పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధికి గుజరాత్‌లోని సూరత్ కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించడం వార్తల్లో నిలిచింది. కోర్టు తీర్పుతో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగలేరని అనర్హత వేటు వేస్తూ పార్లమెంటు సచివాలయం కొద్ది సేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లోకసభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. చట్టం ప్రకారం.. రాహుల్ గాంధీ, తన వయనాడ్ సీటును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పర్యటించారు రాహుల్ గాంధీ. కోలర్‌లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై, మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “దొంగలందరికి.. మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటోంది?” అని అన్నారు. దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్ మోదీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ ఇంటి పేరు ఉండటంతో.. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో.. 2019లో గుజరాత్‌లోని సూరత్ జిల్లా కోర్టులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై నాలుగేళ్ల విచారణ పూర్తి చేసిన అనంతరం గురువారం కీలక తీర్పును వెలువరించింది సూరత్‌లోని జిల్లా కోర్టు. రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్షను విధించింది.