చైనా పాలకులు పొరుగు దేశాల్లో చిచ్చు పెట్టడం…కయ్యానికి కాలు దువ్వే కుట్రలకు ప్రణాలికలు రచిస్తుంటే ఆ దేశంలో యువత పేడదోవ పడుతోంది. అలవి కాని పోటీ తత్వం చైనాలో విపరీత దోరణులకు దారితీస్తోంది. చైనాలో ఇప్పుడు అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ను ఇవ్వడం ట్రెండ్‌గా మారిపోయింది. ప్రేయసి లేని యువకులు వీకెండ్స్, హాలీ డేస్ టైమ్‌లో ఇలా గర్ల్‌ఫ్రెండ్‌ను రెంట్‌కు తీసుకెళ్లడం ఇప్పుడు డ్రాగన్ దేశంలో ఎక్కువైపోయింది. దక్షిణ చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్సు లోని వివిధ నగరాల్లో ఏకంగా షాపింగ్ మాల్స్ లో ఇలా కిరాయికి ఇచ్చే సంస్కృతి బహిరంగంగానే సాగుతోంది. చాలా రోజులుగా సీక్రెట్‌గా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఒక స్ట్రింగ్ ఆపరేషన్‌లో బయటపడింది.
ఎలా బయటకొచ్చింది?
అమ్మాయిలు కావాలంటే రెంట్‌కు ఇస్తున్నారని.. దీనికోసం పలు వెబ్‌సైట్స్ కూడా ఉన్నాయని తెలిసిన ఓ రిపోర్టర్ స్ట్రింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాడు. చైనాలోని నాజియాంగ్‌కు చెందిన సదరు రిపోర్టర్ తనకు తెలిసిన ఒక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి.. తనకు గర్ల్‌ఫ్రెండ్ కావాలని ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఇచ్చిన కొద్దిరోజులకే అతనికి ఒక యువతి నుంచి ఫోన్ వచ్చింది. అతను ఇచ్చిన ప్రకటన చూశానని.. అతనికి గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండేందుకు సిద్ధమేనని చెప్పింది. ఇందుకోసం రోజుకు వెయ్యి యువాన్లు ( రూ.12వేలు ) ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి అతను అంగీకరించడంతో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ సమయంలో ఆ అమ్మాయి నుంచి పలు ఆసక్తికర విషయాలు రాబట్టాడు. ప్రస్తుతం తాను డిగ్రీ చదువుతున్నానని.. ఖాళీ సమయాల్లో ఇలా గర్ల్‌ఫ్రెండ్‌గా రెంట్‌కు వెళ్తున్నానని చెప్పింది. అయినప్పటికీ నెలకు రూ.60 వేల (5000 యువాన్లు ) వరకు సంపాదిస్తున్నానని ఆ యువతి బయటపెట్టింది. నార్మల్ డేస్ కంటే కూడా వీకెండ్స్, హాలీ డేస్‌లో ఎక్కువ మొత్తంలో చెల్లిస్తారని కూడా బయటపెట్టింది.
ఈ కల్చర్ ఎందుకు మొదలైంది?
చైనాకు చెందిన యువతీయువకులు ఇప్పుడు పెండ్లి, పిల్లల కంటే కూడా ఎక్కువగా జీవితంలో సెటిల్ అవ్వాలనే చూస్తున్నారు. మంచి ఉద్యోగంలో చేరి తనకంటూ ఆస్తిపాస్తులు సంపాదించుకునే దాకా వాటిపై ధ్యాస పెట్టడం లేదు. పెండ్లి చేసుకోకపోవడమే కాదు కదా.. కనీసం లవ్ చేయాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. తమ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రయత్నిస్తున్న యువకులకు తల్లిదండ్రుల నుంచి వేధింపులు ఎక్కువైపోతున్నాయట. తొందరగా పెండ్లి చేసుకోవాలని.. పిల్లలను కనాలని ఒత్తిడులు వస్తున్నాయట. ఇలాంటి ఒత్తిడులు ఎక్కువ కావడంతో తల్లిదండ్రుల నుంచి తప్పించుకునేందుకు ఇలా గర్ల్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకోవడం మొదలుపెట్టారట. ఇలా రెంట్‌కు అమ్మాయిని తీసుకుని.. ఆమెను తమ గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయం చేస్తున్నారు. ఆ తర్వాత కొద్దిరోజుల వరకు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ప్రెజర్ ఉండటం లేదట. ఇలా చాలారోజులుగా సీక్రెట్‌గా ఈ వ్యవహారం నడుస్తోంది. అయితే యువకుల నుంచి డిమాండ్ ఎక్కువ కావడంతో ఈ బిజినెస్ గురించి చాలామందికి తెలిసిపోయింది.