జపాన్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అంతరిక్ష పరిశోధనల్లో చేదు అనుభవం ఎదురైంది. హెచ్3 రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో ఆ దేశం దాన్ని పేల్చివేసింది. మంగళవారం తనగాషిమా స్పేస్ సెంటర్ నుంచి ఎగిరిన తర్వాత ఆ రాకెట్‌లో రెండో దశలో ఇగ్నిషన్ కాలేదు. మిషన్ సక్సెస్ కాలేదని గ్రహించిన శాస్త్రవేత్తలు.. ఆ రాకెట్‌ను పేల్చేశారు.
రాకెట్ ప్రయోగం విఫలం కావడం జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీకి ఉహించని ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది. అతి తక్కువ ఖర్చుతో హెచ్3 రాకెట్‌ను జపాన్ డెవలప్ చేసింది. ఆ రాకెట్ ఎత్తు 57 మీటర్లు. నిజానికి గత నెలలోనే ఆ రాకెట్ ఎగరాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల దాన్ని వాయిదా చేశారు.
నింగిలోకి ఎగిరిన తర్వాత సెకండ్ స్టేజ్ ఇంజిన్ విఫలం కావడంతో.. రాకెట్‌లో ఇగ్నిషన్ కాలేదు. దీంతో మిషన్ అధికారులు మాన్యువల్‌గా ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. డిస్ట్రక్ట్ కమాండ్‌తో దాన్ని పేల్చివేశారు. డేటాను పరిశీలించిన తర్వాత ఏం జరిగిందో చెబుతామన్నారు.