదలికలో దీర్ఘ కాలిక ప్రయోజనాలుంటాయి. వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయి. ఎక్కడ స్విచ్ వేస్తే ఎక్కడ బల్బ్ వెలుగుతుందో వారికి తెలుసు. ఎక్కడ వైర్ కోస్తే ఎక్కడ పవర్ ఆగిపోతుందో కూడా వారికి తెలుసు. అమిత్ షా రాజకీయ ఓనమాలు దిద్దుకున్నదే గుజరాత్ సహకారం బడి ఒడిలో.
మహారాష్ట్రలో చెరకు ఉత్పత్తిదారుల సహకార సంఘాలు దేశంలోనే ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత బలమయినవి. ఇంకోచోట పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు. మరోచోట చేనేత సహకార సంఘాలు. చాలా చోట్ల స్థానిక రాజకీయాలను శాసించే స్థాయిలో సహకార సంఘాల పెత్తనం ఉంటుంది. కొన్ని పార్టీల విజయం వెనుక సహకార సంఘాలు, సహకార బ్యాంకులు, సహకార సంస్థలు ఉండడాన్ని మోడీ- అమిత్ షా ఆలస్యంగా పసిగట్టారు. అంతే రాత్రికి రాత్రి కేంద్రంలో కొత్తగా సహకార శాఖ ఏర్పాటు కావడం, దాన్ని భద్రంగా అమిత్ షా చేతిలో పెట్టడం, వెనువెంటనే ఇక సహకారం పురులు విప్పి, నాట్యమాడుతుందని, సహకారం పూలు పూచి, కాయలు కాచి, పండ్లు బండ్లకెత్తుకోబోతున్నట్లుగా అన్ని భాషల్లో ప్రకటనల పరంపర మొదలయ్యింది. జరగబోయేదేమిటో దేశ ప్రజలు ఎవరికివారు ఊహించుకోవచ్చు.
ఈనాడు కూడా ఈ సరికొత్త సహకార శాఖ మీద దృష్టి పెట్టింది. మంచిదే. ఈ విషయం మీద బెంగళూరు ఐ ఐ ఎం ప్రొఫెసర్ ఇంటర్వ్యూను ప్రచురించింది. “సహకారమా…రాజకీయమా!” అన్న హెడ్డింగ్ పెట్టింది. సహకార శాఖను సంస్కరించాల్సిన అవసరం ఉందంటూనే…రాజకీయ కోణాన్ని కూడా ఈ ఇంటర్వ్యూ స్పృశించింది.
Ministry of Cooperation :
ఏం జరుగుతుందో చూడాలి అంటూనే… ఏం జరుగుతుందో హెడ్డింగులోనే చూపించేసింది ఈనాడు. సహకారమా తరువాత మూడు చుక్కలు; రాజకీయమా తరువాత ఆశ్చర్యార్థకంలోనే ఈనాడు ధ్వని తెలిసిపోతోంది.
ఎప్పుడో పన్నెండు వందల సంవత్సరాల క్రితం సాహిత్యంలో ఆనందవర్ధనుడు ప్రతిపాదించినది ధ్వని సిద్ధాంతం. ఆయన రాసిన ధ్వన్యాలోకం మొన్న మొన్నటివరకు సాహితీ విద్యార్థులకు చదివి తీరాల్సిన అలంకార శాస్త్రం. కావ్యంలో నేరుగా చెప్పే వాచ్యార్థం, సాధించే లక్ష్యార్థం దాటి కవి వినిపించేదే ధ్వని అని, వ్యంగ్యార్థమని ఆనందవర్ధనుడు రుజువు చేశాడు. “అబ్బో! చెప్పాడు బృహస్పతి” అన్న మాటలో ధ్వని- నెగటివ్. కానీ వాచ్యంగా ఆ మాటల్లో ఎక్కడా నెగటివ్ మాటలు లేనే లేవు. “రోడ్డు మీదే మా ఇల్లు” అంటే ధ్వని- రోడ్డుకు దగ్గరగా, లేదా రోడ్డుకు ఆనుకుని ఉందని. రోడ్డు మీద ఇల్లుందని కాదు. నిజానికి రోడ్డు మీద ఇల్లుంటే “రోడ్డుకు అడ్డంగా ఉండేదే మా ఇల్లు” అని చెప్పుకోవాలి. “కళ్లల్లో నిప్పులు చెరుగుతున్నాడు” అంటే ధ్వని- కోప్పడుతున్నాడు అని. కళ్ల ముందు చిన్న చిన్న చేటలు పెట్టుకుని వేడి వేడి నిప్పులు చెరుగుతున్నట్లు ఎవరూ విజువలైజ్ చేసుకోరు.
ఆనందవర్ధనుడి ధ్వన్యాలోక అలంకార శాస్త్రం మోడీ- అమిత్ షా చదివి ఉండకపోవచ్చు. కానీ మోడీ- షాల ధ్వని సిద్ధాంతం ముందు సర్వ రాజకీయాలంకార ధ్వని శాస్త్రాలు చిన్నబోతాయి. ఈనాడు మాత్రం తన పాఠకులకు మోడీ- అమిత్ షా మనసులో ఏముందో ఏమిటో ధ్వనిగా చెప్పింది. ధ్వనించిన ఈ నూత్న సహకార మంత్రిత్వ అలంకార శాస్త్రాన్ని సమాజం ఎలా అర్థం చేసుకుంటుందో? ఎలా అన్వయించుకుంటుందో? భవిష్యత్తులో సహకారం అన్న మాట ఎలా ధ్వనిస్తుందో?
-పమిడికాల్వ మధుసూదన్
Read More: మంత్రివర్గం-మధ్యే మార్గం
Read More: కలవారి చేతిలో విలువయిన కాలం