దక్షిణాదిలో అందులోనూ ప్రత్యేకించి తమిళనాడులో టిఫిన్లలో ప్రముఖమైనది ఇడ్లీ సాంబార్. నాణ్యతను బట్టి అయిదు రూపాయలు మొదలుకుని ఇరవై అయిదు రూపాయలవరకూ ఉంటుంది ఒక ఇడ్లీ ధర. హోటల్ బట్టి ధర మారుతుంది. స్టార్ హోటళ్ళలో ఒక ఇడ్లీ ధర అరవై రూపాయలకు కూడా అమ్ముతుంటారు. ధరవరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లోనూ తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక బామ్మ ఇప్పటికీ ఒక ఇడ్లీని ఒక్క రూపాయకే అమ్ముతోంది. ఆమెను అందరూ రూపాయి ఇడ్లీ బామ్మ అనే పిలుస్తుంటారు అందరూ.
కోయంబత్తూరు జిల్లా ఆలాందురై సమీపంలో ఉన్న వడివేలంపాళై ప్రాంతానికి చెందిన ఆ బామ్మ పేరు కమలత్తాళ్. ఆమె వయస్సు ఎనబై అయిదేళ్ళు. అయితేనేం, ఈ వయస్సులోనూ ఎంతో చురుకుగా ఉంటూ రోజూ పోద్దున్నే నాలుగ్గంటలకల్లా నిద్ర లేస్తుందీ బామ్మ. ముందుగా తన ఇంటి పనులను చకచకా కానిచ్చుకుంటారు.
అనంతరం తాను నడుపుతున్న ఇడ్లీ దుకాణాన్ని శుభ్రం చేసి వంటపనులను చేపడుతుంది. ఎవరి సహాయమూ లేకుండా ఒంటరి మనిషిగా ఇడ్లీ చట్నీ సాంబార్ తయారు చేసి వినియోగదారులకు వేడివేడిగా వడ్డిస్తుంది. ముప్పై ఏళ్ళ క్రితం ఆమె ఇడ్లీ వ్యాపారం ప్రారంభించినప్పుడు ఒక ఇడ్లీ ఇరవై అయిదు పైసలకు అమ్మేది. పదేళ్ళ క్రితం యాభై పైసలకు అమ్మేది. ఇప్పుడు రూపయికి అమ్ముతోంది. ముప్పై ఏళ్ళల్లో ఇడ్లీ ధర ఒక్కింటికి డెబ్బయి అయిదు పైసలకు మాత్రమే పెంచి వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ ఇడ్లీ పిండి రుబ్బడానికి మాత్రమే గ్రైండరుని ఉపయోగిస్తోంది. చట్నీకి మాత్రం ఇప్పటికీ రుబ్బురోలునే ఉపయోగిస్తోంది. తక్కువ ధరకు వేడివేడి ఇడ్లీలు, రుచికరమైన చట్నీ, సాంబార్ లభించడంతో తెల్లవారుజామునుంచే వినియోగదారులు ఈమె దుకాణం ముందర చేరుకుంటారు. కూలి పనులకు వెళ్ళేవారు మొదలుకుని స్కూలుకి కాలేజీకి ఆఫీసులకీ వెళ్ళే వాళ్ళందరూ వందల సంఖ్యలో ఇక్కడికొచ్చి ఇడ్లీ తినిపోతుంటారు.
ఈమె దుకాణంలో టేబుళ్ళు ఉండవు.కుర్చీలుండవు. ఫ్యాన్లుండవు. అయినా దుకాణం ముందర ఉన్న అరుగుపైనే కూర్చుని కావలసిన ఇడ్లీలు తింటారు. అంతేకాదు, ఆమెను ప్రశంసించిపోతారు. స్థానికులేకాక బయటి ప్రాంతాల నుంచి ఇక్కడికి పని మీద వచ్చే వాళ్ళుకూడా బామ్మ దుకాణంలో ఇడ్లీ రుచి చూసిపోవడం విశేషం. అందరూ ఈమెను రూపాయి ఇడ్లీ బామ్మ అనే పిలుస్తారు.
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుగారుకూడా ఈ బామ్మ పనితనానికి ప్రశంసలు చెప్పారు.
భారత్ పెట్రోలియం సంస్థ తరఫున ఈ బామ్మకు గ్యాస్ సిలిండర్ మంజూరూ చేశారు.
అలాగే ముంబైకి చెందిన ప్రముఖ సంస్థ ఒకటి ఈమెకు ఉచితంగా గ్రైండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
కొయంబత్తూరు జిల్లా అధికారిరాజామణి ఆమెను ఆహ్వానించి కొనియాడారు. ప్రభుత్వం తరఫున ఉండేందుకు ఒక గూడు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
బామ్మ మాట్లాడుతూ పదేళ్ళ క్రితంవరకూ యాబై పైసలకే ఇడ్లీ అమ్మాను. కానీ పప్పూ ఉప్పుల ధరలు పెరగడంతో తప్పని పరిస్థితిలో ఒక్క ఇడ్లీ రూపాయికి అమ్మవలసి వస్తోందని అన్నారు. చాలా మంది ఇడ్లీ ధర పెంచమని చెప్పినా తాను పెంచదలచుకోలేదన్నారు. తాను చేసే ఇడ్లీ చట్నీ సాంబార్ రుచి బాగుందనే వినియోగదారులు ఇప్పటికీ తన దుకాణానికి వచ్చిపోతుండటం ఆనందంగా ఉందన్నారు. రోజుకి నూటయాబై రూపాయలు మొదలుకుని రెండు వందల రూపాయల వరకూ లాభం ఉంటుందని, తన రోజువారి అవసరాలు తీరడానికి ఈ డబ్బులు సరిపోతాయని ఆమె మహదానందంగా చెప్పారు.
– యామిజాల జగదీశ్